హనుమాన్ సినిమా సూపర్ హిట్టయింది. పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అయింది. దీంతో సహజంగానే దానికి సీక్వెల్ కూడా వస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ ఒక్క సినిమాకు 2 సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది హనుమాన్ సినిమా. ఆ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా జై హనుమాన్ ప్రాజెక్టు ప్రారంభించాడు ప్రశాంత్ వర్మ. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది.
హనుమాన్ కు సీక్వెల్ ఇదే అనే అంతా ఫిక్స్ అయిపోయిన తరుణంలో, హనుమాన్-2 తెరపైకి వచ్చింది. హనుమాన్ సినిమాను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వైష్ణవ్ తేజ్ హీరోగా హనుమాన్-2 సినిమాను ప్రకటించారు నిర్మాతలు నిరంజన్ రెడ్డి-చైతన్య రెడ్డి.
హనుమాన్ సినిమాకు అసలైన సీక్వెల్ తమదేనని వీళ్లు చెబుతున్నారు. అంతేకాదు, మొదటి సినిమా ఎక్కడ ఆగిందో, తమ సీక్వెల్ అక్కడ్నుంచి మొదలవుతుందని కూడా చెబుతున్నారు.
ప్రశాంత్ వర్మకు, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్కు అభిప్రాయబేధాలొచ్చాయంటూ గతంలో ఊహాగానాలు వినిపించాయి. అందుకే జై హనుమాన్ ప్రాజెక్టు మైత్రీకి వెళ్లిందంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అసలు నిర్మాతలు కూడా సీక్వెల్ ప్రకటించడంతో, అప్పటి పుకార్లు మరింత బలం చేకూరినట్టయింది.
ఈ మొత్తం వ్యవహారంలో తేజ సజ్జా ఎక్కడా కనిపించకపోవడం విచిత్రం. హనుమాన్లో హీరోగా నటించిన తేజ సజ్జా, అటు జై హనుమాన్లో లేడు. ఇటు హనుమాన్-2లో కూడా లేడు. జై హనుమాన్లో ఇతడు ఉన్నాడనే ప్రచారం నడుస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన లేదు.

Ento… Ee vipareetha budhulu..