హత్యాయుధం సమకూర్చినందుకు పర్చూరే కూడా శిక్షార్హుడే అవుతాడు. అతన్ని కాపాడుదామని గోడ్సే పిస్టల్ గురించి తన కథనాన్ని మార్చేశాడు. ''ఢిల్లీలో గాంధీ ప్రార్థనాస్థలం వద్ద నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి బొంబాయి, పూనాల నుండి వాలంటీర్లు ఎవరూ ఢిల్లీకి రావడానికి సిద్ధపడలేదు. అందువలన మేం గ్వాలియరు వెళ్లి డా|| పర్చూరేను కలుసుకుందా మనుకున్నాం. కానీ ఆయన క్లినిక్‌కు వెళ్లే అడావుడిలో వున్నాడు. సాయంత్రం కలిసి వాలంటీర్ల గురించి అడిగితే అంత ఉత్సాహం చూపలేదు. నేను అప్పుడు ఆప్టేను బొంబాయి, పూనాలకు వెళ్లి వాలంటీర్ల గురించి ప్రయత్నించమని చెప్పాను. నేను ఒక్కణ్నే ఢిల్లీకి వచ్చాను. శరణార్థుల శిబిరాలలో తిరుగుతూండగా నా ఆలోచనలు స్పష్టమైన రూపాన్ని పొందాయి. గాంధీని హత్య చేయడమే పరిష్కారమని తోచింది. యాదృచ్ఛికంగా ఆయుధాలమ్మే శరణార్థి ఒకడు కలిశాడు. అతని దగ్గర నేను కొనుగోలు చేశాను. బిర్లా హౌస్‌కు వచ్చి దాన్ని ఉపయోగించాను.'' అని వాఙ్మూలంలో చెప్పుకున్నాడు.
ఏదైనా హత్యను ప్రి-మెడిటేటెడ్, ప్లాన్డ్, కోల్డ్‌బ్లడెడ్ మర్డర్‌గా నిరూపిస్తే శిక్ష ఎక్కువగా వుంటుంది. ఆవేశంలో అనుకోకుండా చేసే హత్యకు శిక్ష తక్కువగా వుంటుంది. తను ప్లాను ప్రకారం గాంధీని హత్య చేయలేదని, తను ఒక్కడే ఢిల్లీకి వచ్చానని, ముందు రోజు రాత్రి శరణార్థుల శిబిరాల్లో తిరుగుతూండగా అప్పటికప్పుడు ఆలోచన వచ్చిందని, అప్పుడే పిస్టల్ కూడా అమ్మకానికి వచ్చిందని, మర్నాడే కాల్చేశానని గోడ్సే చెప్పుకున్నాడు. డిఫెన్సు కూడా జనవరి 20 నాటి సంఘటనను, 30 నాటి సంఘటనను వేర్వేరుగా, సంబంధం లేని సంఘటనలుగా చూడాలని వాదించింది. ప్రాసిక్యూషన్ వాదన తప్పనడమే తప్ప తమ వాదనలకు ఆధారంగా సాక్ష్యాలు ఏమీ చూపలేకపోయింది. సంబంధిత వ్యక్తుల స్టేటుమెంట్లు, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా కోర్టు యీ వాదనలను తిరస్కరిస్తూనే శంకర్ కిష్టయ్య, పర్చూరేలను కుట్రలో పాలు పంచుకోలేదేమోనన్న సంశయలాభంతో వదిలిపెట్టింది.
పిస్టల్ కొని పెట్టినా, 'గాంధీని చంపడానికే అన్న విషయం అతనికి తెలియకపోవచ్చు కదా' అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ వలన పర్చూరే విడుదల అయ్యాడు. అలాగే శంకర్ కిష్టయ్య దిగంబర్ బాహ్‌డగే నౌకరు. దిగంబర్ బాహ్‌డగే మరాఠా. తూర్పు ఖాందేశ్‌వాడు. చదువు మెట్రిక్ దాకా కూడా సాగలేదు. రకరకాల వుద్యోగాలు చేశాడు. ఒక సామాజిక సంస్థకు చందాలు వసూలు చేసేవాడు. వచ్చిన కలక్షన్‌లో నాల్గో వంతు జీతంగా తీసుకునేవాడు. తర్వాత కత్తులు, చాకులు ఒక దుకాణం నుండి కొని చిల్లరగా అమ్ముతూండేవాడు. అప్పట్లో రాజకీయ ఆందోళనలు, హిందూ, ముస్లిము కొట్లాటలు ఎక్కువగా జరుగుతూండేవి. ప్రతీవాడూ తన దగ్గర ఒక చాకు పెట్టుకుంటే మంచిదనుకునేవాడు. అందువలన యితని వ్యాపారం పెరిగింది. హైదరాబాదు రాష్ట్రంలో, పొరుగు ప్రాంతాల్లో వుండే హిందువులు యితని దగ్గర బాగా కొంటూండేవారు. ఈ క్రమంలో హిందూ మహాసభ వాలంటీర్లు బాగా పరిచయమయ్యారు. వాళ్ల సమావేశాలకు హాజరయ్యేవాడు. ఆ సమావేశాల్లో పైకి బుక్‌స్టాల్ ఒకటి పెట్టి పుస్తకాలు అమ్ముతూ, చాటుగా చాకులు, కత్తులూ అమ్మేవాడు. సావర్కారు యింట్లో అతను గోడ్సే, ఆప్టేలను కలిశాడు.
1947 వచ్చేసరికి హిందూ-ముస్లిము అల్లర్లు పెరిగి పిస్టళ్లు, గ్రెనేడ్లు వంటి మారణాయుధాలు కూడా అమ్మసాగాడు. జనవరి 20 నాటి హత్యాప్రయత్నంలో అతనిదే ముఖ్యపాత్ర. 30 అడుగుల దూరం నుంచి గాంధీని చాటుగా పిస్టల్‌తో కాల్చేయడం, గ్రెనేడ్ విసరడం అతని పని. తన వద్ద పనిచేసే శంకర్‌కు 'నేనెవరిని కాల్చేస్తే ఆయన్ని కాల్చేయ్, నేనెవరి వైపు గ్రెనేడ్ వేస్తే ఆయనవైపు గ్రెనేడ్ విసిరేయ్' అని చెప్పి తీసుకుని వచ్చాడు. శంకర్‌కు గాంధీ ఎలా వుంటాడో కూడా తెలియదు. జనవరి 31న పట్టుబడ్డాక బాహ్‌డగే ఎప్రూవర్‌గా మారాడు. అందుచేత అతనికి శిక్ష లేదు. యజమాని చెప్పిన పని చేయడం తప్ప శంకర్ కిష్టయ్యకు వేరేమీ లక్ష్యం ఏమీ లేదు అనుకుని కోర్టు వారు విడిచేశారు.
ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించాక ముద్దాయిలు తమ డిఫెన్సు వినిపించారు. ఆప్టే 27 న గోడ్సేతో ఢిల్లీ, గ్వాలియర్ వెళ్లిన మాట నిజమే అయినా పర్చూరేతో మాట్లాడాక తను గ్వాలియర్ నుండి బొంబాయి వచ్చేశానని చెప్పుకున్నాడు. కర్కారే కూడా తను మొదటిసారి ఢిల్లీ వెళ్లాను తప్ప రెండో సారి వెళ్లలేదని చెప్పుకున్నాడు. గోపాల్ గోడ్సే తనకు హత్యతో ఏ సంబంధమూ లేదని చెప్పుకున్నాడు. జనవరి 20 న తను ఢిల్లీలోనే లేను పొమ్మన్నాడు. మదన్‌లాల్ తను బాంబు పేల్చినది నిజమే కానీ నిరసన తెలపడానికే తప్ప ఎవరికీ హాని చేయడానికి కాదనీ, అందుకే జనాలకు దూరంగా పెట్టేననీ చెప్పుకున్నాడు. పర్చూరే గోడ్సే, ఆప్టేలు తనను వాలంటీర్ల కోసం అడిగారనీ, తను నిరాకరించాననీ, తను పిస్టల్ సమకూర్చానన్నమాట అబద్ధమనీ అన్నాడు. ఇక అప్పీలులో హైలైట్ ఏమిటంటే గోడ్సే ఉపన్యాసం. అతను గంటల తరబడి దీర్ఘోపన్యాసం యిచ్చాడు. తన వాఙ్మూలంలో చెప్పిన విషయాలను, కింది కోర్టులో చెప్పిన విషయాలను ఉటంకిస్తూ, అనేకసార్లు భగవద్గీతలోంచి హింసను సమర్థించే శ్లోకాలను ఉటంకిస్తూ తన ధర్మం తను నిర్వర్తించానని వాదించాడు. ''తనకున్న ఆధ్యాత్మిక శక్తితో గాంధీ జిన్నా ఆలోచనాసరళిని మార్చాల్సి వుంది. తనకు చేతకాకపోతే ఓటమి ఒప్పుకుని, పక్కకు తప్పుకుని జిన్నాతో ఎలా వ్యవహరించాలో తెలిసినవారికి నేతృత్వం అప్పగించాల్సింది. కానీ గాంధీ తన స్వార్థం కోసం, అహంకారం కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. భారత రాజకీయాల్లోంచి గాంధీని తొలగించివేస్తే అప్పుడైనా అవి ఆచరణాత్మకంగా, ప్రతీకారం తీర్చుకునేటంత పటిష్టంగా వుంటాయని భావించాను. తన సిద్ధాంతాల ద్వారా, చర్యల ద్వారా హిందువులను నాశనం చేసిన వ్యక్తి పైనే నేను తుపాకీ ఎక్కుపెట్టాను. దేశభక్తి పాపమే అయితే నేను పాపిని. అది పుణ్యకార్యమైతే నేను దానికి అర్హుణ్ని. మనుష్యులు ఏర్పరచిన న్యాయస్థానం కాకుండా వేరే ఏదైనా న్యాయస్థానం వుంటే అక్కడ నేను చేసిన పని అన్యాయం కాదనే తీర్పు వస్తుందని నా పరిపూర్ణ విశ్వాసం. ఈ రోజు ఎంతమంది నన్ను ఖండించినా నేను చలించను. భవిష్యత్తులో చరిత్ర రాసినపుడు నా చర్య యొక్క విలువను నిజాయితీ గల చరిత్రకారులు గుర్తిస్తారనే నా నమ్మకం.'' అని చాలా ప్రతిభావంతంగా, నాటకీయంగా ఉపన్యసించాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)