రష్మిక లీడ్రోల్ పోషించిన మైసా సినిమా వాయిదా పడిందనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. నిజానికి ఈ విషయాన్ని మేకర్సే ముందుగా లీక్ చేశారు. అలా అందర్నీ మానసికంగా ప్రిపేర్ చేసి, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు.
మైసా పోస్ట్ పోన్ అయినట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో సినిమాలు వాయిదా పడడం సర్వసాధారణం కాబట్టి ఎవ్వరికీ పెద్దగా షాక్ అనిపించలేదు. నిజానికి చెప్పిన టైమ్ కు వస్తే నిజంగా షాక్ అనిపించేదేమో.
అయితే వాయిదా పడిన విషయాన్ని చెబుతూ, మేకర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఫన్నీగా ఉంది. పడికట్టు పదాలతో, రొటీన్ డైలాగ్స్ వినిపించారు.
అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను తయారుచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ అందరూ చెప్పే మాటలే చెప్పారు.
కానీ మైసా ఎందుకు వాయిదా పడిందనే విషయం అందరికీ తెలుసు. ఈ సినిమాకు కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండొచ్చు. కానీ దాంతో పాటు సినిమా పోస్ట్పోన్కు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నిజాయితీగా వాటిని కూడా బయటపెడితే బాగుండేది.
ఏదేమైనప్పటికీ అంతా ఊహించినట్టుగానే మైసా వాయిదా పడింది. మరో విడుదల తేదీని సైతం ప్రకటించకుండా సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు.
