కొన్ని రోజులుగా మరే విషయం లేనంత తదేక ధ్యానంతో టివి చానెళ్లు అన్నీ షీనాబోరా హత్య కేసుపై ఏకధాటిగా కధనాలు సమర్పించాయి. పోటాపోటీగా ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను సామాన్యుల జీవితాల మీద రుద్దాయి. ఎన్నడూ లేనంతగా ఒక క్రైమ్ స్టోరీని ఈ స్థాయిలో మీడియా ఫోకస్ చేయడంతో ఇప్పుడు మీడియా చేసిన అతి కూడా ఫోకస్ చేయాల్సిన అంశంగా మారింది.
షీనా బోరా హత్య కేసు కధనాల విషయంలో మీడియా అన్ని పరిధులూ, హద్దులూ దాటేసిందని, పూర్తి అనైతిక, బాధ్యత లేని ధోరణితో వ్యవహరించిందని సిఎమ్ఎస్ మీడియా ల్యాబ్ సంస్థ తూర్పారబట్టింది. దేశంలోనే ప్రప్రధమంగా ఒక కేసు విషయంలో మీడియా చూపించిన అతి గురించి ఈ సంస్థ పరిశోధన నిర్వహించింది.
ఈ పరిశోధన సారాంశం ప్రకారం… షీనాబోరా హత్య తదనంతర కధనాలలో ఇంద్రాణి జీవితం మీడియాను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ ఉదంతాన్ని చిలవలు పలవలు చేశాయి. దేశంలోని టాప్ రేటింగ్‌లో ఉన్న అరడజనుకు పైగా చానెల్స్ తమ ప్రైమ్ టైమ్ కవరేజ్‌లో ముప్పతిక భాగాన్ని ఇంద్రాణి మయం చేశాయి.
ఆజ్‌తక్, ఎబిపి న్యూస్, జీ న్యూస్, సిఎన్ఎన్ ఐబిఎన్, టైమ్స్ నౌ, డిడి న్యూస్… చానెల్స్‌లో ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8 వరకూ (అంటే పక్షం రోజుల పాటు) వచ్చిన కధనాల తీరుతెన్నులను ఒకసారి పరిశీలిస్తే… ఈ కేసుకు సంబంధించి ఈ అరడజను చానెల్స్ కలిపి 113 స్టోరీలను ప్రసారం చేశాయి. అంతేకాకుండా 61 స్పెషల్ ప్రోగ్రామ్స్‌ను కూడా వీక్షకులకు అందించాయి.
దాదాపు 2,282 నిమిషాలు అంటే 38గంటల పాటు తమ విలువైన సమయాన్ని ఈ కేసుకు మాత్రమే కేటాయించాయి. దీనిలో టైమ్స్ నౌ, సిఎన్ఎన్ ఐబిఎన్ చానెల్స్ రెండు మాత్రమే 60శాతం కవరేజ్ అందించాయి. అంటే మిగిలిన నాలుగు కలిపి 40శాతం ఇచ్చాయన్నమాట. ఇందులోనూ అన్నింటి కంటే మిన్నగా టైమ్స్ నౌ 40శాతంతో ప్రధమ స్థానాన్ని ఆక్రమించుకుందట. ఈ చానెల్ 948 నిమిషాలు, సిఎన్ఎన్ ఐబిఎన్ 424 నిమిషాలు, ఆజ్‌తక్ 341 నిమిషాలు, ఎబిపి న్యూస్ 268 నిమిషాలు, జీ న్యూస్ 263 నిమిషాలు షీనాబోరా-ఇంద్రాణి కేసుకు సమర్పించుకున్నాయి. వీటన్నింటిలో ఈ కేసుకు అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన డిడి న్యూస్ చానెల్ షీనా కేసుకు కేవలం 36 నిమిషాలు మాత్రమే కేటాయించింది.
అదే సమయంలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యలు, వరదలు, కరువు వంటివి మీడియాకు ప్రాధాన్యం ఉన్న అంశాలుగా కనపడకపోవడం విచారకరమైన విషయమని సిఎమ్ఎస్ మీడియా ల్యాబ్ వ్యాఖ్యానించింది. ఒక క్రైమ్ స్టోరీని జాతీయ ప్రాధాన్యమున్న అంశంగా మార్చడం ద్వారా న్యూస్ ఛానెల్స్ తమ ఎడిటోరియల్ ప్రాధాన్యతలేమిటో తెలియజెప్పాయని, జనాభాలో అధిక సంఖ్యాకుల సమస్యల పట్ల తమ చిత్తశుధ్ది లోపాన్ని కళ్లకు కట్టాయని తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. ఇంత భారీ స్థాయిలో ఇచ్చిన కవరేజ్‌లో కూడా అన్నీ అవాస్తవాలు, అర్ధసత్యాలే తప్ప మరేమీ లేవని స్పష్టం చేసింది.
ఏదేమైనా… దేశంలో ఇటీవలి కాలంలో మీడియా ఇంతగా దృష్టి సారించిన క్రైమ్ ఏదీ లేనట్టే… మీడియా ప్రసారాలను ఇలా విశ్లేషించి, దుయ్యబట్టే ప్రక్రియ కూడా చోటు చేసుకోలేదు. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఒక కేసును ఒకరు అంటిస్తే అది అంటువ్యాధిలా మారి ఛానెళ్లన్నింటికీ ఒకటే జబ్బు అన్నట్టు కొట్టుకుపోతున్న మీడియా తనని తాను తరచి చూసుకునేందుకు ఇలాంటి విశ్లేషణలూ అవసరమే.