‘పద్మ’ గౌరవం పెంచాల్సిందే.!

భారతరత్న.. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. కానీ ఏం లాభం.? ఈ పురస్కారం చుట్టూ అనేక వివాదాలు విన్పిస్తున్నాయి. మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కి రాజ్యసభ పదవి దక్కడం.. దాంతోపాటుగా భారతరత్న పురస్కారాన్ని కేంద్రం…

భారతరత్న.. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. కానీ ఏం లాభం.? ఈ పురస్కారం చుట్టూ అనేక వివాదాలు విన్పిస్తున్నాయి. మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కి రాజ్యసభ పదవి దక్కడం.. దాంతోపాటుగా భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించడం వివాదాస్పదమయ్యింది. క్రికెట్‌లో సచిన్‌ సాధించిన విజయాల నేపథ్యంలో ఆయనకు భారతరత్న దక్కడం గౌరవమేగానీ, రాజకీయ కోణంలో భారతరత్నను ప్రకటించారన్న వాదనల నేపథ్యంలో భారతరత్న పురస్కారం చుట్టూ వివాదాలు కమ్ముకున్నాయి.

ఇక, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాల చుట్టూ వున్న వివాదాలకు కొదవే లేదు. టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు నటులు ‘పద్మ’ వివాదాల్లో ఇరుక్కున్నారు. పద్మ పురస్కారాల్ని వారు దుర్వినియోగం చేశారన్నది ప్రధాన ఆరోపణ. తాజాగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌కి గతంలో కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. సైఫ్‌కి గతంలో ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కి తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

అత్యున్నత పౌర పురస్కారాలు పొందినవారెవరైనా వివాదాలకు దూరంగా వుండాలి. అలా వుంటేనే ఆ పురస్కారాలకు గౌరవం. అంతే తప్ప, తాము సాధించిన ఘనతకు పురస్కారం దక్కిందే తప్ప, ఆ పురస్కారానికి వున్న గొప్పతనమ్మేరకు తాము తమ నడవడికను మార్చుకోవాల్సిన అవసరం లేదన్న భావనలో కొందర వ్యవహరిస్తుండడం బాధాకరం.

పద్మ పురస్కారాల కారణంగా వ్యక్తులకు గౌరవం పెరగాలి.. అదే సమయంలో ఆ వ్యక్తుల కారణంగా ఆ పురస్కారం గౌరవం మరింత పెరగాలి. అలా జరగాలంటే, పద్మ పురస్కారాల విషయంలో కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. దుర్వినియోగమైతే కఠిన చర్యలకు కేంద్రం దిగిన పక్షంలోనే ఆయా పురస్కారాల గౌరవం నిలబడ్తుంది.