మసాలా2: వసూళ్లు సరే.. ఖర్చులు పారదర్శకమేనా?

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రజలనుంచి అప్పులు తీసుకుని.. ఆ దామాషాకు వారికి మసాలా బాండ్లు ఇస్తాం-అని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులు కాకుండా.. ప్రజలనుంచి, అలాగే విదేశాల్లో ఉన్న…

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రజలనుంచి అప్పులు తీసుకుని.. ఆ దామాషాకు వారికి మసాలా బాండ్లు ఇస్తాం-అని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులు కాకుండా.. ప్రజలనుంచి, అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు వారి నుంచి భారీ స్థాయిలో నిధులు అప్పుల రూపేణా సేకరించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ అప్పులు తీసుకునే వ్యవహారాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచాలని, రుణదాతలకు ఇచ్చే బాండ్లు, వడ్డీల విషయాల్లో పారదర్శకత ఉండాలని చంద్రబాబు ఆదేశిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి చంద్రబాబాయుడు ఓ కమిటీని కూడా ఏర్పాటుచేశారు. అప్పులు తీసుకోవడంలో విధివిధానాలను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని ఆయన ఆ కమిటీలోని వారిని పురమాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్లు వేసుకుంటే వచ్చే వడ్డీకంటే సాలీనా 2, 3శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తాం అని ఆశ చూపిస్తూ ప్రజలనుంచి డబ్బు రుణాలుగా తీసుకోవాలని.. ఆ మేరకు వారికి బాండ్ల జారీ పారదర్శకంగా ఉండాలని బాబు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కానీ అసలు సంగతి ఏంటంటే.. అప్పులు తీసుకోవడం పారదర్శకంగానే తీసుకుంటారు. కానీ, వచ్చిన సొమ్మును ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందా? అనేదే అందరికీ కలుగుతున్న సందేహం. రూపాయి నిధి సమకూరితే.. అందులో అర్ధరూపాయి స్వాహా చేసి, దొంగలెక్కలు, పెరిగిన అంచనాలు చూపిస్తూ.. ప్రభుత్వాధినేతలు జేబులో వేసుకునే పనైతే.. జనం అందుకు ఎందుకు సహకరించాలి అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.

జనం నుంచి వసూలు చేయడాన్ని పారదర్శకంగా ఉంచుతాం అంటున్నారు.. అదే మాటను సీఎం ఖర్చుల విషయంలో చెప్పగలరా? అని ప్రజలు అడుగుతున్నారు. ఒక్క పోలవరం విషయంలోనే శ్వేతపత్రం విడుదల చేయండి.. ఎవరు తప్పు చేశారో ప్రజలకు అర్థమవుతుంది అని అడిగితే.. చంద్రబాబు రంకెలు వేశారే తప్ప.. తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు.

పోలవరం విషయంలో… అంచనాల పెంపు రూపంలో అనూహ్యమైన, అరాచకమైన అవినీతికి పాల్పడుతున్నందువల్లనే కేంద్రం నిధులు విడుదల చేయడంలేదనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. మరి అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. రాజధాని నిర్మాణం పేరిటన స్వాహా పర్వం నడిపించేట్లయితే.. అందుకు ప్రజలంతా డబ్బు అప్పుగా ఇవ్వాలా? అనే డౌటు కూడా ప్రజలకు కలుగుతోంది.

ఖర్చులను కూడా పారదర్శకంగా ఉంచుతూ.. ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో అప్ డేట్ చేస్తూ.. ‘అంచనాల పెంపు వంటి ఎలాంటి దొంగపనులకు పాల్పడకుండా ఉంటా’ అని చంద్రబాబు మాట ఇస్తే తప్ప.. ఈ రుణాలకు ప్రజలనుంచి పెద్దగా స్పందన ఉండకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.