రేపు జరగబోయే గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో ఆంధ్రమూలాల వారి ఓట్లు ఎటు పడతాయన్నదానిపై చర్చ చాలా జరుగుతోంది. వాళ్లను ఓటుబ్యాంకుగా పరిగణిస్తూ వాళ్లను ఉద్దేశించి వాగ్దానాలు, హామీలు కురిపిస్తున్నారు, వాళ్లకు ఆగ్రహం కలిగించడానికి వెరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలోనే యీ ఎనామలీ వుంది. జంటనగరాలు మాత్రమే కాదు, తెలంగాణ మొత్తమంతా చూసుకుంటే జనాభాలో దాదాపు నాల్గో వంతు మందికి ఆంధ్రలో మూలాలుంటాయి. వీరందరిని వ్యతిరేకం చేసుకుంటే నెగ్గడం, పాలన సాగించడం కష్టం. అందువలన 'మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు, కడుపులో పెట్టుకుంటాం, మీ అభివృద్ధికి తోడ్పడతాం, మీ ఆస్తుల జోలికి, వృత్తుల జోలికి రాము' అని చెప్పవలసి వస్తుంది. అలా చెప్పినది నిజంగా అమలు చేస్తే తెలంగాణ ఆవిర్భావం కోసం తపించిన వారు ఆక్రోశించాల్సి వస్తుంది. ఎందుకంటే 'తెలంగాణను దోపిడీ చేసినది ఆంధ్రులే, వాళ్లను తరిమివేసి, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు యిస్తాం, వారి పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి మీకు ఉద్యోగాలిచ్చేట్లా చేస్తాం, వాళ్లు వెళ్లిపోతే యిక్కడ అన్నీ ఖాళీ, ఆ స్థానాల్లో మీరే వచ్చి కూర్చోవచ్చు, మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఖాయం' అంటూ బహిరంగంగానే చెప్పారు. లోపాయికారీగా 'వాళ్ల నుండి యిళ్లు లాక్కుని మీకిస్తాం' అని చెప్పడం, గ్రామీణులు చాలామంది నమ్మడం జరిగింది. ఇప్పుడు 'ఆంధ్రులు, ఆంధ్రమూలాల వారు మా సోదరులు, వారిని కించిత్తు కూడా ఏమీ అనం, వెళ్లగొట్టం, మాతో సమానంగా చూసుకుంటాం' అంటే మరి వాళ్లు వెళ్లిపోతారని ఆశ పెట్టుకున్నవాళ్లు ఏమవాలి? వాళ్ల ఆశలు ఎప్పుడు తీరాలి? తీరకపోతే తెలంగాణ వచ్చి మాకేం ఒనగూడిందని వారు నిరాశ చెంది, తెలంగాణ సర్కారుపై కోపం పెంచుకోరా? ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అంటే యిదే కాబోలు.
తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లోనే యీ ఆంధ్రమూలాల ఓటు బ్యాంకు, సమైక్యవాదుల ఓటు బ్యాంకు గురించి నేను రాస్తూ వచ్చాను. టిడిపి కాని వైకాపా కాని తెలివిగా వ్యవహరించి, వీళ్లను మచ్చిక చేసుకుంటే వారికి కొన్ని సీట్లు ఎప్పుడూ దక్కుతూ, వారి మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పడలేని పరిస్థితి రావచ్చని! కానీ టిడిపి అందరి కంటె ముందు తెలంగాణ ఏర్పాటుకి లేఖ యివ్వడమే కాక, మేం యిచ్చినా యింకా విభజన జరగలేదేం అంటూ కాంగ్రెసును రెచ్చగొడుతూ సమైక్యవాదుల అభిమానాన్ని, ఆంధ్రమూలాల వారి నమ్మకాన్ని పోగొట్టుకుంది. తన అభిప్రాయం చెప్పకుండా భారమంతా కేంద్రం మీద వేసినట్లు నాటకమాడిన వైకాపా పరిస్థితి కూడా డిటోయే. చివరిలో సమైక్యవాద జండా పట్టుకున్నా, తీవ్ర విభజనవాదియైన తెరాసను పన్నెత్తి ఏమీ అనకపోవడం చేత అటూ, యిటూ కూడా విశ్వసనీయత పోగొట్టుకుంది. ప్రత్యేక ఉద్యమం నడుస్తున్నంతకాలం సమైక్యవాదులు, ఆంధ్రమూలాల వారు నోరు తెరవలేకపోయారు. ఆంధ్రుల సినిమా షూటింగులపై దాడులు జరిగాయి, వారిని నానా మాటలూ అన్నారు. ఇక్కడ కర్రీ పాయింట్లు పెట్టుకుని బతకవచ్చు అని యీసడించారు. ఏ పార్టీ నాయకులూ వీటికి గట్టిగా అభ్యంతరం తెలుపలేదు. తమను అందరూ విడిచి పెట్టేశారని వగచే స్థితిలో తెలంగాణలోని ఆంధ్రమూలాల వారిని వదిలేశారు.
ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు వచ్చేసరికి అందరికీ వారి మనోభావాలు గుర్తుకు వచ్చాయి. కెటియార్ 'ఉద్యమసమయంలో ఏవేవో అప్పటి అవసరాల కొద్దీ ఏవేవో అన్నాం. ఇప్పుడు పాలకులం కాబట్టి ఏమీ అనం. నేను గుంటూరు తదితర ప్రాంతాల్లో చదువుకున్నాను. నాకు అన్ని చోట్లా మిత్రులున్నారు. మిమ్మల్ని యిప్పటిదాకా తన్నలేదు చూశారా?' అని గుర్తు చేస్తున్నారు. ఎంత ఉద్యమసమయమైనా, హద్దులు దాటి కెసియార్, యితరులు మాట్లాడారు. పాఠాలు చెప్పిన గురువుల జాతిని రాక్షస జాతి అని తండ్రి అంటూంటే కెటియార్ అడ్డు చెప్పలేకపోయాడా? పాలనలోకి వచ్చాక మాత్రం పరిస్థితి మెరుగైందా? భౌతికపరమైన దాడులు జరగకపోతే గొప్పగా చూసుకుంటున్నట్లే అనుకోవాలా? ఎన్నో ఉమ్మడి సంస్థల్లో ఆంధ్ర అధికారులను తరిమివేశారు. విద్యుత్ బోర్డులో త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతున్న ఉద్యోగుల సమస్య చూడండి, గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల సమ్మె చూడండి, స్థానికతపై కేంద్ర ఆదేశాలను ఉల్లంఘించి, వీరే ఒక నిర్వచనం యిచ్చేసి, కొత్త రూల్సు ఏర్పరచి దానిలో యిమడనివారిని తరిమి కొడుతున్నారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ఎంతో హంగామా చేసి నిర్వహించిన సమగ్ర సర్వే ఫలితం ఏమైంది? సేకరించిన సమాచారాన్ని వుపయోగిస్తున్నట్లు ఎక్కడైనా అగుపించిందా? దాన్ని విడుదల చేశారా? మరి ఎందుకు నిర్వహించినట్లు? ఆంధ్రమూలాల వారిని గుర్తించి వారి పని పట్టడమే లక్ష్యంగా రూపొందించిన ఆ సర్వే, కోర్టు తీర్పు కారణంగా అసమగ్రం అయింది. ఎప్పణ్నుంచి నివసిస్తున్నారన్న విషయం రాబట్టలేకపోయాక యిక ఆ సర్వేతో పనేముందని పక్కన పడేశారు. కెసియార్ తలపెట్టిన యిలాటి ఎన్నో పనులకు కోర్టు అడ్డుపడుతోంది. అందుకే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు త్వరగా తెచ్చుకుని తన చర్యలకు ఆమోదముద్ర వేయించుకోవాలని కెసియార్ తహతహ. న్యాయమూర్తుల పోస్టింగును కూడా వివాదగ్రస్తం చేయడానికి అదే కారణం. ఇప్పటిదాకా మిమ్మల్నేం ఏమీ చేయలేదు అని కెటియార్ పైకి అంటున్నారు, 'చేయలేకపోవడానికి కోర్టులు అడ్డుపడుతున్నాయి, ఖర్మ' అన్నది అంతరంగంలో వున్న మాట.
నచ్చని ప్రతీవాణ్నీ ఆంధ్రుడనడం పరిపాటి అయింది. తమ చేతకానితనానికి ఆంధ్రులను నిందించడమూ మానలేదు. నిజాలు రాస్తే, వాటిని ఖండించే వీలులేని పక్షంలో ఆంధ్ర మీడియా అని తిట్టిపోయడం, కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఆంధ్రులు వెళ్లి తెలంగాణ అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్నారని నిందించడం.. యివన్నీ నడుస్తూనే వున్నాయి. సాంస్కృతికి కార్యక్రమాల విషయంలో, ఎవార్డుల విషయంలో కూడా ఆంధ్రమూలాల వారు వివక్షత ఎదుర్కుంటూనే వున్నారు. ఆంధ్రలో తెలంగాణవారికి సాహిత్యపరమైన ఎవార్డులు యిస్తున్నారు కానీ యిక్కడ పదవులు, బిరుదులు అన్నీ 'అచ్చ' తెలంగాణ వారికే. ఆంధ్రమూలాలున్నా విభజనోద్యమాన్ని గట్టిగా బలపరచిన పొత్తూరి వెంకటేశ్వరరావుగారి లాటి వాళ్లకు ఏ సత్కారమూ లేదు. టిడిపిలో వున్న తెలంగాణవారిని 'ఆంధ్రభృత్యుల'ని అవహేళన చేస్తూనే వున్నారు. మరి కాంగ్రెసువారి అధ్యక్షురాలు ఒకప్పుడు ఇటలీ, ఆ తర్వాత ఢిల్లీవాసురాలు కాబట్టి, వారిని కూడా ఇటలీదాసులనో, ఢిల్లీబానిసలనో అనాలిగా. బిజెపి వారినీ, కమ్యూనిస్టులను అందరినీ ఢిల్లీ తాబేదార్లనే అనాలి. కేవలం టిడిపి వారినే అనడం దేనికి? ఆంధ్రులు లోకువగా దొరికారనా? తెలంగాణ రాజకీయనాయకులు యిప్పటికీ ఆంధ్రశబ్దాన్ని ఒక నిందావాచకంగానే పరిగణిస్తున్నారన్నమాట అక్షరసత్యం.
ఇప్పుడు గ్రేటర్‌లో కెటియార్ ఆంధ్రులను బుజ్జగిస్తూ వుంటే నారాయణఖేడ్‌లో హరీశ్ ఎప్పటిలాగా తెలంగాణ సెంటిమెంటు రగిలిస్తూనే వున్నారు. మరో పక్క హోం మంత్రి నాయని 'ఆంగ్లదొరల నుంచి స్వాతంత్య్రం, ఆంధ్రదొరల నుంచి ప్రత్యేకరాష్ట్రం తెచ్చుకున్నాం' అంటూ దోపిడీదారులుగానే చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ వున్నవారంతా తెలంగాణ బిడ్డలే అంటూనే లోకేశ్‌ను మాత్రం 'నీకు యిక్కడేం పని?' అంటున్నారు కెటియార్. ఇది వింతగా లేదా? ఆయనకూ నీకూ రాజకీయవిభేదం వుండవచ్చు. అంతమాత్రం చేత లోకేశ్ తెలంగాణ బిడ్డ (మీ నిర్వచనం ప్రకారమే) కాకుండా పోతాడా? అంటే మీ ఉద్యోగాలకు, మీ రాజకీయాలకు, మీ అవసరాలకు అడ్డు రానంతకాలం తెలంగాణ వాడే. ఎప్పుడైతే తన హక్కు ప్రకటించుకుని, సాటి పౌరుడిగా నీతో పోటీ పడ్డాడో అప్పుడు ఆంధ్రుడు, పరాయివాడు, తెలంగాణ ప్రగతినిరోధకుడు అయిపోతాడు. ఇదీ తెరాస స్వభావం. దీన్ని ఆంధ్రమూలాల వారిపై ప్రేమ, వారిని సమానస్థాయిలో చూడడం అనరు. ఆంధ్రమూలాల వారికి టిక్కెట్లు యిస్తామని ప్రకటించారు. మేం టిక్కెట్టిచ్చినవారిలో ఫలానా వారు అలాటి వారు అని చేసిన ప్రకటన నేను చూడలేదు. కనీసం మేం ఫలానా ఆంధ్రమూలాల వారికి ఎవార్డులు యిచ్చాం, సత్కరించాం అని కూడా చాటుకోలేదు. ఎంతసేపూ మిమ్మల్ని యింకా తన్నలేదు, గుద్దలేదు అనే కబుర్లే. కర్మకాలి వాళ్లు ఓడితే, లేక కొద్దిపాటి తేడాతో నెగ్గితే ఆ సత్కారం కూడా జరుగుతుందా అనే సందేహం మెలగకుండా వుండదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)