బహిరంగ లేఖ : రమణగారి గురించి ఎవరు వ్యాసం రాసినా ఆయన్ని 'రాయని భాస్కరుడి'గా వర్ణించేవారు. పాత్రికేయులు అడిగితే 'సినిమాలకు రాస్తున్నాగా' అనేవారాయన. ఎంతైనా సినిమా రచన వేరేకదా! అదే ఆయన్ని అడిగాను ఓ సారి – ''నేను దిగువ మధ్యతరగతి జీవుల గురించి రాశాను. ఆ నేపథ్యంలోంచి వచ్చినవాణ్ని కాబట్టి. ఇప్పుడు అది దాటి వచ్చాను. అప్పటికీ యిప్పటికీ వారి జీవితాల్లోనూ మార్పు వచ్చింది. వాటిని అధ్యయనం చేయకుండా రాస్తే కన్విక్షన్ వుండదు. చేయాలంటే నా జీవనశైలిలోనూ మార్పు వచ్చింది.'' అన్నారు. ''పోనీ యిప్పుడు మీరు చూస్తున్న హై-ఫై జీవితం గురించే రాయండి. ఆ మనుషుల్లో చీకటికోణాలు, పొడసూపే వెలుగురేకలు – వీటిగురించి రాయండి.'' అన్నాను. ఆయన పెదాలు చప్పరించి వూరుకున్నారు.
ఈయనతో యిలాక్కాదని బహిరంగంగా లేఖ రాయాలనుకున్నాను. తర్వాత్తర్వాత ప్రతీ జూన్ 28 కి రమణగారి పుట్టినరోజు సందర్భంగా ఎవరో ఒకరు ఏదో ఒక పత్రికలో రాయడం అలవాటైంది కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకునేవారు కారు. 1993 జూన్ 28కి ఆరుద్రగారు ''ముళ్లపూడికి మల్లెపూలు'' అని జ్యోతి వీక్లీలో రాస్తే రమణగారు ''ధన్యవాదాలు- అన్యవాదాలు'' అంటూ తనమీదే సెటైర్లు వేసుకుంటూ మరుసటివారమే జవాబిచ్చేశారు. ఆయన్ని మెచ్చుకుంటే యిలాటి అక్షింతలే పడతాయనుకుంటూ 1994 జూన్ 28 ఆయన పుట్టినరోజు సందర్భంగా ''ముళ్లపూడికి బహిరంగలేఖ'' అని రాసి ఆంధ్రప్రభ వీక్లీకి పంపాను.
దానిలో కథకుడిగా ఆయన వైవిధ్యాన్ని పాఠకులందరికీ ఒక్కసారి గుర్తు చేశాను. మీ పేరు చెప్పగానే ''బుడుగు'', ''అప్పారావు''ల దగ్గర ఆగిపోతారు కానీ, మీరు చేపట్టని రచనాప్రక్రియ వుందా? సినిమాల గురించి 'విక్రమార్కుని సింహాసనం..' రాజకీయాల గురించి 'రాజకీయ బేతాళ పంచవింశతిక', సమాజం పోకడల గురించి 'గిరీశం లెక్చర్లు' .. అంటూ ఆయన రచనల్లో చూపిన విభిన్న రసాలను పాఠకుల ముందు ఆవిష్కరించాను. పనిలో పనిగా నేను సేకరించినవి, పుస్తకరూపంలో రానివి కొన్ని కథలను ఉదహరించాను. దీనిలో ఒక పొరపాటు దొరలింది. రమణశ్రీ అనే ఆయన రాసిన 'ఆత్మ సందేశం' కథను యీయన ఎక్కవుంటులో వేశాను. లైబ్రరీలో పేజీ చిరిగిపోయి 'శ్రీ' ఎగిరిపోయింది. ఈయన వట్టి 'రమణ' పేరుతో కూడా రాశారు కాబట్టి ఆయనదే అనుకున్నాను. ఆయనకు చూపిస్తే 'ఏమో, గ్యాపకం లేదండీ' అన్నారు.
ఆ కథ ఎన్నిసార్లు చదివినా రమణగారిదిలా అనిపించలేదు. మళ్లీ లైబ్రరీకి వెళ్లి యీసారి విషయసూచిక చూడబోయాను. ఆ పేజీ చినగలేదు. అక్కడ రమణశ్రీ అని వుంది. నాలిక కరుచుకున్నాను. ఈ లోపునే ఈ బహిరంగలేఖ అచ్చయిపోయింది. రమణగారి బాల్యమిత్రులు వాకాటి పాండురంగారావుగారు దాన్ని ఏదో ఓ మూల ఉత్తరాల శీర్షికలో కాకుండా పెద్దగా బాక్స్ కట్టి యీయన ఫోటోతో సహా వేశారు. దానితో అది చాలామంది రమణ అభిమానులను ఆకర్షించింది. వారిలో జంపాల చౌదరి అనే ఎన్నారై ఒకరు. రమణగారి కథలిన్ని వున్నపుడు అవన్నీ కలిపి ఓ పుస్తకం వేస్తే బాగుండును కదా అనుకున్నారు. వచ్చే ఏడాది, అంటే 1995 జులైలో షికాగోలో జరిగే తానా సభల్లో బాపురమణలను సత్కరించి ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపచేస్తే బాగుండును కదా అనుకుని నవోదయా రామమోహనరావుగార్ని సంప్రదించారు.
రమణగారి హామీ : ''మీ వల్ల మాకు ఫారిన్ ఛాన్సు తగిలిందండోయ్'' అంటూ రమణగారు ఫోన్ చేశారు. అదేమిటి? మీకదేమైనా కొత్తా? నా వలన ఏమిటి.. భలేవారే! అంటే విషయం చెప్పారు. అయితే కథల పుస్తకం వస్తుందన్నమాట అంటే ''అలాక్కాదు, దాన్ని వేరేలా చేస్తున్నాం. బాపురమణల స్నేహానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటూ మీరు సేకరించిన నా అముద్రిత రచనలు, బాపువి కొన్నీ కలిపి నవోదయావారు వేస్తానన్నారు. పేరు ''బొమ్మా బొరుసూ'' అన్నారు.
నేను ఉత్సాహం పట్టలేకపోయాను. రమణ గారి ప్రతిరచన క్రిందా ఫుట్‌నోట్ కింద రాసుకుపోయాను. అంటే ఆయన రావి కొండలరావుగారి గురించిన రాసిన వ్యాసం కింద – 'ఈయన రాసిన కథతో బాపురమణలు ''పెళ్లిపుస్తకం'' తీశారు… ''ప్రాప్తి'' అనే కథ కింద – 'ఇది రమణగారు ఆంధ్రపత్రిక లో పనిచేసే రోజుల్లో రాశారు. అప్పట్లో ఆయన…'' అని యిలా కాస్త కాస్త జీవితవిశేషాలు చెప్పుకుంటూ పోయాను. మొత్తమంతా చదివితే రమణగారి రచనల గురించి, జీవితం గురించి ఒక అవగాహన వచ్చేస్తుందన్నమాట. ఇంతా చేసినదాకా వుండి రమణగారు ఆఖరి నిమిషంలో 'ఇది మనం డబ్బా కొట్టుకున్నట్టుంటుందండి' అంటూ తీసేయమన్నారు. దాంతో నాకు కోపం వచ్చేసింది. ''అయితే సంకలనకర్తగా నా పేరు వేయకండి'' అని శ్రీరమణగారికి చెప్పేసి హైదరాబాదుకి బదిలీమీద వచ్చేశాను.
పుస్తకం చేతికి వచ్చేసరికి సర్‌ప్రైజ్. మొదటిపేజీల్లోనే ''ధన్యవాదాలు'' అంటూ నా గురించి ఫుల్ పేజీ! నేను మొదటిసారి రమణగారిని కలిసినపుడు ఆయన అడిగారు. ''ఎమ్ అంటే?'' అని. ''మొక్కపాటి..'' అన్నాను. ''..అందరూ అడిగే ప్రశ్నే అడుగుతున్నాను.'' అన్నారు. నేను చిన్నగా నవ్వి ''..ఆయన మాకు తాతగారి వరుస అవుతారు. మా నాన్నగారు ఆ కుటుంబానికి దత్తుడు'' అన్నాను. తర్వాత మా మధ్య ఆ ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. అది గుర్తు పెట్టుకుని రమణగారు ''ధన్యవాదాలు''లో ఓ తమాషా చేశారు.
'నేను మొక్కపాటి వారి వద్ద ప్రూఫ్ రీడర్‌గా పనిచేశాను. ఆయన నా రచనలు మెచ్చుకుని ఆశీర్వదించారు. అయినా నిన్న రాసింది యివాళ చదివితే మొన్నటి అప్పడాల్లా వుంటాయన్న భయం కొద్దీ నా రచనల కాపీలు ఎన్నడూ జాగర్త పెట్టుకోలేదు… మొక్కపాటి వారి మనమల వరసలో ఎమ్బీయస్ ప్రసాద్ ఆయనతో పాటు సోదరుడు శ్రీధర్ నా రచనలు సేకరించారు. అవి నావేనని నా చేతే ఒప్పించారు…వాటిలో కొన్నిటిని యీ పుస్తకంలో ఫిరాయిస్తున్నారు. వారి తాతగారి ఆశీర్వాదం అనుకున్నాను. నా కన్నా వయసులో చిన్న కాబట్టి ప్రసాద్ బ్రదర్స్‌కి నమస్కారాలూ పెట్టలేను, నమస్కరించాల్సినంత గొప్ప కృషి చేశారు కాబట్టి దీవించనూ లేను. అందువల్ల – రాజీగా – వారు గాని వారి కుమార్లు గాని, మనుమలు గాని గొప్ప పుస్తకాలు రాస్తే నేను ప్రూఫ్ రీడరుగా పనిచేసి అచ్చుతప్పులు దిద్దగలనని మనవి చేస్తూ… ముళ్లపూడి వెంకట రమణ' అని రాశారు.
ఇది చదివి నా కళ్లు ఎంత అశ్రుపూరితాలయి వుంటాయో మీరు వూహించుకోవచ్చు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)