కాంగ్రెసు తమకేదో మేలు చేసిందని అనుకుంటున్న తెలంగాణ ప్రజలే సందేహంలో పడినప్పుడు నెలల తరబడి ఉద్యమం చేసినా కదలక, మెదలక, పట్టించుకోకుండా వున్న కాంగ్రెసు తమకేదో మేలు చేస్తుందని సీమాంధ్ర ప్రజలు ఎందుకు, ఎలా అనుకుంటారు? వారిని నమ్మించడం అంత సులభమా? జరుగుతున్నదంతా వారికి వ్యతిరేకంగానే సాగుతోంది. మా నాయకులు మమ్మల్ని దగా చేశారని వాళ్లు కుములుతున్నారు. వారికి ఏకైక ఆశాదీపంగా కిరణ్ కనబడుతున్నారు. అది వైకాపాకు కిట్టడం లేదు. ఆయన దొంగ, నయవంచకుడు అని మనల్ని నమ్మమని చంపుకుతింటోంది. నిజానికి జగన్ ఎంత వీరసమైక్యవాది ఐనా విభజనను ఆపలేడు, ఆటంకపరచలేడు. కిరణ్ ముఖ్యమంత్రి హోదాలో వున్నాడు కాబట్టి ఆపగలడో లేదో కానీ ఆటంకాలు సృష్టించగలడు. ఢిల్లీని ఎదిరించిన వాళ్లెవరైనా తెలుగువాళ్లకు ఆప్తులే. విభజనవాదులు తిట్టినకొద్దీ కిరణ్‌కు సమైక్యవాదుల్లో పాప్యులారిటీ పెరుగుతోంది. నిజానికి యీ బలం కిరణ్‌ది కాదు, సమైక్యవాదానిది. ఢిల్లీవాళ్లు విభజన తప్పదని గట్టిగా చెప్పి పంపిన తర్వాత కిరణ్ కొన్నిరోజులు స్తబ్దంగా వున్నారు. కానీ సీమాంధ్రలో వచ్చిన తీవ్రమైన ప్రతిస్పందన ఆయనకు దారి చూపింది. సమైక్యమార్గాన్ని పట్టుకుంటేనే లాభసాటి అని తోచేట్లా చేసింది.
కిరణ్ అంతరంగంలో ఏముందో నిజానిజాలు మనకు తెలియవు కానీ ఆయన మనసులో విభజనవాది అని మనల్ని వైకాపా నమ్మించాలంటే విభజన జరిగితే కిరణ్‌కు ఏం లాభమో చెప్పాలి. రాష్ట్రం విడిపోవడం అంటూ సంభవిస్తే కిరణ్ ఎటూ కాకుండా పోతారు. విభజన తర్వాత ఆంధ్రరాష్ట్రానికి కాంగ్రెసు కాపునాయకుడికే ఛాన్సు యిస్తుంది అంటున్నారు. రెడ్లందరూ జగన్‌వైపు వెళతారు కాబట్టి, తెలంగాణలో కాంగ్రెసు తరఫున వున్న ప్రముఖ నాయకులందరూ రెడ్లు కాబట్టి, బహుశా జయపాల్‌రెడ్డిని తెలంగాణ సిఎం చేస్తారు కాబట్టి, కనీసం ఆంధ్రలో కాపులకు ఛాన్సు యియ్యవచ్చు. అప్పుడు కిరణ్ ఏమవుతారు? సిఎం పోస్టు చేశాక అంతకంటె కిందకు దిగి మామూలు మంత్రి కాలేరు. బెజవాడ గోపాలరెడ్డి ఒక్కరే అలా చేశారు. పోనీ రోశయ్యలా గవర్నరు పోస్టు యిచ్చేటంత అనుభవం, వయసు వుంది. కిరణ్‌కు అదీ లేదు. అందువలన సమైక్యరాష్ట్రం కొనసాగినంతకాలం కిరణ్‌కు సిఎం ఛాన్సుంది. అందువలననే ఆయన పూర్తిగా తెగిస్తున్నాడు. మంత్రిగా కూడా చేయనివాడు మూడేళ్లు ముఖ్యమంత్రిగా చేశాడు.
2014 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెసు వస్తుందన్న ఆశ యిసుమంత కూడా లేదు. కాంగ్రెసుకు బొటాబొటీగా వచ్చి ఏ వైకాపాతోనో పొత్తు కుదుర్చుకుంటే, జగన్ తను సిఎం కావాలని పట్టుబడతారు. కాంగ్రెసుకు వైకాపా కంటె ఎక్కువ సీట్లు వచ్చి వైకాపా మైనర్ పార్ట్‌నర్‌గా వుండి కాంగ్రెసువారే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వస్తే జగన్ 'కిరణ్ తప్ప వేరేవరైనా అయితేనే ఒప్పుకుంటాను' అంటారు. ఎందుకంటే కిరణ్ సిఎం కావడంతోనే జగన్ పార్టీ బయటకు వెళ్లిపోయారు. రోశయ్య వృద్ధుడు కాబట్టి, ఎప్పటికైనా ఆయనను తీసేసి తనను పిలుస్తారన్న ఆశ జగన్‌లో వుండింది, కిరణ్ వంటి పిన్నవయస్కుడు (రాజకీయాల స్టాండర్డ్‌లో) సిఎంగా రావడంతో ఆశలుడిగి జగన్ వెళ్లిపోయారు. అప్పణ్నుంచి సాక్షి పేపరు కిరణ్‌ను తిట్టని రోజు లేదు. ఈ విధంగా చూస్తే కిరణ్‌కు ధిక్కరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. పదవి దిగిపోతూ త్యాగమూర్తి పోజు కొడుతూ దిగిపోతే మజా వుంటుంది. గుడ్‌విల్ వుంటుంది. గతంలో పంజాబ్ విభజనను ముఖ్యమంత్రి అడ్డుకుంటే అతన్ని తీసేసి పని కానిచ్చారు. కానీ అతను పంజాబీలకు యిష్టుడిగా చరిత్రలో మిగిలిపోయాడు కదా. ఇప్పుడు కిరణ్ కూడా అంతే. శాయశక్తులా పోరాడాను, కానీ ఏమీ చేయలేకపోయాను, క్షమించమని ప్రజలను వేడుకుంటున్నాను అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు.
కాంగ్రెసు కిరణ్ సొంత పార్టీ ఏమీ కాదు. అనేకమంది నాయకుల్లో అతనూ ఒకడు. తనకంటూ పెద్దగా బలం లేనివాడు. సొంత పార్టీల్లో సర్వంసహా అధికారాలు అనుభవిస్తున్న చంద్రబాబు, జగన్ సమైక్యంపై డోలాయమానంగా వ్యవహరించినపుడు వారి కంటె యితను నిజాయితీగా వ్యవహరించినట్టే కదా అనుకుంటారు సమైక్యవాదులు. కిరణ్ రాజీనామా చేయకపోవడంలో, తక్కినవాళ్ల రాజీనామాలు నివారించడంలో, అసెంబ్లీని తనంతట తానే పిలిపించకపోవడంలో కుట్ర వుందని వైకాపా అంటుంది. ఢిల్లీ తన స్ట్రాటజీ మారుస్తూ పోతున్నకొద్దీ, యిక్కడ కూడా మారుతోంది. అసెంబ్లీలో బిల్లుపై చర్చించి, అందరి వాదనలూ, ఉపన్యాసాలు రికార్డు కావలసిన చారిత్రక అవసరం వుంది. ఈ వాదనలు వింటేనే పార్లమెంటు సభ్యులకు విషయం ఏమిటో తెలుస్తుంది. లేకపోతే ఆంధ్ర ఏమిటో, తెలంగాణ ఏమిటో, యీ గొడవలేమిటో వాళ్లకు ఏం అర్థం అవుతుంది? అంతిమంగా పార్లమెంటుకే సర్వాధికారాలు. ఇక్కడి వాదనలపై బేస్ చేసుకుని అక్కడి ఎంపీలు వాదిస్తారు. అసెంబ్లీకి బిల్లు రాకుండా రాజీనామా చేసేసి, సాంకేతిక కారణాలపై చర్చను ఆపడం సరైన పని కాదు. కిరణ్ తన భావాలను ప్రెస్‌మీట్‌లో కాదు, అసెంబ్లీ ఫ్లోరుపై వినిపించినపుడే చరిత్రలో రికార్డవుతాయి. ఆ పని చేశాక రాజీనామా చేస్తే చేయవచ్చు.
కిరణ్ ఇదంతా చేస్తున్నది – సొంతపార్టీ పెట్టడానికే అంటున్నారు. అయితే కావచ్చు. కానీ ఆ పార్టీ ఎంతవరకు విజయవంతం అవుతుందో అందరికీ సందేహమే. కిరణ్‌లో ప్రధానలోపం – అందర్నీ కలుపుకుని పోరు. తన మనసులో మాట ఎవరికీ చెప్పరు – అని అంటారు. అలాటివాడు పార్టీ పెట్టేసి, నడిపేయగలరా? ఫలితాల మాట ఎలా వున్నా ప్రయత్నాలు చేస్తూ వుండవచ్చు. ఆ దిశగానే తనను తాను సమైక్యఛాంపియన్‌గా కిరణ్ ప్రొజెక్టు చేసుకుంటున్నారు. సొంత ఛానెల్‌లో 'ధిక్కరించినవాడే ధీరుడు' అనే పేరుమీద ఎన్టీయార్‌తో తనను పోల్చుకుంటూ కథనాలు వేయించుకుంటున్నారు. పోనుపోను కథ ఎలా మారుతుందో తెలియదు. ఎన్నికల సమయానికి కిరణ్ పార్టీ రెడీ అయితే జగనంటే, బాబు అంటే యిష్టం లేని సమైక్యవాదులు ఓట్లు వేయనూ వేయవచ్చు. సొంతంగా అధికారంలోకి రాకపోయినా అతుకులబొంత ప్రభుత్వానికి కింగ్‌మేకర్ పాత్రా పోషించవచ్చు. అదంతా భవిష్యత్తు చెప్పాలి.
ముగింపుగా – సమైక్యవీరుడు అని యీ ముహూర్తాన ఎవరికైనా బిరుదు యివ్వాలంటే మాత్రం కిరణే దానికి అర్హుడు అని నా అభిప్రాయం. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2013)