రాముడు లోకాభిరాముడు. అటువంటి మర్యాద పురుషోత్తముడిని రాజకీయాలకు వాడుకోవడం ఈ దేశంలో ఎపుడో మొదలైంది. పైగా దాన్ని స్టార్ట్ చేసిందే బీజేపీ. అయోధ్యా రాముడు రెండు సీట్ల బీజేపీని ఎంతదాకా తీసుకువచ్చాడో అందరికీ ఎరుకే.
ఇపుడు ఉత్తరాంధ్రాలోని అయోధ్య గా పేరుపొందిన రామతీర్ధంలో రాజకీయ రచ్చ యమ జోరుగా సాగుతోంది. మొన్న చంద్రబాబు రామతీర్ధానికి వెళ్ళి చేసిన హడావుడిని అంతా చూశారు.
ఇపుడు ఏపీలో బీజేపీ జనసేన వంతుగా ఉంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తన మందీ మార్బలంతో రామతీర్ధాన్ని చేరుకున్నారు. అయితే అక్కడ భద్రతాకారణాల వల్ల పోలీసుకు కొండపైకి వెళ్లవద్దు అని అడ్డుకుంటే సోము వీర్రాజు వారి మీద ఫైర్ అవుతున్నారు.
పైగా తాము రాజకీయాలు చేయడానికి అక్కడకు రాలేదు అని సోము అంటున్నారు. రాజకీయ నాయకులు రాజకీయం చేయక మరేమిచేస్తారో అందరికే ఏరుకే. తెలుగుదేశం రాజకీయాలు చేస్తూంటే తాము హిందూమతోద్ధరణకు ఈ యాత్ర చేపట్టామని సోము అనడమూ విడ్డూరమే.
ఏది ఏమైనా రాముడి కోవెల రాజకీయాలు అడ్డాగా మారడమే దారుణం. అసలైన రామభక్తుల కంటే కూడా రాజకీయ భక్తులు ఎక్కువైపోయారన్న విమర్శలు వస్తున్నాయి. లేకపోతే అతి చిన్న పల్లె ప్రాంతం రామతీర్ధాన్ని రాజకీయ దండు ఇలా కట్టకట్టుకుని చుట్టుముట్టడమేంటన్న చర్చ కూడా మేధావుల్లో వస్తోంది.