ప్రజలనుంచి అప్పులు తీసుకుని రాజధాని కట్టేస్తాం.. అంటే.. అదేమీ డిజైన్లు ఓకేచేసి.. వాటిని పచ్చపత్రికల్లో అచ్చొత్తించి.. ప్రజలకు అరచేతిలో అమరావతిని చూపించినంత ఈజీ యేం కాడు. ప్రజలనుంచి ప్రభుత్వం సొమ్ములు రుణంగా తీసుకోవాలంటే.. అందుకు ప్రతిగా బాండ్లు ఇచ్చి వారిలో ఒక నమ్మకాన్ని నిలబెట్టాలంటే.. అందుకు బోలెడు నిబందనలు ఉంటాయి.
ఇలా తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి గనుక.. రిజర్వు బ్యాంకు కనుసన్నల్లో వ్యవహారం జరుగుతుంది. ఇవన్నీ ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజిమెంట్) పరిదిలోకి వస్తాయి. ఎఫ్ఆర్బీఎం అనగానే అనేక క్లిష్టమైన నిబంధనలు చుట్టుముడతాయి. ఆ నిబంధనలకు చిక్కకుండా, దొంగమార్గాల్లో అప్పులు పుట్టించుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మార్గాలు వెతుకుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రధానంగా.. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాగానే.. ప్రభుత్వానికి అప్పు తీసుకోగల తాహతు ఎంత? అని వారు లెక్క వేస్తారు! ఆ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమిస్టిక్ ప్రోడక్ట్ (జీఎస్డీపీ) లో 3 శాతం మాత్రమే వారు అప్పుతీసుకోవడం కుదురుతుంది. అంతకు మించి అనుమతులు లభించవు. ఆ నిబంధనలకు లోబడి ప్రజలనుంచి రుణాలు తీసుకోవాలని అనుకుంటే గనుక.. చంద్రబాబు ఆశిస్తున్న మొత్తంలో పదిశాతం కూడా రాకపోవచ్చు. అందుకే ఆయన ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు.
రుణం ప్రభుత్వం తీసుకోకుండా.. సీఆర్డీయే వంటి సంస్థలు తీసుకునేలా వారికి ఒక ప్లాన్ ఉంది. కానీ.. అలా చెబితే జనం నమ్మి ఎలా రుణం ఇస్తారు. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తప్ప స్పందన ఉండదు. ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇస్తే.. మళ్లీ ఎఫ్ఆర్బీఎం నిబంధనలన్నీ వర్తిస్తాయి. తీసుకునే మొత్తాలకు సీలింగ్ పడిపోతుంది.
ప్రజల సొమ్ము తీసుకుని బాండ్లు ఇచ్చేయడానికి మద్యలో సెబి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. వీటి రూపకల్పన చాలా సమయం తీసుకుంటుంది. పైగా తీసుకునే మొత్తానికి బ్యాంకులు ఇచ్చేదానికంటె కనీసం 3 శాతం ఎక్కువ ఇస్తాం అని చంద్రబాబు అంటున్నారు. బ్యాంకులు సీనియర్ సిటిజన్లకైతే 7.5 శాతం వరకు ఇస్తున్నాయి. అంటే ప్రభుత్వం దాదాపు 10 శాతం వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మొత్తం తడిసి మోపెడై, భారం చాలా అధికంగా మారే ప్రమాదం కూడా ఉంది.
ఏతా వతా అసలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఉండేలా అప్పులు పుట్టించగల మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు.. తన కోటరీలోని ఆర్థిక నిపుణులను పురమాయిస్తున్నారట. వారు మార్గాలను చెప్పగలరు. కానీ ప్రజలు ఇచ్చే డబ్బుకు ప్రభుత్వ గ్యారంటీని మాత్రం ఇవ్వలేరు. అలాంటప్పుడు ప్రజలు ఇచ్చే డబ్బుకు భద్రత అనేది గాల్లో పెట్టిన దీపంలాగా మారుతుంది. మరి, ప్రజల్లో భయసందేహాలు కలగవా? వారి స్పందన ఎలా ఉండొచ్చు? చంద్రబాబు విధానాలను తేలిస్తే తప్ప చెప్పలేం.