నాకు హరీష్‌కు చిన్నప్పటి నుంచి పడదు.. టీఆర్ఎస్ చీఫ్ కవిత!

అయితే కేటీఆర్‌ను ల్యాప్‌టాప్ ఇవ్వాలని అడిగితే ఆయన కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. ల్యాప్‌టాప్ ఇవ్వకుండా ఎందుకు దాచిపెట్టారని కేటీఆర్‌ను ప్రశ్నించాలని అన్నారు.

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుకు, కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ అధినేత్రి కవితకు అసలు పడదనే సంగతి అందరికీ తెలుసు. ఆమె తరచుగా హరీష్‌రావుపై ఆరోపణలు చేస్తుంటారు. ఆయన్ని పెద్ద అవినీతిపరుడిగా చిత్రీకరిస్తుంటారు. ఘాటు విమర్శలు చేస్తుంటారు.

హరీష్‌రావుకు ‘గుంటనక్క’ అనే పేరు పెట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత హరీష్‌రావు గురించి, అన్నయ్య కేటీఆర్ గురించి మాట్లాడారు.

హరీష్‌రావు ఫెయిర్‌గా ఉండే వ్యక్తి కాదన్నారు. ఆయన చాటుమాటుగా కేసీఆర్‌ను కూడా నానా మాటలు అంటారని చెప్పారు. అందరిలో ఉన్నప్పుడు మామయ్య అంటూ ప్రేమగా మాట్లాడతారని, కానీ చాటుగా చాలా మాటలు అంటారని కవిత చెప్పారు.

తనకు, హరీష్‌రావుకు పడకపోవడం తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాదని, తమ ఇద్దరికీ చిన్నప్పటి నుంచే పడదని చెప్పారు. హరీష్‌రావు ఇరిగేషన్ మంత్రిగా చాలా అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

నాకు క్యాన్సర్ ఉందని, త్వరలోనే చనిపోతానంటూ కేటీఆర్ ప్రచారం

తనకు క్యాన్సర్ ఉందని, త్వరలోనే చనిపోతానంటూ 2019లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేయించారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.

రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచిన బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, నిరాధార ప్రచారాలు చేయించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తన గురించి తెలియని వ్యక్తులు ఇలాంటి ప్రచారం చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ తన గురించి పూర్తిగా తెలిసిన వారే ఇలా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కూతురిగా, కేటీఆర్ సోదరిగా ఉన్న తనపైనే ఒక మహిళపై ఎవరూ చేయనంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు. వారి మానసిక పరిస్థితి ఏంటో ప్రజలే అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

తనపై కోపంతో పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బందులకు గురిచేశారని కవిత ఆరోపించారు. తన దగ్గరకు వచ్చి మాట్లాడినా, తనతో ఫొటోలు దిగినా కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు.

2014 నుంచే నాపట్ల కేసీఆర్ వివక్ష

2014 నుంచే తన పట్ల ఇదే తరహా వివక్ష కొనసాగిందని వెల్లడించారు. నిజామాబాద్‌లోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కేసీఆర్‌ను ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను తీసుకెళ్లి ఫ్యాక్టరీని ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు.

తన నియోజకవర్గానికి సంబంధించిన పనుల విషయంలోనూ వివక్ష చూపించారని, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తన పేరు మీద లేఖ పంపిస్తే లక్షల రూపాయల ఖర్చుతో వచ్చే సాయం కేవలం రూ.60 వేలు మాత్రమేనని కవిత వ్యాఖ్యానించారు. కొన్ని విషయాలు చెప్పుకుంటే చిల్లరగా ఉంటాయని, కానీ ఇప్పుడు చెప్పుకునే టైమ్ వచ్చిందన్నారు.

రాజకీయాల్లో ఉన్న తన ఫోన్ ట్యాప్ చేసినా అర్థం చేసుకోగలనని, కానీ రాజకీయాలతో సంబంధం లేని తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేయడం బాధించిందని అన్నారు. తనను కేవలం కేసీఆర్ బిడ్డగా కాకుండా ఒక రాజకీయ నాయకురాలిగా చూడాలని కవిత కోరారు. 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా బతుకమ్మను ఎత్తుకొని ఉద్యమాలు చేశానని గుర్తుచేశారు.

లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు తాను ఉపయోగించిన 11 సెల్‌ఫోన్లను బహిరంగంగా చూపించి దర్యాప్తు సంస్థలకు అప్పగించానని కవిత గుర్తుచేశారు. తన పదేళ్ల రాజకీయ జీవితంలో ఉపయోగించిన ఫోన్లన్నింటినీ ఇచ్చానని, దర్యాప్తు సంస్థలు అడగకపోయినా పారదర్శకంగా వ్యవహరించానని చెప్పారు.

అయితే కేటీఆర్‌ను ల్యాప్‌టాప్ ఇవ్వాలని అడిగితే ఆయన కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. ల్యాప్‌టాప్ ఇవ్వకుండా ఎందుకు దాచిపెట్టారని కేటీఆర్‌ను ప్రశ్నించాలని అన్నారు.