ఓడిపోయింది జయసుధా? మురళీ మోహనా?

''మా'' లో  తగ్గనున్న టిడిపి పెత్తనం  Advertisement రసవత్తరంగా, వివాదాస్పదంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో హీరో రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. అయితే ఇక్కడ ఓడిపోయింది ఎవరు ? రాజేంద్ర ప్రసాద్ కు…

''మా'' లో  తగ్గనున్న టిడిపి పెత్తనం 

రసవత్తరంగా, వివాదాస్పదంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో హీరో రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. అయితే ఇక్కడ ఓడిపోయింది ఎవరు ? రాజేంద్ర ప్రసాద్ కు పోటిగా నిలబడిన హీరోయిన్ జయసుధ ఓడిపోయారా ? లేక జయసుధను రంగంలో దింపిన మురళీ మోహన్ ఓడిపోయారా ? తెర మీదా కనిపించింది జయసుధ అయినా తెర వెనుక భాగోతం నడిపించింది మాత్రం మురళి మోహనే. కాబట్టి ఇక్కడ నైతికంగా మురళీ మోహన్ కోణంలో చూస్తే ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ చేతుల్లో మురళీ మోహన్ ఓడిపోయినట్టే లెక్క. రాజేంద్ర ప్రసాద్  85 ఓట్ల మెజారిటితో  గెలిచారు. అంటే ఇక్కడ చిన్న చితకా నటీ నటులు, టి వి ఆర్టిస్టులు జయసుధ వైపు మొగ్గుచూపలేదనే విషయం స్పష్టమైంది. 

అంతేకాదు జయసుధ ఓటమి మురళీ మోహన్ ఓటమితో సమానం అని చెప్పే సినిమావాళ్ళు కూడా లేకపోలేరు. జయసుధకు మురళీ మోహన్ బహిరంగంగా మద్దతు తెలపడం, రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, టివిలో లైవ్ లో మురళీ మోహన్ వ్యాఖ్యలు వంటి అంశాలు చిన్న చితక నటీ నటులను రాజేంద్ర ప్రసాద్ వైపుకు మొగ్గుచూపేలా చేశాయని అంటున్నారు. మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేవలం ఒక్కరికి అంటే ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని చెప్పుకున్న కొంతమంది చిన్న ఆర్టిస్టులు బహుశా జయసుధ గెలిచినా కూడా మిగితా వారికి పెన్షన్ వస్తుందో లేదో అనే భయంతో కూడా చిన్న ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ కు ఓట్లు వేసినట్టు అర్థమవుతోంది. 

ముఖ్యంగా టి వి ఆర్టిస్టులు జయసుధకు, మురళీ మోహన్ కు పూర్తిగా వ్యతిరేకంగా పని చేశారని రాజేంద్ర ప్రసాద్ కు వచ్చిన మెజారిటి రుజువు చేస్తోంది. సుమారు వంద మంది వరకు టి వి ఆర్టిస్టులు ''మా'' లో సభ్యులుగా ఉన్నారు. ఈ బుల్లి తెర నటీనటులే ఇక్కడ జయసుధ కొంప ముంచారు. మురళి మోహన్ ను నైతికంగా  ఓడించారు. ఎన్నికల ప్రచారం కోసం మీడియా ముందుకు పలుమార్లు వచ్చిన రెండు ప్యానల్లలో కూడా మురళీ మోహన్ మద్దతు తెలిపిన ప్యానల్ లోనే కాస్త ఎక్కువ మంది సెలబ్రిటీలు నటీనటులు కనిపించారు. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో నిలిచి పోయే ఎన్నికలు. ఇంత రాదంతం, గందరగోళం, కోర్టు మెట్లు ఎక్కడం వంటి సంఘటనలు ఇంతవరకు జరుగలేదు. ''మా'' లో పూర్తిగా వెయ్యికి పైగా సభ్యులున్నా 702 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. 702 ఓట్లలో  394 ఓట్లు పోలవగా, రాజేంద్ర ప్రసాద్ కు 237, జయసుధ కు 152 ఓట్లు లభించాయి.   

తిక్క కుదిరింది…

ఎంతోకాలంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పెత్తనం చెలాయిస్తున్న తెలుగుదేశం వ్యక్తులకు తిక్క కుదిరింది. మా లో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మద్దతు దారులకు రాజేంద్ర ప్రసాద్ విజయం ఓ గుణపాఠం. చాలా ఏళ్ళనుంచి మురళీ మోహన్ 'మా' లో పెత్తనం చేలాయిస్తున్నారు. ఇప్పుడు ఆ పెత్తనానికి పుల్ స్టాప్ పడింది. జయసుధ లాంటి మహిళను పెట్టుకుని పెత్తనం చేలాయించాలని చూసిన  మురళీ మోహన్ కు బలమైన సమాధానమే లభించింది. రెండేళ్ళ వరకు మురళీ మోహన్ 'మా' వైపు తిరిగి చూడకుండా సభ్యులు సమాధానం ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ తెలుగు దేశం పార్టీ కి మద్దతుగానే ఉంది. ఇప్పుడు కూడా పరిశ్రమ తెలుగుదేశం కు మద్దతుగా ఉందని తెలియజేసే ప్రయత్నం కూడా 'మా' ఎన్నికల్లో జరిగింది. కాని ఆ ప్రయత్నాల పప్పులేమీ ఉడకలేదని స్పష్టమైంది. రాజేంద్ర ప్రసాద్ కూడా మురళీ మోహన్ సామాజిక వర్గమే అయినా  మురళీ మోహన్ స్థాయిలో పసుపు రంగు పూసుకునే అవకాశాలు రాజేంద్రుడికి తక్కువగా ఉంటాయని అందువల్ల తెలుగుదేశం పెత్తనం ''మా'' లో తగ్గిపోతుందని సభ్యులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. 

పని చేసిన తెలంగాణా మంత్రి జపం….

జయసుధను ఓడించడానికి తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రయతనం ఫలించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణా  సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  జయసుధ ను ఓడించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారని ఫిలిం నగర్ చర్చించు కుంటోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాం లో సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే గా తలసాని పై జయసుధ గెలిచినా విషయం తెలిసిందే. అప్పటినుంచి జయసుధ పై గుర్రుగా ఉన్న తలసాని సరైన అవకాశం కోసం ఎదురుచూసి ఇప్పుడు తన ప్రతాపం చూపించారని ఫిలిం నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ లో ఉన్న కాదంబరి కిరణ్ సదరు మంత్రి వద్దకు వెళ్లి మద్దతు కోరినట్టు కూడా పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలాయి. ''మా'' లో మురళీ మోహన్ పెత్తనం లేకుండా చెయ్యడం తో పాటు ఒక ఎమ్మెల్యే గా గెలిచి ''మా'' ఎన్నికల్లో ఓడిపోవడం  జయసుధకు ఇది మింగలేని అవమానమే. 

బుల్లి తెర ఓట్లే కీలకం 

''మా'' అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ గెలవడానికి సినిమా నటీనటుల కన్నా బుల్లితెర ఓట్లే కీలకంగా మారాయని చెప్పవచ్చు. బుల్లి తెర నటీనటులు సుమారు వందమంది వరకు ''మా''లో సభ్యులుగా ఉన్నారు. టివి నటీనటులతో రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ లో ఉన్న కాదంబరి కిరణ్ సన్నిహితంగా ఉంటారు. అంతేకాకుండా చిత్రపురి కాలనీలో కాదంబరి తో పాటు వినోద్ బాల లాంటి చాలా మంది బుల్లి తెర నటీనటులు పని చేస్తున్నారు. విజయ్ యాదవ్ లాంటి టివి ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు సైలెంట్ గా పని చేసినట్టు సమాచారం. మేజారిటిగా వచ్చిన 85 ఓట్లు బుల్లి తెర ఆర్టిస్టుల ఓట్లేనని తెలుస్తోంది. 
 
రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హామీలు ఇవే 

  • ''మా'' లోఉన్న పేద కళా కారులందరికీ పెన్షన్స్ ఇప్పిస్తా అన్నారు. 
  • పేద కళాకారులకు హెల్త్ కార్డ్ ఇప్పిస్తానన్నారు. 
  • 5 కోట్ల వరకు ''మా'' కు నిధులు సమీకరిస్తా  అని చెప్పారు.
  • ''మా'' కు కొత్త కార్యాలయం ఏర్పాటు చేసి రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.