చేపలంటే చాలామందికి ఇష్టం. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. చికెన్, మటన్ తింటే హెవీగా ఉంటుందని ఫీల్ అయ్యేవాళ్లు చేపల్నే తింటారు. మరీ ముఖ్యంగా అన్ని మాంసాహారాల్లో చేపలు ఈజీగా అరిగిపోతాయి. పైగా వీటిలో శరీరానికి పనికొచ్చే పోషకాలు కూడా ఎక్కువ.
అయితే ఒంటికి మంచిదని అన్ని రకాల సముద్రపు ఉత్పత్తులు తినొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. మరీ ముఖ్యంగా సముద్రపు నత్తగుల్లలు, ఆల్చిప్పలు, ఆయస్టర్స్ ను పక్కనపెడితే మంచిదని సూచిస్తున్నారు. ఈ మేరకు లండన్ కు చెందిన హల్ యార్క్ మెడికల్ యూనివర్సిటీ కొన్ని కీలక పరిశోధనల్ని బయటపెట్టింది.
సముద్రపు ఉత్పత్తుల్లో చేపల కంటే.. ఆయిస్టర్స్, ఆల్చిప్పలు, నత్తల్లో ఎక్కువ మైక్రో-ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు శాస్తవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలన్నీ కలుషితమౌతున్న నేపథ్యంలో.. వాటి ప్రభావం ఎక్కువగా పైన చెప్పుకున్న సముద్ర జీవరాశులపై పడిందని వాళ్లు చెబుతున్నారు.
2014 నుంచి 2020 మధ్య దాదాపు 50 అధ్యయనాలు చేసింది ఈ యూనివర్సిటీ. ఫిష్, సెల్-ఫిష్ మధ్య మైక్రో-ప్లాస్టిక్స్ వ్యత్యాసాల్ని గమనించింది. ఫిష్ కంటే సెల్-ఫిష్ (ఆల్చిప్పలు, నత్త) తినడం వల్ల ఆరోగ్యానికి అది హాని చేస్తుందని కనుగొన్నారు. చైనా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
ప్రస్తుతం సముద్రాల్లో లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని జలజీవరాశులు మింగేస్తున్నాయి. ఆ ప్రభావం ఎక్కువగా ఈ షెల్-ఫిష్ రకాలుపై పడుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
2060 నాటికి, అంటే మరో 40 ఏళ్లలో ప్రపంచంలో ప్లాస్టిక్ వ్యర్థాల మొత్తం 3 రెట్లు పెరిగి, 265 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని, అప్పుడిక షెల్-ఫిష్ రకాల్ని పూర్తిగా తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.