పెండింగ్లో ఉన్న పరిషత్ ఎన్నికల భవితవ్యం న్యాయస్థానం చేతుల్లో ఉంది. పిటిషన్లు కోరినట్టా? లేక ఎస్ఈసీ నిర్ణయించినట్టు ఎన్నికలు జరుగుతాయా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఈ ఉత్కంఠ మరో రెండు రోజులు కొనసాగనుంది.
నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన రోజే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 8న ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించ తలపెట్టారు.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నీలం సాహ్ని జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ వారు పిటిషన్లలో కోరారు. ఈ పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న విచారణ జరుగుతోంది. ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎస్ఈసీ తరపున దీటైన వాదన వినిపించారు. గతంలో కోవిడ్ కారణంగా ఎన్నికలు ఆగిపోయాయని, తాజాగా ఆగిన చోట నుంచే తిరిగి ప్రక్రియ ప్రారంభించామని, ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారని ఎస్ఈసీ తరపు వాదన వినిపించారు.
ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తుది తీర్పు వెల్లడించనున్నారు. దీంతో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది.