‘ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే’ అని సంస్కృతంలో ఒక సామెత. అంటే.. ప్రయోజనం ఆశించకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు అని అర్థం. అదే చంద్రబాబునాయుడు విషయానికి వస్తే.. ‘రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ఆయన ఏ పనీ చేయరు! అని ఎరిగిన వారు అంటుంటారు.
ఇప్పుడు రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రజల నుంచి రుణాలు తీసుకుని మసాలాబాండ్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్న తరుణంలో కూడా.. ప్రజలకు ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. దీనిద్వారా ఆయనకు ఉండగల రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనే కోణంలో పరిశీలించినప్పుడు.. చాలా పెద్ద కుట్ర కోణమే బయటపడుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడు ప్రజలందరూ కూడా విరివిగా అప్పులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అప్పులకు బాండ్లు ఇస్తాం అంటున్నారు. ఆ బాండ్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా సరే.. కొత్త ప్రభుత్వం విధిగా అప్పు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు నిబంధనలు పటిష్టంగానే ఉన్నాయి. ఈ బాండ్లు ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి వస్తాయి.
అయితే వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ.. ఒకసారి అప్పుల సమీకరణ పర్వం పూర్తయిపోయిన తర్వాత.. ఎన్నికలు ముంచుకు వచ్చే సమయానికి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను… ప్రధానంగా రుణాలు ఇచ్చిన ప్రజలను ఒక రకమైన భయవిహ్వలతకు గురిచేసే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో అమరావతి నగరం పూర్తి కావాలంటే.. ఇచ్చిన అప్పులు సజావుగా ప్రజలకు తిరిగి చెల్లింపులు జరగాలంటే.. తెలుగుదేశాన్ని మాత్రమే మీరు విధిగా గెలిపించాలి.. అంటూ.. ఆయన ప్రజలను (రుణదాతలను) బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం పుష్కలంగా ఉన్నదనేది కొందరి వాదన.
అదే జరిగితే గనుక.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నిర్మించే రాజధానికోసం అప్పులిచ్చిన వాళ్లంతా.. పంచెలు ఎగ్గట్టుకుని.. తెలుగుదేశం విజయం కోసం శ్రమించాల్సి వస్తుంది. తెలుగుదేశం గెలవకపోతే.. తాము ఇచ్చిన అప్పులు వెనక్కి వస్తాయో లేదో.. వాటిలో ఎలాంటి నిబంధనలు ఎలా మారుతాయో ఏమో, తమకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఏమో అనే భయం వారిలో ఉండే అవకాశం ఉన్నదనేది పలువురి అంచనా.
ఆ రకంగా ఎన్ని వేల, లక్షల మంది స్పందించి రాజధాని కోసం అప్పులు ఇస్తారో అంత మంతి ప్రచార కార్యకర్తలను అప్పనంగా నయాపైసా ఖర్చు లేకుండా చంద్రబాబు సంపాదించుకుంటారన్నమాట. తాము ఓట్లు వేయడం మాత్రమే కాదు.. తమకు తెలిసిన అందరితోనూ తెలుగుదేశానికి ఓట్లు వేయించే ఖర్మ అప్పులిచ్చిన వారికి తప్పని పరిస్థితిని ఆయన కల్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.