మన దగ్గర పారని మలయాళ మంతం!

ఒక భాషలో సుపీరియర్ స్థాయికి ఎదిగిన సినిమావాళ్లెవరికైనా పరాయి భాషల్లో కూడా క్రేజ్ పెరుగుతుంది. ఒక భాషలో వరస హిట్లను సొంతం చేసుకొంటే.. మరో భాషలో ఆటోమెటిక్‌గా అవకాశాలు లభిస్తాయి. ఇది సహజన్యాయం. మరి…

ఒక భాషలో సుపీరియర్ స్థాయికి ఎదిగిన సినిమావాళ్లెవరికైనా పరాయి భాషల్లో కూడా క్రేజ్ పెరుగుతుంది. ఒక భాషలో వరస హిట్లను సొంతం చేసుకొంటే.. మరో భాషలో ఆటోమెటిక్‌గా అవకాశాలు లభిస్తాయి. ఇది సహజన్యాయం. మరి మార్కెట్ పరిధి తక్కువగా ఉన్న పరిశ్రమల నుంచి పెద్ద మార్కెట్ ఉన్న పరిశ్రమలోకి ఇలా ఎవరైనా ప్రవేశిస్తే వారికి ేక్రజ్ పెరిగినట్టే! ఇలా తమ పరిశ్రమ దాటి సత్తా చాటే వాళ్లలో మలయాళీలు ముఖ్యులు. అర్థవంతమైన, కమర్షియల్ సినిమాలను రూపొందించడంలో మలయాళీలు మంచి స్థాయిలో ఉంటారు. కేరళనాట వచ్చిన అనేక సినిమాలను దేశంలోని అనేక చిత్ర పరిశ్రమల వారు రీమేక్ చేసుకొంటూ ఉండటమే దీనికి రుజువు. మరి కేవలం సినిమాలే కాదు.. ఊపు మీద ఉన్న దర్శకులకు కూడా బౌండరీలు ఉండవు. వారు కూడా సరిహద్దులు దాటేసి వచ్చి సినిమాలు రూపొందిస్తూ ఉంటారు. అలా మలయాళ గడ్డ దాటి తెలుగు వైపు వచ్చినవారున్నారు. విశేషం ఏమిటంటే.. అక్కడ సూపర్ హిట్స్ కొట్టిన వీళ్లు తెలుగులో మాత్రం సత్తా చాటలేకపోయారు. తమ మార్కును చూపించలేకపోయారు. దీంతో వీరి ప్రస్థానం ఒకటీ రెండు సినిమాలకే పరిమితం అయ్యింది!

ఫాజిల్…

మలయాళంలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. అక్కడి స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టీలతో సూపర్ హిట్ సినిమాలు తీయడమే కాదు.. ఎంటర్ టైన్‌మెంట్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు ఫాజిల్. ఇలాంటి దర్శకుడు మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఇతడి దర్శకత్వంలో నటించడానికి చాలామంది దక్షిణాది హీరోలు ఉబలాటపడిపోయారు. ఇతడితో సినిమా తీయడానికి దక్షిణాది నిర్మాతలు ఉత్సాహపడ్డారు. అలాంటి ఉత్సాహంతోనే ‘‘జగపతి ఆర్ట్స్’’ బ్యానర్ అధినేత రాజేంద్ర ప్రసాద్ ఫాజిల్‌తో ఒక తెలుగు సినిమా రూపొందించాడు. అదే ’కిల్లర్’ హీరో నాగార్జున, హీరోయిన్ నగ్మా.. ఇంకా శారద, బేబీ షామిలీ ముఖ్యపాతల్లో వచ్చిన సినిమా అది. అప్పటికే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ సినిమాకు రీమేక్ ‘కిల్లర్’. రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి సేఫ్‌జోన్‌లో ఉంటుందనుకొన్నారు. అయితే ‘కిల్లర్’ తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు! మ్యూజికల్‌గా హిట్ అయినంత స్థాయిలో ఆ సినిమా తెలుగులో హిట్ కాలేదు! అంతే.. ఆ సినిమా ఆడకపోయే సరికి మళ్లీ ఫాజిల్‌ను కలవరించే తెలుగు హీరోలు, నిర్మాతలు లేకపోయారు. ఫాజిల్ కథలను రీమేక్ చేశారు కానీ.. ఫాజిల్‌తో మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమా రాలేదు!

ప్రియదర్శన్:

మల్లూవుడ్ ఆవల బాగా పేరు పొందిన దర్శకుడు ప్రియన్. బాలీవుడ్ , కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఇతడి పేరు సుపరిచితమే. ప్రియదర్శన్ మలయాళంలో రూపొందించిన సినిమాలు లెక్కకు మిక్కిలి తెలుగులో రీమేక్ అయ్యాయి. కథ- ప్రియదర్శన్’’ అని టైటిల్ కార్డ్స్‌లో పడటమే చాలా సినిమాలకు ప్లస్ పాయింట్. మరి అలాంటి సమయంలో.. తెలుగు ప్రియదర్శన్ కథకు పిచ్చ క్రేజ్ ఉన్న సమయంలో మనోళ్లు ఆయనను ఇక్కడకు రప్పించుకొన్నారు. ఆ దర్శకుడు ఇంకా హిందీలో ట్రయల్స్ వేయకముందే.. మనోళ్లు ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. విశేషం ఏమిటంటే.. ప్రియదర్శన్ తొలి తెలుగు సినిమాలో కూడా నాగార్జునే హీరోగా నటించాడు. జయభేరీ ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ నిర్మించిన ‘‘నిర్ణయం’’ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు. అది కూడా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొందించిన ‘వందనం’ అనే సినిమాకు రీమేక్. అక్కడ సూపర్ హిట్. తెలుగులో మాత్రం ఆ సినిమా ఆడలేదు. ఇళయరాజా పుణ్యమా అని మ్యూజికల్‌గా సూపర్ అయిన సినిమా ఆకట్టుకొనేలా ఉంటుంది కానీ.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. మరి ఎంతైనా ప్రియదర్శన్ ఫేమస్ కదా… అందుకే తెలుగులో మరో సినిమా వచ్చింది. అదే ‘గాండీవం’. పవర్ ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణలు ముఖ్యపాత్రల్లో చేశారు. ఇది కూడా మ్యూజికల్‌గా హిట్టే. కానీ కమర్షియల్‌గా ఆకట్టుకోలేదు. సినిమా ప్లాప్. ఆ తర్వాత ప్రియదర్శన్ కథలను ఆధారంగా చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి కానీ.. ఆ దర్శకుడు మళ్లీ దర్శకత్వం వహించలేదు. అయితే కొన్ని డబ్బింగ్‌లు సూపర్ అనిపించుకొన్నాయి. ప్రియదర్శన్ మలయాళ, హిందీల కోసం రూపొందించిన ‘కాలాపానీ’ సినిమా తెలుగులోకి డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. 

సిద్ధిక్: 

ఈ దర్శకుడి మరో ఫెయిల్యూర్ స్టోరీ. లాల్‌తో కలిసి సిద్ధిక్ మలయాళంలో ఇరవై సినిమాలు తీస్తే వాటిలో 15 సినిమాల వరకూ సూపర్ హిట్సే! అక్కడ మాత్రమే కాదు.. వీరు రూపొందించిన సినిమాలు అనేకం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయ్యాయి. అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యాయి. మరి అపజయం అంటే ఎరగనటువంటి సిద్ధిక్‌కు చేదు అనుభవం మిగిలింది తెలుగులో. నితిన్ హీరోగా కొంతకాలం క్రితంత ‘మారో’ అనే సినిమా ఒకటి వచ్చింది గుర్తుందా.. దానికి దర్శకుడు సిద్ధికే! ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ కావడం కన్నా.. విడుదలకు ముందు నెలకొన్న ప్రతిష్టంభనే సిద్ధిక్‌ను మరింతగా ఇబ్బంది పెట్టింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు విడుదల కాలేదు ఆ సినిమా. ఎట్టకేలకూ విడుదల అయినా ప్రయోజనం లేకపోయింది. మలయాళీ స్టార్ డైరెక్టర్‌కు తెలుగులో డిజాస్టర్ అనుభవం మిగిలింది. ఆ తర్వాత సిద్ధిక్ తెలుగువైపు చూడలేదు. ఇతడు మలయాళంలో రూపొందించిన ‘బాడీగార్డ్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు సిద్ధిక్ దర్శకత్వం వహించాడు. కానీ తెలుగు వైపు రాలేదతడు.

షాజీ కైలాష్: 

90లలో సురేష్ గోపీని హీరోగా పెట్టి సూపర్ హిట్ పోలీస్ కథలను తెరకెక్కించిన దర్శకుడు షాజీ కైలాష్. ఆ థిల్లర్లు వండర్ ఫుల్‌గా ఉంటాయి. ఆ సినిమాలు అనేకం తెలుగులోకి కూడా డబ్ అయ్యి హిట్ అయ్యాయి. సౌతిండియా సినిమాకే ప్రత్యేకం అనిపించుకొన్నాయి షాజీకైలాష్ సినిమాలు. మరి అలాంటి దర్శకుడిని కూడా మనోళ్లు తీసుకొచ్చారు. అది కూడా కొంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో. తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ మోహన్ బాబు నిర్మాతగా రూపొందించిన ‘విష్ణు’ సినిమాకు దర్శకుడు షాజీ కైలాష్. విలక్షణనటుడి తనయుడు ఇంటడ్యూస్ అయిన ఆ సినిమా తెలుగులో అంతగా ఆడలేదని వేరే చెప్పనక్కర్లేదు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా మంచువారికి  కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. పరాయిభాష నుంచి తెచ్చుకొన్న పెద్ద దర్శకుడితో రూపొందించినా ప్రయోజనం లేకపోయింది. 

ఈ విధంగా పెద్ద పక్క రాష్ర్ట సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్‌లో.. సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన దర్శకులు తెలుగులో రాణించలేకపోయారు. వారి కథలు తెలుగు వారికి నచ్చినా వారు డైరెక్ట్‌గా వచ్చి చేసిన ప్రయత్నాలు మాత్రం సక్సెస్ కాలేదు!