గ్రేటాంధ్ర : 'ఊరికి తిరిగి ఇవ్వాలి' అనే ఒక ఉదాత్తమైన భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో సినిమా చేసినందుకు ముందుగా అభినందనలు.
మహేష్ : థాంక్యూ
గ్రేటాంధ్ర : 'టీచ్ ఫిషింగ్ రేదర్ దేన్ గివింగ్ ఫిష్' అని ఇంగ్లిషులో ఓ సామెత ఉంది. 'శ్రీమంతుడు' ఏం చేయబోతున్నాడు.
మహేష్ : ఊరు మనకెంతో ఇచ్చింది.. మనం ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి అనేది ఈసినిమా కాన్సెప్టు. బేసిగ్గా సినిమా ఈ ఒక్క పాయింటు మీదనే ఉంటుందనుకోకూడదు. ఈ మంచి కాన్సెప్టును కమర్షియల్ సినిమాగా చెప్పడానికి ప్రయత్నం చేశాం. పైగా ఈ చిత్రం ట్రైలర్‌లో కూడా ఓ డైలాగ్ వస్తుంది. 'తిరిగివ్వడం అంటే.. ఏదో రోడ్లు వేసేయడం లాంటివే కాదు' అని వస్తుంది. సినిమాలో చూసి తెలుసుకోవాల్సింది అదే. ఈ సినిమాలో 'మన ఊరికి మనం తిరిగి ఇవ్వడం' కంటె మించి ఏదో ఉంది. ఆ విషయాన్ని ఇంకా పెద్దదిగా చెప్పాం. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మంచి ఎమోషన్స్, మంచి కమర్షియల్ వేల్యూస్‌తో ఈ చిత్రం చేశాం.
గ్రేటాంధ్ర : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిన తర్వాత.. ప్రతి కంపెనీ కూడా సంఘసేవ చేయడం.. ఊర్లను దత్తత తీసుకోవడం.. తమ ఫ్యాక్టరీలు, తమ పట్ల వ్యతిరేకత ఉండగల ప్రాంతాల్లో ఏదో సేవ చేశాం అనిపించుకోవడం ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వాటి మీద ఇందులో సెటైర్ ఉంటుందా?
మహేష్ : లేదు. ఇందులో ఎలాంటి సెటైర్ లేదు. మొక్కుబడిగా చేస్తున్నా, తప్పనిసరి గనుకన తిట్టుకుంటూ చేస్తున్నా ఏదో ఒకటి ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. అలాంటి పనుల మీద సెటైర్లు లాంటివి చిత్రంలో ఉండవు. సినిమా మొత్తం.. కేవలం ఒక పాజిటివ్ ఎప్రోచ్ తోనే ఉంటుంది. ఆ విషయాన్ని వేల్యూస్ చెడిపోకుండా, ఎమోషనల్ ఫ్యామిలీ కథతో కలిపి చెప్పడం జరిగింది.
గ్రేటాంధ్ర : 'లేకపోతే లావైపోతారు' అని ట్రైౖలర్ లో హీరోయిన్ డైలాగ్ రిపీట్ చేసి అంటూ ఆమెను ఇంప్రెస్ చేసినట్లే.. మోడీ, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు పల్లెల దత్తత గురించి ఇస్తున్న పిలుపును ప్రమోట్ చేసే ఈ చిత్రం వారిని ఇంప్రెస్ చేస్తుందా?
మహేష్ : నిజం చెప్పాలంటే.. ఈ చిత్రం ఈ ప్రభుత్వాలు రావడానికంటె ముందునుంచి ప్లాన్ చేసిన కాన్సెప్టు. ప్రభుత్వాలు ఊరిని దత్తత తీసుకోవడం గురించి ఇప్పుడు పిలుపు ఇస్తున్నాయి. అయితే దాన్ని ప్రమోట్ చేయడం కోసం అనుకున్న సినిమా అనడానికి వీల్లేదు. పైగా మా చిత్రాన్ని వాళ్లందరూ చూడాలి.. వాళ్లందరకూ చూపించాలి అనే ఉద్దేశం కూడా మాకు లేదు. కేవలం మన ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం అనే లక్ష్యంతోనే దీన్ని రూపొందించాం.
గ్రేటాంధ్ర : ఈ చిత్రానికి తొలిసారిగా నిర్మాతగా కూడా బాధ్యత పంచుకుంటున్నారు. ఆ అనుభవం ఎలా ఉంది?
మహేష్ : ఇది కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా నేను సహనిర్మాతగా కొన్ని సినిమాలకు వ్యవహరించాను. మా అక్క, అన్నయ్య చేసే చిత్రాలకు సహనిర్మాతగా అనుభవం ఉండనే ఉంది. కాకపోతే ఒకే ఒక్క తేడా ఏంటంటే.. ఈ చిత్రంలో సహనిర్మాతగా నా పేరుతో కొత్త బ్యానర్‌ను పరిచయం చేస్తున్నాం. అంతే తప్ప నిర్మాణం నాకు కొత్త అనుభవం కాదు.
గ్రేటాంధ్ర : భవిష్యత్తులో మీ నిర్మాణ సంస్థ కేవలం మీ చిత్రాలను మాత్రమే చేస్తుందా.. ప్రొఫెషనల్ ప్రొడక్షన్ హౌస్ లాగా.. ఇతరులతో కూడా రెగ్యులర్‌గా చిత్రాలు చేస్తుంటుందా?
మహేష్ : భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రొడక్షన్ ప్రాజెక్టులు కచ్చితంగా ఉంటాయి. నా చిత్రాల్లో ఎక్కువ ఉండచ్చు. ఇతరులతో కూడా సినిమాలు చేస్తామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను.
గ్రేటాంధ్ర : శృతిహాసన్‌తో తొలిసారి చేస్తున్నారు. మీ గత చిత్రాల హీరోయిన్‌లతో పోలిస్తే ఎవరితో సమానంగా చూడడం వీలవుతుంది.
మహేష్ : ఆమె కమల్‌హాసన్ కూతురు. ఆమె పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రంలా చాలా చక్కగా చేసింది.
గ్రేటాంధ్ర : ఈ చిత్రం షూటింగ్ లో ఎప్పటికీ మరచిపోలేని సంఘటన ఏదైనా ఉందా?
మహేష్ : అంత నిర్దిష్టంగా చెప్పలేను. కాకపోతే ఒక విషయం షేర్ చేసుకోవాలి. మామూలుగా నాకు అవుట్‌డోర్ షూటింగ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఇంట్లో పిల్లల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లి ఉండలేననిపిస్తుంది. ఎక్కువ రోజులు కంటిన్యూగా చేయను. అయితే ఈ చిత్రం కోసం తొలిసారిగా పొల్లాచ్చిలో 20 రోజులు ఏకధాటిగా అవుట్‌డోర్ షూటింగ్ చేశాం. అయితే చిత్రంగా నాకు ఎలాంటి విసుగురాలేదు. ఈ షూటింగ్ అంత హాయిగా, ఉత్సాహకరమైన వాతావరణంలో గడచిపోయింది అని మాత్రం చెప్పగలను.
గ్రేటాంధ్ర : ఇలాంటి కాన్సెప్టును ఎంచుకోవడంలో మీకు నిజజీవిత స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా?
మహేష్ : ప్రతి ఒక్కరూ. తమ సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలని తమ సంపాదనలోంచి కొంత మొత్తం ఖర్చు పెట్టే ప్రతి ఒక్కరి తత్వంలోంచి స్ఫూర్తి పొందగలిగాం. అయితే.. వారు చేస్తున్నదంతా చాలా మంచి పని. కానీ దీన్ని ఇంకా బాగా ప్రజలకు చెప్పాలి అనిపించింది. ఆ ప్రయత్నానికి సెల్యులాయిడ్ రూపంగానే ఈ చిత్రం ఉంటుంది.
గ్రేటాంధ్ర : మామూలుగా మహేష్‌బాబు అంటే డైరక్టర్స్ హీరో అని పేరు. ఏ చిత్రం చేసినా డైరక్టర్ ను నమ్మి చేస్తుంటారు. మీ ఖాతాలో ఉన్న కొన్ని ఫెయల్యూర్స్ కేవలం.. డైరక్టర్స్ కారణమే అని అంతా అంటుంటారు. దీనిపై మీ ఒపినియన్ ఏంటి?
మహేష్ : నేను తొలినుంచి డైరక్టర్ నే నమ్ముతున్నాను. ఇప్పటికీ అంతే. కొన్ని ఫెయిల్యూర్స్ తప్పలేదు. అయితే అలాంటి పరాజయాలు డైరక్టర్ వల్ల అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే వారు చెప్పిన కథలను నేను కూడా పూర్తిగా నమ్మబట్టే ఆ చిత్రాలు చేశాను. అలాంటప్పుడు పరాజయంతో నాకు కూడా భాగం ఉంటుంది. సినిమా అంటే డైరక్టర్ ది కాబట్టి.. వాళ్లు చెప్పినట్లు చేయడమే నాకు ఇష్టం. వాళ్లు అడిగిన విధంగా నాశక్తి వంచన లేకుండా మంచి పెర్పార్మెన్స్ ఇవ్వడం ఒక్కటే టార్గెట్‌గా నేను పనిచేస్తుంటాను.
ఈ సందర్భంగా మరికొన్ని విషయాలను కూడా మహేష్‌బాబు పంచుకున్నారు.
ప్రయోగాలు దెబ్బతీశాయి..
ఈ చిత్రం ప్రయోగం ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే ప్రయోగాలు చేసినప్పుడెల్లా ఎదురుదెబ్బలు తగిలాయి. టక్కరిదొంగ, నాని, వన్ ఈ ప్రయోగాలన్నీ దెబ్బతిన్నాయి. అలాగని నేను ప్రయోగాలు చేయడం మాత్రం మానుకోదలచ్చుకోలేదు. సరిగ్గా చెప్పగలరని అనిపించి.. కాన్సెప్టు బాగుందని అనిపిస్తే మళ్లీ మళ్లీ కూడా ప్రయోగాలు చేయడానికి నేను సిద్ధమే. ప్రతి ప్రయోగమూ ఫెయిలవుతుందని భయపడి అలాంటిది అసలేమీ చేయకుండా ఉండలేను.
నాకు డైరక్షన్ చేయాలనే ఆలోచన లేదు. నన్ను ఎవరైనా డైరక్షన్ చేస్తున్నావా అని అడిగారంటే.. నన్ను ఇండస్ట్రీ నుంచి పంపేయడానికి చూస్తున్నారని అనిపిస్తుంది. నేను ఎప్పుడూ డైరక్టర్స్ చెప్పినట్లుగా పెర్ఫార్మ్ చేస్తే చాలనుకుంటుంటాను.
జగపతి బాబు ఈ చిత్రంలో కేరక్టర్ చేయడానికి ఒప్పుకుంటారో లేదో అనుకుంటూ ఆయనను ఎప్రోచ్ అయ్యాం. ఎందుకంటే కథలో ఆ పాత్రను విన్నప్పుడు దానికి మంచి సబ్‌స్టన్స్ ఉన్న, స్టేచర్ ఉన్న నటుడు కావాలని అనిపించింది. ఆయన ఒప్పుకుంటారో లేదో అనే సందేహంతోనే వెళ్లి అడిగాం. ఆయన కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారు.
నిర్మాతగా మారడం అనేది నా ఆంబిషన్ కాదు. ఈ చిత్రంలో కూడా సహనిర్మాతగా వ్యవహరించాలన్నది తొలినుంచి ఉన్న ఆలోచన కాదు. కొంత సినిమా జరిగిన తర్వాత.. అన్నయ్య రమేష్ వచ్చి నాకు ఆ సలహా ఇచ్చారు. క్వాలిటీ మెరుగుపడుతుంది కదా అని చెప్పారు. వెంటనే ఆ విషయం నిర్మాతతో మాట్లాడా. ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు.
ఈ చిత్రం తమిళ వెర్షన్ కూడా విడుదల అవుతోంది. సినిమా సబ్జెక్టులోని బలమే.. మమ్మలిన తమిళంలో కూడా స్ట్రెయిట్ చిత్రంతరహాలో ఒకేరోజున విడుదల చేయడానికి ప్రేరేపించింది. సినిమా కాన్సెప్టు యూనివర్సల్ కావడంతో.. తమిళంలో చేయాలనుకున్నాం. అక్కడ అందరూ కూడా స్ట్రెయిట్ ఫిలిం లాగానే రిలీజ్ చేయమని అడిగారు. అలాగే చేస్తున్నాం.
సీతారామరాజా.. నేనా?
అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నేను రీమేక్ చేసే ఆలోచన ఎంతమాత్రమూ లేదు. అదొక క్లాసిక్. క్లాసిక్స్‌ను క్లాసిక్స్‌లాగానే ఉండనివ్వాలి. వాటిని మనం చెడకొట్టకూడదు. ఆ సినిమా చేయాలనుకునేంత సాహసం నాకు లేదు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి నేను ఆ చిత్రాన్ని ఓ వంద సార్లు చూసి ఉంటాను. అంత ఇష్టపడేవాణ్ని ఆ చిత్రాన్ని మాత్రం చేయలేను.
నాకు ప్రత్యేకంగా డ్రీమ్‌రోల్స్ అంటూ ఏమీ ఉండవు. ప్రతి సినిమా లో పాత్రని డ్రీమ్‌రోల్‌గానే అనుకుని చేస్తుంటాను. ఈ చిత్రంలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. నిండుగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కేవలం హ్యూమర్ మాత్రమే కాదు.. ఇటీజ్ ఎవిరీథింగ్.
బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన మాత్రం లేదు. నిజం చెప్పాలంటే నాకు అంతం టైం లేదు. ఇక్కడే ఒక సినిమా చేయడానికి 7-8 నెలలు పడుతోంది. హిందీలో ఒక్కో చిత్రం మూడేళ్లు పట్టేస్తుంది. ఇక్కడ నా సినిమాలన్నీ ఆగిపోతాయి. అందుకే అంత టైం లేదనుకుంటున్నాను.
ఫ్రెండ్షిప్ డే విషయానికి వస్తే.. నాకు ప్రత్యేకంగా ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నా ఫ్రెండ్స్ అంతా మదరాసులోనే ఉండిపోయారు. నాతో కలిసి పనిచేసిన దర్శకులే నాకు ఫ్రెండ్స్.
– సురేష్