నేను 2011 అక్టోబరులో యీ కాలమ్‌లో ‘‘హేమామాలిని’’ జీవిత చరిత్రను సీరియల్‌గా యిచ్చాను. కొంతమంది పాఠకులు మళ్లీ చదవాలనుకుని నన్ను అడిగారు. దాన్ని పుస్తకంగా వేసే ఆలోచన లేదు కాబట్టి ఆ సీరీస్‌ను రిపీట్ చేస్తున్నాను. 15 ఏళ్లల్లో కొత్తగా చేరిన పాఠకులు మొదటి సారి దీన్ని చదవవచ్చు. ఇప్పటికే చదివేశాం కదా అనుకున్న వాళ్లు వదిలేయవచ్చు.
అందాలరాశికి నిర్వచనం హేమామాలిని. వైజయంతిమాల తర్వాత హిందీ తెరపై దాక్షిణాత్యుల సౌందర్యానికి ప్రతీకగా వెలిగిన హేమ కెరియర్ మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. ఉత్తరభారతంలో మీడియా ‘ఇడ్లీ మాలిని’ అని, ‘ఉడెన్ ఫేస్’ అనీ ఆమెను చాలా వెక్కిరించారు. ఆమెకు తగని సిగ్గు అనీ, తల్లి చేతిలో కీలుబొమ్మ అనీ, హిందీ ఉచ్చారణ బాగుండదని, ఏదో కాస్త అందం, డాన్సుతో లాక్కుని వస్తోంది తప్ప అభినయం రాదని, సోషల్ లైఫ్ లేదని – చాలా రకాలుగా విమర్శించారు. దానికి తోడు సినిమాల్లోకి ఆమెను తీసుకుని వచ్చిన పెద్దమనిషి కాంట్రాక్టు రాయించుకుని, ఆమె ఆదాయంలో సింహభాగం తనే తీసేసుకున్నాడు.
కానీ అందరూ బిడియస్తురాలనుకునే హేమ భయపడలేదు. రకరకాల పాత్రలు అంగీకరించి తన అభినయకౌశలంతో ప్రజలను మెప్పించింది. వేషాల కోసం అంగప్రదర్శనకు సిద్ధపడలేదు. పెళ్లి చేసుకోమని అనేకమంది హీరోలు ఆమె వెంట పడ్డారు. కానీ ఆమె అప్పటికే వివాహితుడిపై మనసు పడింది. ఆమెను తీర్చిదిద్దిన తల్లికి, తండ్రికి ఆ వివాహం సుతరామూ యిష్టం లేదు. చివరకు ఆ హీరో ఈమెకు తన జీవితంలో ద్వితీయస్థానమే యిచ్చాడు. స్వంత భార్యాబిడ్డలను వదలలేదు. ఈమె యింటికి అతిథిగా వచ్చి వెళ్లడమే తప్ప, భర్తగా, తండ్రిగా బాధ్యతలు తీసుకోలేదు. ఈమె విడిగా బతుకుతూ తన ఆడపిల్లలిద్దరినీ తనే తల్లీ, తండ్రీ అయి పెంచింది.
హేమామాలిని కేవలం అభినేత్రి మాత్రమే కాదు, అత్యుత్తమ శ్రేణికి చెందిన నర్తకి కూడా. సినిమాలలో ఎంత డబ్బు సంపాదిస్తున్నా నాట్యం మాత్రం విడిచిపెట్టలేదు. ఎన్నో నృత్యనాటికలకు రూపకల్పన చేసింది. దర్శకత్వం వహించింది. హిందీ సినిమాలు నిర్మించడంతో బాటు ఓ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా. ఒక ఇంగ్లీషు మ్యాగజైన్‌కు గౌరవ సంపాదకత్వం వహించింది. పార్లమెంటు సభ్యురాలైంది. సంప్రదాయానికి ప్రతిరూపంగా కనబడుతూనే, ఆత్మగౌరవానికి లోటు రాకుండా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళ ఆమె. సౌందర్యం హుందాతనం కలబోసిన హేమామాలిని జీవితం పూలపాన్పు కాదు. కష్టసుఖాలు కలబోసిన సాహసగాథ ఆమెది. ఆమె పాత్రలతో బాటు ఆమె వ్యక్తిత్వంపై దృష్టి సారిస్తూ ఆమె కథ చెప్పుకుందాం.
హేమామాలిని కథ చెప్పాలంటే వాళ్ల అమ్మగారు జయా చక్రవర్తి దగ్గర మొదలుపెట్టాలి. ఎందుకంటే హేమను నటిగా, వ్యక్తిగా రూపు దిద్దినదీ, హేమను డాన్సరుగా చూడాలని తపస్సు చేసినదీ, ఎందరు వెక్కిరించినా పట్టు విడవనిదీ – ఆవిడే కాబట్టి! జయ స్వంత వూరు తమిళనాడులో తిరుచ్చి వద్దనున్న అమనగుడి. ఆమె తండ్రి పార్థసారధి అయ్యంగార్ ఆమెకు సంగీతం నేర్పించారు. ఆవిడకు వయొలిన్ వాయించడం బాగా వచ్చు. బొమ్మలు వేసేది. పదమూడో ఏట వియస్‌ఆర్ చక్రవర్తి అనే ఆయనతో పెళ్లయింది. చక్రవర్తి ఢిల్లీలో లేబర్ మినిస్ట్రీలో పనిచేసేవారు. తర్వాత ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్సు కార్పోరేషన్‌లో చేరారు. కాపురానికి వచ్చాక మామూలుగా అయితే ఆవిడ అభిరుచులన్నీ మూలపడేవి.
కానీ చక్రవర్తి తన భార్య సామర్థ్యాన్ని గుర్తించి, చదువుకోమని ప్రోత్సహించారు. మెట్రిక్ పూర్తి చేయించారు. హిందీ పరీక్షలకు పంపారు. హిందీలో ఆవిడ ‘ప్రభాకర్’ పరీక్ష పాసయి హిందీలో ట్యూషన్లు చెప్పి భర్త సంపాదనకు సహాయపడేది. వయొలిన్ మానేయవద్దని చెప్పారు. చిత్రకళలో ప్రవేశం వుందని తెలియగానే కాన్వాసు, రంగులు కొని యిచ్చి బొమ్మలు వేసుకోమన్నారు. ఇంటి పనుల్లో చేదోడువాదోడుగా వుండేవారు. ఆవిడ పుస్తకాలు బాగా చదివేది. తమిళ పత్రికలకు వ్యాసాలు రాసేది. వాళ్లకు ముగ్గురు పిల్లలు. హేమ పుట్టేనాటికి పెద్ద కొడుకు కణ్నన్‌కు నాలుగేళ్లు, రెండో కొడుకు జగన్నాథ్‌కు రెండేళ్లు. హేమ పురిటికి జయ పుట్టింటికి వచ్చారు.
అమన గుడిలోనే 1948 అక్టోబరు 15 న దసరా పండగ రోజుల్లో హేమ పుట్టింది. అప్పుడు జయ, లక్ష్మీదేవి బొమ్మ గీస్తున్నారు. హేమ పుట్టగానే లక్ష్మీదేవి పేరే ‘హేమామాలిని’ అని పెట్టారు. హేమ బాల్యం దిల్లీలో గడిచింది. గోల్ మార్కెట్ వద్ద చక్రవర్తి కిచ్చిన గవర్నమెంటు క్వార్టర్స్‌లో వుండేవారు. చిన్నప్పటినుండి జయ తన కూతుర్ని గొప్ప డాన్సరుగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే పనిచేశారు. ఇంట్లో వున్నా ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా భంగిమ పెట్టాలో చెపుతూనే వుండేవారు. ఏదైనా నృత్యప్రదర్శనకు తీసుకెళ్లినపుడు యింటికి రాగానే ఆ నర్తకి ఎక్కడ బాగా చేసిందో, ఎక్కడ చేయలేదో విశ్లేషించి కూతురికి చెప్పేవారు. ఒకే గురువు దగ్గర వుంటే విద్య పెద్దగా రాదని తరచుగా గురువులను మారుస్తూ వుండేవారు. ఆర్నెల్లకో టీచరు.
హేమ మద్రాస్ హైయ్యర్ సెకండరీ స్కూలులో చదివేది. వాళ్ల అన్నలూ అక్కడే చదివేవారు. స్కూలు అయిపోగానే ఆటలాడేందుకు వీలు పడేది కాదు. ఇంటికి వచ్చి హోం వర్క్ పూర్తి చేసుకుని, డాన్సు క్లాసులకు పరిగెత్తాలి. తక్కిన పిల్లల్లా ఆటపాటలు, అల్లరి ఎరగదామె. ఎప్పుడైనా అమ్మను అల్లరి పెడితే జయ విధించే శిక్ష ఏమిటో తెలుసా? – అవేళ మూడు డాన్సు ఐటమ్స్ ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి! ఈమె డాన్సు ప్రాక్టీసు చేస్తూ వుంటే వాళ్ల చిన్నన్న జగన్నాథ్ మొహం వికారంగా పెట్టి వెక్కిరిస్తూ వుండేవాడు. అది చూసి హేమా యికిలించేది. నీకు ఏకాగ్రత లేదు, ఇలా అయితే డాన్సు ఏమొస్తుంది అంటూ జయ హేమను తిట్టిపోసేది. డాన్సు ఒకటీ చాలనట్టు జయ కూతురికి కర్ణాటక సంగీతం కూడా నేర్పించబోయింది. ఆవిడ పోరు భరించలేక హేమ సంగీతపు క్లాసులకు వెళ్లి, నాలుగో గ్రేడు పరీక్షలకు హాజరైనా చివరకు ఫైనల్స్‌కు మాత్రం హేమ వెళ్లలేదు. తల్లికి బాధ వేసింది కానీ డాన్సు మీద ఫోకస్ పోకుండా వుంటుందిలే అనుకుని తృప్తిపడింది.
చక్రవర్తి ఏడాదికి మూడుసార్లు మద్రాసునుండి వైష్ణవ పండితులను తన యింటికి రప్పించి రెండు, మూడు రోజుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేసేవారు. దిల్లీలో వున్న తమిళ ప్రముఖులు చాలామంది వాటికి హాజరయ్యేవారు. ఆ విధంగా ఆయనకు పరిచయాలు పెరగడం వలన హేమ బాలనర్తకిగా చాలామంది ప్రముఖుల సమక్షంలో డాన్సు చేయగలిగింది. బాబూ రాజేంద్రప్రసాద్, ఎలిజిబెత్ రాణి, ఓసారి వాళ్లు సప్రూ హౌస్‌లో వైజయంతిమాల నృత్యప్రదర్శనకు వెళ్లినపుడు వైజయంతిమాల హేమను మెచ్చుకుని షేక్‌హ్యాండ్ యిచ్చింది. హేమకు ఆరోజు ఏనుగెక్కినంత సంతోషం!
దిల్లీలో వుండగా హేమ గురువుల్లో చెప్పుకోదగినవారు – ఇందిర. ఈవిడ మద్రాసు లోని కళాక్షేత్రలో నాట్యం అభ్యసించారు కాబట్టి ఆ తరహా లోనే హేమకు పాఠాలు నేర్పారు. చాలా మంచి టీచరే కానీ బాగా స్ట్రిక్టు. చెప్పుకోదగిన యింకో గురువు – త్రివేణి కళా సంఘం నడిపే సిక్కిల్ రామస్వామి పిళ్లయ్. ఆయన వద్ద హేమతో బాటు నృత్యం నేర్చుకున్నది అప్పటి మిస్ ఇండియా ఇంద్రాణి రెహమాన్. గురువుగారు చాలా బాగా నేర్పేవారు కానీ ఆయనతో ఒక్కటే చిక్కు. ప్రదర్శన జరుగుతూంటే ఆయన నట్టువాంగం మీద దృష్టి కేంద్రీకరించే బదులు పాట పాడేవాడు. పైగా ఆయన పెద్ద పాటగాడు కాదు. అసలు గాయకులు ఏమీ అనలేక పళ్లు నూరుకునేవారు. దాంతో ఆయన దగ్గర్నుంచి మారిపోవాల్సి వచ్చింది. ఇక తక్కిన టీచర్లలో తిరువాళపుత్తూర్ స్వామినాథ పిళ్లయ్, మైలాపూర్ గౌరి అమ్మాళ్, అరుణాచలం పిళ్లయ్. ఎంతమంది ఎంత నేర్పినా జయ తృప్తిపడేది కాదు. టీచర్లను మార్చేసేది. కొత్త టీచరు వచ్చినపుడల్లా వాళ్ల స్వభావానికి, నేర్పే తీరుకి తగ్గట్టు తనను మలచుకోవడం హేమకు యిబ్బందిగా వుండేది. కూతురు యిబ్బంది గ్రహించినా నిర్దుష్టమైన విద్య నేర్చుకోవాలంటే యిలాటివి అనుభవించక తప్పదని జయ నిశ్చితాభిప్రాయం.
కొన్నాళ్లు పోయేటప్పటికి కాపురాన్ని మద్రాసుకి మార్చేస్తే తప్ప హేమ సరైన డాన్సర్‌గా రూపొందదని జయకు అనిపించింది. అక్కడైతే నేర్చుకునేందుకు మంచి వాతావరణం వుంటుంది, నేర్పేందుకు గొప్ప గురువులున్నారు. మద్రాసుకి మారాలంటే చక్రవర్తి ట్రాన్స్‌ఫర్ కోరాలి. మగపిల్లల్లో పెద్దవాడు దిల్లీ హన్స్‌రాజ్ కాలేజీలో సైన్సు చదువుతున్నాడు. రెండో వాడు స్కూలు చదువు చివర్లో వున్నాడు. వాళ్లని దిల్లీ లోనే వుంచాలి. ఎన్ని యిక్కట్లున్నా మద్రాసుకి మారాల్సిందే అని జయ పట్టుబట్టడంతో చక్రవర్తి సరేననక తప్పలేదు. మగపిల్లల్ని అమ్మమ్మగారి యింట్లో దిల్లీలో వుంచి 14 ఏళ్ల కూతురితో సహా 1962లో మద్రాసుకి తరలిపోయారు. హేమను మద్రాసు లోని రోజరీ మెట్రిక్యులేషన్‌లో చేర్చారు. చేర్చారే కానీ డాన్సు క్లాసులకీ, స్కూలుకీ క్లాష్ రావడంతో స్కూలు మాన్పించి ప్రయివేటుగా ఆంధ్రా మెట్రిక్యులేషన్‌కు కట్టించారు.
మద్రాసులో హేమ మూడు రకాల నాట్యాన్ని ముగ్గురు మహానుభావుల వద్ద అభ్యసించింది. వెంపటి చిన సత్యం గారి దగ్గర కూచిపూడి, నటనం గోపాల్ కృష్ణన్ వద్ద మోహినీ ఆట్టమ్, కిట్టప్ప పిళ్లయ్ వద్ద భరతనాట్యం నేర్చుకుంది. వైజయంతిమాల డాన్సు కార్యక్రమానికి హాజరైన హేమ కుటుంబం ప్రదర్శన ఐన తర్వాత ఆవిడ గురువు గారైన కిట్టప్పగారిని కలిసి హేమకు నాట్యం నేర్పమని కోరారు. ఆయన కొన్నాళ్లు పోయాక హేమ యింటికి వచ్చి ఆమె ముద్రలు చూసి ముగ్ధులై నాట్యం నేర్పుతానన్నారు. అప్పటినుండి ఆయన చనిపోయే వరకు హేమకు గురువుగానే వున్నారు. హేమకు గురువులను వెతికే భారం జయకు తప్పిపోయింది. అటువంటి గురువు దొరకడం తన అదృష్టమని హేమ అనుకుంటే, హేమ వంటి చిత్తశుద్ధి వున్న శిష్యురాలు దొరకడం వలన తన విద్య పదిమందికీ మరింతగా తెలియవచ్చిందని కిట్టప్ప పిళ్లయ్ భావించారు.
మద్రాసు నివాసం కారణంగా హేమపై అందరి దృష్టీ పడింది. అనేక ప్రదర్శనలు యిచ్చేది. థియేటర్ వాళ్లతో ఏర్పాట్లు, పెద్దవాళ్లని పిలవడం, ప్రదర్శన జరిగేటప్పుడు వ్యాఖ్యానం – యివన్నీ చక్రవర్తి బాధ్యతలు. హేమ ఆహార్యం, మేకప్, డాన్సు చేసేటప్పుడు పొరపాట్లు రాకుండా చూడడం జయ బాధ్యతలు. డాన్సు జరుగుతూండగా హేమ స్టెప్స్‌ను జయ గమనిస్తూ వుంటే ఆడియన్సు రియాక్షన్‌ను చక్రవర్తి గమనించేవారు. అప్పట్లో మద్రాసులో ఇంకో హేమామాలిని వుండడంతో యీమెను ”ఢిల్లీ హేమామాలిని” అనేవారు. వాళ్ల కుటుంబానికి మంచి స్నేహితుడైన కె. సుబ్రహ్మణ్యం సినిమా నిర్మాత-దర్శకుడు, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం తండ్రి. ఆయన తన యింట్లో హేమ నాట్యప్రదర్శన ఏర్పాటు చేసి తన స్నేహితులందరినీ అందర్నీ ఆహ్వానించారు. అప్పుడు కొంతమంది సినిమా నిర్మాతలకు హేమామాలిని గురించి తెలిసింది. (ఫోటోలు – హేమా తండ్రి, తల్లితో, సోదరులతో)
– ఎమ్బీయస్ ప్రసాద్

పారితోషికానికి తగిన పని