అనాథలను దత్తత తీసుకునేంత మంచి హృదయం పలువురు హీరోయిన్లకు ఉంటుంది. ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. సుస్మితా సేన్, సన్నీలియోన్, హన్సిక.. వీళ్లంతా అనాథలను అడాప్ట్ చేసుకున్న వాళ్లే. దిక్కూమొక్కు లేని పిల్లలకు అన్ని వసతులూ కల్పిస్తున్న వారే.
హీరోయిన్ల కెరీర్ గాలిలో దీపం లాంటిదే. ఎప్పుడు విరివిగా అవకాశాలు వస్తాయో, ఎప్పుడు నిరాదరణ ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన స్థితిలోనే ఉంటారు చాలా మంది హీరోయిన్లు. అయినా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు తీసుకుంటూ తమ మంచి మనసును చాటుకున్నారు ఈ హీరోయిన్లు.
ఇలాంటి జాబితాలోనే చోటు సంపాదిస్తుంది రవీనా టాండన్. ఈ అందాలభరిణె దశాబ్దాల కిందటే పిల్లలను దత్తత తీసుకుంది. ప్రస్తుతం రవీనా వయసు 46 కాగా, ఈమె తన 21వ యేటే ఇద్దరమ్మాయిలను దత్తత తీసుకుని వారి బాధ్యతలు తీసుకుంది.
ఒక దశలో బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి, ఇప్పటికీ గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న రవీనా అలా చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుని తనకు గొప్ప మనసుందనే విషయాన్ని కూడా చాటుకుంది.
ఈమె ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నప్పుడు చాలా మంది భయపెట్టారట. ఇలా పిల్లలను కలిగి ఉంటే.. నీకు పెళ్లి కూడా కాదు అంటూ కొంతమంది అన్నారట. అయితే రవీనాకు అలాంటి ఇబ్బంది ఏమీ ఎదురుకాలేదు.
ఈమె ను పెళ్లి చేసుకోవడానికి మహామహులే పోటీ పడే పరిస్థితే వచ్చింది ఆ తర్వాత. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని ఈమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. రవీనా దత్తత తీసుకున్న పిల్లల్లో ఒకరి పెళ్లి కూడా జరిగినట్టుగా ఉంది.