మీ పిల్లలు స్వీట్స్ ఎక్కువగా తింటున్నారా?

పిల్లలకు తీపి పదార్థాలు, మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువగా పెట్టకూడదంటారు పెద్దవాళ్లు. స్వీట్స్ ఎక్కువ పెడితే పిల్లల్లో ఆకలి, బుద్ధి మందగిస్తుందని చెబుతుంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి సైంటిఫిక్ ఆధారం కూడా లభించింది. అమెరికాకు…

పిల్లలకు తీపి పదార్థాలు, మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువగా పెట్టకూడదంటారు పెద్దవాళ్లు. స్వీట్స్ ఎక్కువ పెడితే పిల్లల్లో ఆకలి, బుద్ధి మందగిస్తుందని చెబుతుంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి సైంటిఫిక్ ఆధారం కూడా లభించింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా నిర్వహించిన స్టడీలో ఈ విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది.

చిన్నపిల్లలు చక్కెర ఎక్కువగా ఉన్న చిరుతిండ్లు తింటే.. ఊబకాయం వస్తుందని, గుండె సంబంధిత వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉందనే విషయాలు ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్నాయి. డాక్టర్లు కూడా ఇదే విషయాలు ఉదాహరణగా చెప్పి హెచ్చరిస్తుంటారు. అయితే పిల్లలు చక్కెర, చక్కెరతో తయారు చేసిన చిరుతిండ్లు ఎక్కువగా తీసుకుంటే వారికి మెమరీ లాస్ అవుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.

అవును… చక్కెర తింటే బుర్ర సరిగా పనిచేయదట. చిన్నప్పుడు చక్కెర ఎక్కువగా తినేవాళ్లు.. యుక్త వయసులో మెమరీ లాస్ తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాంటి వారే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గా మారతారట.

కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రేరేపించే భాగం ఒకటి మెదడులో ప్రత్యేకంగా ఉంటుంది. చక్కెర ఎక్కువగా తింటే మెదడులోని ఆ ప్రాంతం ఎక్కువగా ప్రభావితం అవుతుందని, పిల్లలు మందబుద్ధులుగా మారిపోతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

మెదడులోని పారా బ్యాక్టీరోయిడ్స్ లెవల్స్ పెరుగుతాయట. సాధారణంగా జంతువుల మెదడులో పారా బ్యాక్టీరోయిడ్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే వాటికి సరైన ఆలోచనా శక్తి ఉండదు, చిన్న వయసులో చక్కెర విపరీతంగా తీసుకుంటే యుక్త వయసులో మనుషులు కూడా ఇలాగే ఆలోచన శక్తిని, సృజనాత్మకతను కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు.

సుగర్ లెవల్స్ ఇలా ఉండాలి..

మనం రోజూ తీసుకునే కేలరీలలో 10శాతం కంటే తక్కువగా చక్కెర పదార్థాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే దాని ప్రభావం కచ్చితంగా మెదడుపై పడుతుందట. ఎలుకలపై చేసిన ఈ ప్రయోగంలో ఈ విషయం స్పష్టంగా తెలిసిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. 

చిన్న వయసులో ఉన్న ఎలుకలకు చక్కెర పదార్థాలు ఎక్కువగా పెడితే, వాటి వయసు పెరిగే కొద్దీ, మెదడు పనితీరు మందగించిందని చెప్పారు. అదే పెద్ద ఎలుకలు ఎక్కువ చక్కెర పదార్థాలు తిన్నా కూడా వాటి మెదడు పనితీరుపై పెద్దగా ప్రభావం పడలేదట. అంటే.. చిన్నప్పుడు ఎక్కువ చక్కెర తీసుకుంటే పెద్దయ్యాక జ్ఞాపకశక్తి తగ్గిపోతుందనేది వాస్తవం.

శరీర జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడే గట్ బ్యాక్టీరియాని కూడా చక్కెర నాశనం చేస్తుందట. చక్కెర ఎక్కువగా తీసుకుంటే గట్ బ్యాక్టీరియా పనితీరు సరిగా ఉండదని చెబుతున్నారు. మొత్తమ్మీద చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఏ వయసు వారికైనా ఇబ్బందులు తప్పవన్న మాట. అందులోనూ చిన్నప్పుడు చక్కెర ఎక్కువగా తింటే ఆ ప్రభావం పెద్దయ్యాక బాగా కనపడుతుంది.

సో.. చిన్న పిల్లలకు ముద్దు చేసి మరీ స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు, కేక్ లు కొనిపెట్టే తల్లిదండ్రులు కాస్త ఆలోచించండి. వారి మెదడుని, వారి భవిష్యత్ ని మీరే పాడుచేస్తున్నారనే విషయాన్ని గ్రహించండి.