దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణెమం సృష్టించిన టెర్రరిస్టుల్లో ఒకడు సజీవంగా దొరికితే, ఆ దాడిలో అనేక మంది సాధారణ పౌరులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోతే, పట్టుబడినవాడ్ని కొత్తల్లుడిగా చూసేంత గొప్ప సంస్కృతి మనది. నరరూప రాక్షసుడని తెలిసీ, ఆ టెర్రరిస్టు గొంతెమ్మ కోర్కెల్ని తీర్చడమే కాదు, అతని భద్రత కోసం కోట్లు ఖర్చు చేసిన ఘనత మన పాలకులేక చెల్లుతుంది. సమాజంలో వుండకూడని ఓ మానవ మృగానికి ఉరిశిక్ష పడితే, దాన్ని నిరసిస్తూ కొందరు ఆందోళనలకు దిగారంటే, ఎంత గొప్ప మానవత్వం వారిలో వుందో కదా.!
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, టెర్రరిస్టులు, దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు.. వీళ్ళేక ‘మానవ హక్కులు’ వుంటాయి. సాధారణ పౌరులు, ఆఖరికి పోలీసులు.. ఏమైపోయినా ఎవరికీ అనవసరం. పోలీసులు విధి నిర్వహణలో వీరోచిత పోరాటం చేసి చనిపోతే, ‘సాహస పోలీస్’ అనే గుర్తింపు ఇచ్చి ఊరుకుంటాం. వారి కుటుంబాల్ని ఆదుకుంటామని పాలకులు చెబుతారుగానీ, కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన పోలీస్ కుటుంబాలు, ఆ తర్వాత పడే ఆవేదన, వారి జీవన విధ్వంసం.. ఇవేవీ ఎవరికీ కనిపించవుగాక కనిపించవు. తీవ్రవాదుల దాడులు జరిగినప్పుడు దేశమంతా ఒక్కటవుతుంది.
బాధిత కుటుంబాలకు బాసడగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. ప్రభుత్వాలూ అప్పటికప్పుడు హడావిడి చేస్తాయి. బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఎక్స్‌గ్రేషియాలు చెల్లించడం సంగతి అటుంచితే, కొస ప్రాణంతో బయటపడ్డవారి పరిస్థితి అత్యంత దుర్భరం. ప్రభుత్వం అప్పటికప్పుడు వైద్యం చేయించేసి, బాధితుల్ని ఇంటికి పంపేస్తుంది. ఆ తర్వాత వారి జీవనం అత్యంత బాధాకరం. వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక, ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగలేక.. ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుంటారు. ఇది ఒక చీకటి కోణం.
ఇక, ఎన్‌కౌంటర్ విషయానికొస్తే.. ఎన్‌కౌంటర్ జరిగిందనగానే ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ‘ఫేక్ ఎన్‌కౌంటర్’ అనేందుకు పోటీపడ్తారు ‘హక్కుల సంఘాల’ పేరుతో కొందరు. నిజమేంటి.? అన్నది వేరే విషయం. హడావిడి చేశామా? లేదా? అన్నదే ముఖ్యమిక్కడ. చచ్చింది టెర్రరిస్టా? దోపిడీ దొంగా.? నరరూప రాక్షసుడా? అన్నది వాళ్ళకి అనవసరం. చట్టమే శిక్షించాలి.. అని లెక్చర్లు దంచేస్తారు. నక్సలైట్ల ఎన్‌కౌంటర్ విషయంలో ప్రతిసారీ ఇదే తంతు.
కొన్ని ఫేక్ ఎన్‌కౌంటర్లు జరుగుతుండడంతో, పోలీసులపై ప్రతిసారీ ‘ఫేక్ ఎన్‌కౌంటర్’ అనే నింద పడ్తుంటుంది. ఎన్‌కౌంటర్ అంటే కాల్పులు, ఎదురు కాల్పులు.. దాడులు ప్రతి దాడులు వుండాలి. దాడుల్ని క్రియేట్ చేసి, ప్రతిదాడులు చేశామని పోలీసులు చెప్పిన సందర్భాలు అనేకం. అదే సమయంలో, దాడులు జరిగి, ప్రతిదాడులకు అవకాశం లేక పోలీసులు మృత్యువాత పడ్డ సంఘటనలపై హక్కుల సంఘాల ప్రతినిథులు ఏం సమాధానం చెప్తారు.?
ఛత్తీస్‌ఘడ్‌లో ఇటు పోలీసులు, అటు నక్సలైట్లు మారణెమం సృష్టిస్తున్నారు. ఇందులో ఎవరికీ సందేహాల్లేవు. అక్కడే కాదు, చాలా చోట్ల జరుగుతోన్నది ఇదే. ఎవరికి వారు తమది ధర్మ పోరాటం అంటారు. నక్సలైట్లది ధర్మ పోరాటం, పోలీసులది విధి నిర్వహణ. ఎవరి వాదనలు ఎలా వున్నా జరుగుతున్నది ప్రాణ నష్టమే. ఒకప్పటిలా నక్సలిజం / మావోయిజంలో సిద్ధాంతాలు ఇప్పుడున్నాయా.? వుంటే, పోలీసుల్ని ఊచకోత కోయమని ఏ సిద్ధాంతం చెబుతంది.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఏ మావోయిస్టు సానుభూతిపరుడు, ఏ హక్కుల సంఘాల ప్రతినిథీ ముందుకు రాడు. తప అటూ ఇటూ రెండు వైపులా జరుగుతోంది.
అంతిమంగా లాభపడ్తున్నది రాజకీయమే తప్ప, సామాన్యులు కానే కారు. ఓ పార్టీ హయాంలో ఎన్‌కౌంటర్ జరిగితే ఆ టైమ్‌లో విపక్షంలో వున్న పార్టీ విమర్శలకు దిగుతుంది. నిన్న ఎన్‌కౌంటర్‌పై విమర్శలు చేసిన పార్టీ నేడు అధికారంలోకి వస్తే, ఆ తర్వాత జరిగే ఎన్‌కౌంటర్‌ని సమర్థించుకుంటుంది. ఇదీ రాజకీయం. ఈ రాజకీయం పుణ్యమా అని పోలీసుల్లో ఆత్మస్థయిర్యం సన్నగిల్లుతుంది. విధి నిర్వహణలో అంకిత భావం తగ్గిపోతుందేమోనన్న వాదనలూ లేకపోలేదు. ఒక్కోసారి ఎన్‌కౌంటర్లలో కీలక నేతలు పట్టుబడితే, అధికారంలో వున్నవారు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ, తప్పించేస్తుంటారన్న విమర్శలకు ఏ రాజకీయ పార్టీ కూడా నిఖార్సుగా సమాధానం చెప్పదుగాక చెప్పదు. ఎందుకంటే అందరూ ఆ తానులోని గుడ్డ ముక్కలే.
సిద్ధాంతాల కోసమంటూ తుపాకులు పట్టి, అడవులకు వెళ్ళి సాధించేదేముంటుంది? అన్న ప్రశ్న ఈనాటిది కాదు. అడవుల్లో గన్ను పట్టి మావోయిస్టులు సాధించేదేమిటోగానీ, వారిని ఏరి పారేయడానికి ‘కూంబింగ్’ పేరుతో పోలీసులు గన్నులు పట్టుకుని వెళ్ళడమంటే, తమ పౌరుల్ని తామే అంతమొందించడానికి ప్రభుత్వం పోలీసుల్ని శాంతి భద్రతలంటూ ఆయుధంగా వాడుకుంటోందన్నది నిర్వివాదాంశం. అసలు సమస్య ఎక్కడ? దాని మూలాలేంటి.? అన్న ఆలోచనల్ని పాలకులు, హక్కుల సంఘలు ఎపడో పక్కన పారేశాయి.
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్, కాల్పుల్లో పోలీసులు, తీవ్రవాదులూ చనిపోయారు. హక్కుల సంఘాలు మాత్రం తీవ్రవాదుల తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల మాటేమిటి.? ఇక్కడ ఇంకో కొత్త కోణం ‘మతం’. ఓ మతానికి చెందిన ప్రతినిథులు, ‘కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్’ అంటూ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ని అభివర్ణించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
మతం, ప్రాంతం, రాష్ర్టం.. ఇలా ఏదో ఒక సెంటిమెంట్‌ని తెరపైకి తీసుకొస్తే, తద్వారా తలెత్తే దుష్పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు.? ఎన్‌కౌంటర్, హత్య.. ఇదేదీ సమర్థనీయం కాదు. నాణానికి అటూ ఇటూ చూడగలిగినపడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, రాజకీయ అవసరాలు ఓ చావుని భిన్న కోణంలో చూపుతుంటే, అది సమాజానికి చేటు కలిగించక, ఎప్పటికైనా మేలు కలిగిస్తుందా.? ఛాన్సే లేదు. ఈ ఎన్‌కౌంటర్లు ఇలానే జరుగుతుంటాయి.. హక్కుల సంఘాలు గగ్గోలు పెడ్తూనే వుంటాయి.. రాజకీయం వెర్రి తలలు వేస్తూనే వుంటుంది.
వెంకట్ ఆరికట్ల