సీబీఐకి ఏమయ్యింది.?

ప్రపంచంలోని మేటి దర్యాప్తు సంస్థల్లో సీబీఐ ఒకటి. దేశంలో ఏదన్నా కేసుని సీబీఐ విచారిస్తోందంటే, నిందితులు గడగడలాడాల్సిందేనన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో బలంగా వుంది. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు సీబీఐ అంటే…

ప్రపంచంలోని మేటి దర్యాప్తు సంస్థల్లో సీబీఐ ఒకటి. దేశంలో ఏదన్నా కేసుని సీబీఐ విచారిస్తోందంటే, నిందితులు గడగడలాడాల్సిందేనన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో బలంగా వుంది. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు సీబీఐ అంటే జనంలో గౌరవం పోలేదుగానీ, నమ్మకమైతే తగ్గింది. గడచిన దశాబ్ద కాలంలో సీబీఐ స్థాయిని రాజకీయం దిగజార్చేసింది.

టూజీ స్పెక్ట్రమ్‌, కోల్‌ గేట్‌ వంటి పెద్ద పెద్ద కుంభకోణాల విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఓ దశలో, సీబీఐని రాజకీయ నాయకులు తమ ఇష్టానికి వాడుకుంటున్నారనీ, సీబీఐ వ్యవహారాల్లో రాజకీయ జోక్యమేంటని సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించిందంటే సీబీఐ మీద రాజకీయ పెత్తనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా, టూజీ స్పెక్ట్రమ్‌ కేసు విచారణ విషయంలో దర్యాప్తు బాధ్యతలనుంచి తనంతట తానుగా తప్పుకోవాలని సీబీఐ డైరెక్టర్‌ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇది ఓ రకంగా సీబీఐకి పెద్ద దెబ్బ కిందే పరిగణించాల్సి వుంటుంది. లక్షన్నర కోట్ల టూజీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో యూపీఏ సర్కార్‌లోని ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొందరు జైలుకెళ్ళి వచ్చారు కూడా.

నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నవారు, జైలుకు వెళ్ళి పదవులు పోగొట్టుకున్నవారు.. బెయిల్‌ వచ్చాక, సచ్ఛీలురుగా ప్రమోట్‌ చేయబడ్డారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణ సరిగ్గా జరగడంలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలా సీబీఐ చులకనైపోయింది. ఇప్పుడు ఎన్డీయే సర్కార్‌ దేశాన్ని పాలిస్తోన్న దరిమిలా, సీబీఐ ఖ్యాతి పెరుగుతుందా.? మరింత దిగజారుతుందా.? కాలమే సమాధానం చెప్పాలి.