ఎమ్బీయస్‌: 15. ఎన్టీయార్‌కు ముందే రెడ్డిపాలనకు బ్రేక్‌

1983 పూర్వమున్న రాజకీయపరిస్థితి గురించి నేను యిస్తున్న వివరాలు కొందరికి సోదిలా తోచవచ్చు. ''బందిపోటు'' సినిమాలో హీరో ప్రజాదరణ పొందాడు అంటే దానికి నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలి. కుంటి రాజు, కుటిలుడైన సేనాపతి, ప్రజాపీడన,…

1983 పూర్వమున్న రాజకీయపరిస్థితి గురించి నేను యిస్తున్న వివరాలు కొందరికి సోదిలా తోచవచ్చు. ''బందిపోటు'' సినిమాలో హీరో ప్రజాదరణ పొందాడు అంటే దానికి నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలి. కుంటి రాజు, కుటిలుడైన సేనాపతి, ప్రజాపీడన, దాన్ని ఎదిరిస్తూ సరైన, సమర్థుడైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న తిరుగుబాటుదారులు… వీళ్లందరి గురించి చెప్పకుండా హీరో అవతారపురుషుడిలా అవతరించాడు అని చెప్పడం అర్థరహితం. ప్రతి శక్తికి, ప్రతికూల శక్తి కూడా ఉంటుంది. రెండూ సమాంతరంగా నడుస్తూ పోటీ పడుతూంటాయి.

1983లో ఎన్టీయార్‌ అవతరించి కాంగ్రెసును భూస్థాపితం చేసేశాడు అని కవిత్వం చెప్పడం వీనులవిందుగానే ఉండవచ్చు. అలా అయితే ఆరేళ్లు తిరక్కుండా కాంగ్రెసు తన బలాన్ని 3.6 రెట్లు పెంచుకుని, టిడిపి బలాన్ని 37%కి ఎలా తగ్గించగలిగింది అనే ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది? అప్పటి పార్లమెంటు ఎన్నికలలో టిడిపి 42 స్థానాలకు గాను కేవలం 2 గెలిచింది. కాంగ్రెసుకు 39 వచ్చాయి. ఎన్టీయార్‌ స్వయంగా ఒక అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. కానీ ఐదేళ్లలోనే 1994లో బ్రహ్మాండంగా గెలిచారు. పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెసు 2004లో గెలిచి పదేళ్లు పాలించింది. అంటే కాంగ్రెసుకు, ప్రతిపక్షాలకు స్థిరమైన ఓటు బ్యాంకు కొంత వుందన్నమాట. ఏ స్థాయిలో ఉంది, అది పెరగడానికి, తరగడానికి కారణం ఏమిటి, ఆ సూత్రాన్ని పట్టుకోకుండా కేవలం గెలిచిన సీట్ల సంఖ్యతోనే భారీ తీర్మానాలు చేస్తే రాజకీయాలు అర్థం కావు.

ఇప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పటినప్పటి నుంచి కాంగ్రెసు పార్టీ స్థితిగతుల గురించి చెప్పబోతున్నాను. 1955లో ఆంధ్రలో ఎన్నికలు జరిగాయి కాబట్టి 1957లో తెలంగాణ ప్రాంతంలో 105 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసు 47% ఓట్లతో 68 సీట్లు గెలిచింది. కమ్యూనిస్టులు పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ పేర 26% ఓట్లతో 22 స్థానాల్లో గెలిచారు.

1956 నవంబరు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి 1960 జనవరి వరకు కొనసాగారు. సంజీవరెడ్డికి పెద్ద అనుచరగణం ఉండేది. రాజకీయ శత్రువులూ ఉండేవారు. అల్లూరి సత్యనారాయణ రాజు వంటి మిత్రులు శత్రువులుగా కూడా మారారు. తర్వాతి కాలంలో వైయస్‌ రాజశేఖర రెడ్డిలా అప్పుడు చెన్నారెడ్డి ఉండేవారు. ఎవరు ముఖ్యమంత్రి ఐనా వారితో పేచీ పెట్టుకునేవారు. ఆయన మేనమామ, మావగారు అయిన కెవి రంగారెడ్డి ఆంధ్ర-తెలంగాణ విలీనానికే ఓ పట్టాన ఒప్పుకోలేదు. 

ఈయనా ఆయన బాటలో కొంత నడిచాడు కానీ ఆంధ్రలో అనేకమంది అనుచరులను సంపాదించుకున్నాక, తెలంగాణ హక్కుల మాట ఎత్తేవాడు కాదు. కానీ రాజకీయంగా అవసరమైనప్పుడల్లా తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ హోరెత్తించేవాడు.

1969లో ప్రత్యే తెలంగాణ ఉద్యమం నడిపినా, తను ముఖ్యమంత్రి అయ్యాక, 'అదంతా గతచరిత్ర' అనేశాడు. తననెవరైనా ప్రత్యేకవాది అంటే కోపగించుకునేవాడు. సంజీవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డిలను ఎంత ఎదిరించినా 1978 వరకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. వాళ్లు ఎప్పటికప్పుడు యీయన కంటె పైయెత్తులు వేయగలిగారు. సంజీవరెడ్డి దాష్టీకం భరించలేక 1959లో చెన్నారెడ్డి, శ్రీకాకుళం నాయకుడు గౌతు లచ్చన్న, విజయనగరం నాయకుడు పివిజి రాజు, యితరులు కలిసి సోషలిస్టు డెమోక్రాటిక్‌ పార్టీ అని పెట్టారు కానీ సంజీవరెడ్డి పివిజి రాజును దాన్లోంచి విడిగా లాక్కుని రాగలిగాడు. చెన్నారెడ్డి, లచ్చన్న స్వతంత్ర పార్టీలో చేరవలసి వచ్చింది. కొన్నాళ్లకు చెన్నారెడ్డి కాంగ్రెసులో మళ్లీ చేరి, మళ్లీ బయటకు వెళ్లిపోయి, మళ్లీ చేరి…. చనిపోయేవరకూ యిది సాగింది.

సంజీవరెడ్డి అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవడానికి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. ఆంధ్ర-తెలంగాణ కాంగ్రెసు నాయకుల మధ్య కుదిరిన పెద్దమనుషుల ఒప్పందాన్ని (గుర్తించవలసిన అంశమేమిటంటే యిది రెండు రాష్ట్రాల మధ్య జరిగినది కాదు, కాంగ్రెసు పార్టీలో ఒక అంతర్గత ఒప్పందం, యితర పార్టీలతో ప్రమేయం లేదు, అందుకే ఉల్లంఘించినా అడిగేందుకు ఆస్కారం లేకుండా పోయింది) పట్టించుకోలేదు. ఉపముఖ్యమంత్రి పదవి కెవి రంగారెడ్డికి యివ్వలేదు. 'అది ఆరో వేలులాటిది. గతంలో నేనూ ఆ పదవిలో చేశానుగా, ఏ అధికారమూ ఉండదు' అనేశారు. ఈయన ధాష్టికం భరించలేక దిల్లీలో మొత్తుకోగా 1960లో కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడిగా దిల్లీ రమ్మన్నారు. వస్తాను కానీ, యిక్కడ నా అనుయాయుడు, ప్రస్తుత ఫైనాన్సు మంత్రి బ్రహ్మానంద రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అన్నాడీయన. అదేం కుదరదు నేను అవుతా అంటూ అల్లూరి ముందుకు వచ్చాడు. చివరకు దామోదరం సంజీవయ్య అనే సౌమ్యుణ్ని రాజీ అభ్యర్థిగా ముఖ్యమంత్రిని చేశారు. 

సంజీవయ్య హరిజనుడు. విద్యాధికుడు, సాహిత్యాభిమాని. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ కాలం నుంచి మంత్రిగా పని చేశాడు. ఆయన 1960 జనవరిలో ముఖ్యమంత్రి అయి కెవి రంగారెడ్డిని ఉపముఖ్యమంత్రిని చేశాడు, బ్రహ్మానందరెడ్డిని ఫైనాన్సు శాఖలో కొనసాగించాడు. అల్లూరిని కాబినెట్‌లో చేర్చుకున్నారు. గతంలో సంజీవరెడ్డిని వ్యతిరేకించిన ఎసి సుబ్బారెడ్డి యీయన్నీ వ్యతిరేకించాడు. దిల్లీ నుంచి సంజీవరెడ్డి యిక్కడ బ్రహ్మానందరెడ్డి సాయంతో గ్రూపు రాజకీయాలు నడిపాడు. సంజీవయ్య వీటిని హ్యేండిల్‌ చేయలేకపోయారు. పైగా ఒక వివాదాస్పదమైన జిఓ తెచ్చి చిక్కుల్లో పడ్డారు. షెడ్యూల్‌ కులాలకు, తెగలకు రిజర్వ్‌ చేసిన ప్రభుత్వోద్యోగాల్లో ఒక్కోప్పుడు సరైన అభ్యర్థులు లేకపోతే వాటిని యితరులతో నింపి వ్యవహారం నడిపించేవారు. ఎక్కువమంది అభ్యర్థులు లభించినప్పుడు బ్యాక్‌లాగ్‌తో సహా ఆ కోటాను భర్తీ చేసేవారు. అలా చేయకూడదని, సరైన అభ్యర్థి దొరికేవరకూ ఆ ఖాళీని అలాగే ఉంచాలనీ సంజీవయ్య జీఓ పాస్‌ చేశారు. అలా అయితే పరిపాలన కుంటుపడుతుందని అగ్రవర్ణాల వారు గొడవపెట్టారు. దీనితో పాటు కొందరికి మేలు చేయాలని, యీయన సర్కారు జిల్లాలలోని సెట్టిబలిజలను, తెలంగాణలోని కాపులను బిసి జాబితాలో చేర్చారు. అది చెల్లదని హైకోర్టు కొట్టిపారేసింది. వాళ్లు ఆందోళన బాట పట్టారు.

ఇలా ఉండగానే 1962 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 300 స్థానాలుంటే కాంగ్రెసుకు 47% ఓట్లు, 177 (59%) సీట్లు వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీకి 20% ఓట్లు, 51 సీట్లు వచ్చాయి. స్వతంత్ర పార్టీకి 10% ఓట్లు, 22 సీట్లు వచ్చాయి. ఇక 51 మంది స్వతంత్రులు నెగ్గారు. ఈ స్వతంత్రుల్లో చాలామంది కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన అసంతృప్తులే. సంజీవయ్యకు రాజకీయాలు చేతకావని తోచి ఆయన్ను దిల్లీకి పార్టీ అధ్యక్షుడిగా రప్పించుకుని, దిల్లీ నుంచి సంజీవరెడ్డిని మళ్లీ రాష్ట్రానికి పంపారు. అలా 1962 మార్చి నుంచి మళ్లీ సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి పాలనలో ఆయన పాఠ్యపుస్తకాల ముద్రణను, ఆంధ్రప్రాంతంలో బస్సులను జాతీయం చేశారు. సిద్ధాంతపరంగా దాన్ని తప్పు పట్టలేం కానీ కర్నూలు జిల్లాకి చెందిన పిడతల రంగారెడ్డిపై కక్షతోనే అక్కణ్నుంచి మొదలుపెట్టారనే భావంతో సుప్రీం కోర్టు సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. 

దాంతో ఆయన నైతిక కారణాలపై అంటూ తన పదవికి రాజీనామా చేశాడు. తన స్థానంలో అనుంగు సహచరుడు (తర్వాతి రోజుల్లో యిద్దరూ ప్రత్యర్థులయ్యారు) బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి చేసి, దిల్లీకి వెళ్లిపోయారు. అలా 1964 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఐన బ్రహ్మానందరెడ్డి 1971 సెప్టెంబరు వరకు పాలించారు. ఆయన మెత్తగా కనబడుతూనే రాజకీయంగా చాలా చాకచక్యంగా వ్యవహరించేవాడు. ప్రత్యర్థులకు ఎక్కడి కక్కడ చెక్‌ పెట్టేవాడు. ఆయన అధికారంలో ఉండగానే 1967 ఎన్నికలు వచ్చాయి. 

ఆ పాటికి నెహ్రూ మరణించారు, ఉత్తరభారతంలో కాంగ్రెసు ప్రాభవం క్షీణించి, అనేక ప్రతిపక్షాలు పుంజుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 287 సీట్లలో 165 (57%) సీట్లు, 45% ఓట్లు నిల్పుకోగలిగింది. కమ్యూనిస్టులు విడిపోయారు కాబట్టి 8% ఓట్లతో సిపిఐ 11, 8% ఓట్లతో సిపిఎం 9, 10% ఓట్లతో స్వతంత్ర పార్టీ 29 గెలుచుకుంది. స్వతంత్రులు 68 మంది గెలిచారు. వీళ్లలో చాలామంది కాంగ్రెసు అసంతృప్తులే కాబట్టి నెగ్గాక, 25 మంది జనకాంగ్రెస్‌ పేర సమీకృతమయ్యారు. ప్రజలు దాని పేరు గుర్తు పెట్టుకునే లోగానే అది కాంగ్రెసులో విలీనమైంది. తక్కిన స్వతంత్రులలో కూడా చాలామంది పదవుల కోసం అధికార పార్టీలో చేరిపోయేవారు. వీటివలన బ్రహ్మానంద రెడ్డి మరింత బలపడ్డారు.

ఇది సహించలేక కెవి రంగారెడ్డి, తెలంగాణ ప్రాంతపు కాంగ్రెసు నాయకులు తెలంగాణ కాంగ్రెసు అని 1969 జూన్‌లో ఏర్పాటు చేశారు. బ్రహ్మనంద రెడ్డిని తొలగించి, గవర్నరు పాలన పెట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానాన్ని డిమాండు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజా సమితి ప్రత్యేక తెలంగాణకై ఉద్యమించింది. ఉద్యమం నడిచే రోజుల్లో తెలంగాణకు చెందిన బ్రహ్మానందరెడ్డి వ్యతిరేక కాంగ్రెసు నాయకులు తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ పేర 30 మంది ప్రతిపక్షంగా వ్యవహరించారు కానీ ఇందిరా గాంధీ రాష్ట్రవిభజనను వ్యతిరేకించడంతో బ్రహ్మానంద రెడ్డిని ఏమీ చేయలేకపోయారు.

1964 నుంచి 67 వరకు కేంద్రమంత్రిగా, 67 నుంచి 69 వరకు లోకసభ స్పీకరుగా పని చేసిన సంజీవరెడ్డి, సిండికేట్‌ మద్దతుతో రాష్ట్రపతి పదవికి పోటీ పడ్డారు. ఇందిరా గాంధీ వివి గిరికి మద్దతిచ్చారు. సంజీవరెడ్డి ఓటమిపాలై రాజకీయ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. 8 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి జనతాపార్టీలో చేరి, భారత రాష్ట్రపతి అయ్యారు. అందువలన 1967 నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఆయన ప్రభావం తగ్గిపోతూ వచ్చింది.   

ఇంతలో ఎన్నికల అక్రమాల కారణంగా ఆరేళ్లపాటు ఎన్నికలలో పాల్గొనకూడదని బహిష్కారానికి గురైన చెన్నారెడ్డి తన ఎన్నికల పిటిషన్‌ వెనుక బ్రహ్మానంద రెడ్డి ఉన్నారనే కోపంతో ఉద్యమంలో దిగి ఉధృతం చేశారు. 1971లో జరిగిన మధ్యంతర పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలోని 14 లోకసభ స్థానాలలో 10 గెలిచింది. దేశమంతా ఇందిరా గాంధీ ప్రభంజనం వీచి, కాంగ్రెసు గెలిచినా, యిక్కడ మాత్రం యిలా జరగడంతో ఆమె చెన్నారెడ్డితో బేరాలాడి ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయించింది. 1974 లో చెన్నారెడ్డి యుపి గవర్నరుగా వెళ్లారు. 

ఆ ఒప్పందంలో భాగంగానే బ్రహ్మానంద రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, దిల్లీ రప్పించి, ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా వేశారు. 287 మంది ఎమ్మెల్యేలలో 220 (ఎన్నికలలో నెగ్గిన కాంగ్రెసు ఎమ్మేల్యేలు 165 మంది ఐతే యిప్పుడు 220 మంది ఉన్నారు, గమనించండి) మంది మద్దతు ఉన్నా బ్రహ్మానంద రెడ్డి పదవి వదులుకోవలసి వచ్చింది. ఆ విధంగా పివి నరసింహారావు 1971 సెప్టెంబరు నుంచి 1973 జనవరి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో 1972 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పివికి సొంతంగా బలమేమీ లేదు. బ్రహ్మానంద రెడ్డి వర్గం గానీ, చెన్నారెడ్డి వర్గం కానీ ఆయనకు సుముఖం కాదు. అంతా అధిష్టానం, సరిగ్గా చెప్పాలంటే ఇందిరా గాంధీ యిష్టప్రకారం నడిచింది. 

ఇక్కడ నుంచి కాంగ్రెసు జాతీయ రాజకీయాల్లో మార్పు కూడా గమనించవచ్చు. నెహ్రూ హయాంలో ఏకచ్ఛత్రాధిపత్యం లేదు. ఆయన తనను తాను 'ఫస్ట్‌ ఎమాంగ్‌ ఈక్వల్స్‌' (సరిసమానుల్లో ప్రథముణ్ని) అని చెప్పుకునేవాడు. దానికి తగ్గట్టే ఆయనతో పాటు తక్కిన నాయకులు కూడా బలంగా ఉండేవారు. అనేక విషయాల్లో విభేదించారు. చర్చలు జరిపేవారు. నెహ్రూ మాట అనేక విషయాల్లో చెల్లేది కాదు. ముఖ్యంగా 1951లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఉన్న పురుషోత్తమ్‌దాస్‌ టాండన్‌తో నెహ్రూకి జగడం వచ్చినపుడు తన గురువైన కళా వెంకటరావు గారు టాండన్‌ను సమర్థించగా, శిష్యుడు సంజీవరెడ్డి నెహ్రూని సమర్థించారు. 

అందువలన నెహ్రూ సంజీవరెడ్డిని సమర్థిస్తూ వచ్చారు. నెహ్రూ, శాస్త్రి హయాంలలో అన్ని రాష్ట్రాలలో బలమైన నాయకులుండేవారు. వారిలో కొందరు దిల్లీకి వెళ్లి, రాష్ట్రంలో తాము కమాండ్‌ చేసే బలంతో జాతీయ స్థాయిలో బలాబలాలను నిర్ధారించేవారు. ఇందిర తొలినాళ్లలో ఆమెను నియంత్రించబోయిన మొరార్జీ-కామరాజ్‌ వర్గంతో (సిండికేట్‌ అని పిలిచేవారు) సంజీవరెడ్డి చేతులు కలిపితే, అప్పటికే ఆయనకు విరోధిగా మారిన బ్రహ్మానంద రెడ్డి ఇందిరను సమర్థించేవారు.

1971 పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇందిరకు దేశమంతా వ్యక్తిగతమైన ఖ్యాతి రావడంతో ఆమె యీ రాష్ట్రనాయకులందరినీ బలహీన పర్చాలని సంకల్పించింది. ప్రతి రాష్ట్రంలో బలంగా వున్న వర్గాలను కాకుండా వేరే వారికి పదవులు కట్టబెట్టి, వారు తనకు మాత్రమే విధేయులుగా ఉండేట్లు చూసుకుంది. అందువలననే 1971 తర్వాత కాంగ్రెసులో ఇందిర కుటుంబసభ్యులు తప్ప వేరెవరికీ జాతీయ స్థాయిలో గుర్తింపు లేకుండా పోయింది. ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా బలపడుతున్నారని తోచగానే, వెంటనే అసమ్మతి వర్గాన్ని ఎగదోసేది. ఆ విధంగా అధికారంలో ఉన్నవారు, అసమ్మతీయులు యిద్దరూ అధిష్టానం చేతిలో ఉండేవారు. 

రాష్ట్రనాయకుడికి కంటికి కునుకు ఉండేది కాదు, ఏ క్షణంలో గద్దె దిగమంటారో తెలియదు. వాళ్ల మీద నిరంతరం పితూరీలు వెళుతూ ఉండేవి. దేశం మొత్తం మీద తను తప్ప వేరెవ్వరూ బలంగా ఉండకుండా ఇందిరా గాంధీ తీసుకున్న చర్యల ఫలితంగా మనకు దేశంలో చెప్పుకోదగ్గ నాయకుడంటూ ఎవరూ లేకుండా పోయారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాలు తమలో తాము కలహించుకుంటూ, ప్రజలు మళ్లీమళ్లీ కాంగ్రెసునే శరణు వేడేటట్లు చేశాయి. 

1971 తర్వాత ఇందిర అనేక రాష్ట్రాలలో కులసమీకరణాలను తారుమారు చేయడానికి ముఖ్యమంత్రులను మార్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు 1956 నుంచి పాలిస్తున్నారు కాబట్టి తీసేసి బ్రాహ్మణుణ్ని పెట్టింది. యుపిలో కమలాపతి త్రిపాఠీ, బిహార్‌లో జగన్నాథ్‌ మిశ్రా, ఒడిశాలో నందిని శతపథి, బిహార్‌లో కేదార్‌ పాండే అనే బ్రాహ్మణులను ముఖ్యమంత్రులను చేసింది. ఇదంతా బ్రాహ్మణాభిమానం అనుకోనక్కరలేదు. అక్కడ రాజకీయంగా చురుగ్గా ఉన్న కులాలను తప్పించడమే లక్ష్యం. కర్ణాటకలో లింగాయతులు పాలిస్తూ వచ్చారు కాబట్టి దేవరాజ్‌ అరసు అనే బిసిని ముఖ్యమంత్రిగా చేసింది. 

రాజస్థాన్‌లో ఠాకూర్లది ప్రాబల్యం కాబట్టి బర్కతుల్లా ఖాన్‌ అనే ముస్లిమును చేసింది. బిహార్‌లో కేదార్‌ పాండేని తప్పించినపుడు అబ్దుల్‌ గఫూర్‌ అనే ముస్లిమును ముఖ్యమంత్రిగా చేసింది. మహారాష్ట్రలో మరాఠాలది ప్రాబల్యం కాబట్టి వసంత్‌ నాయక్‌ అనే బంజారా కులస్తుణ్ని కొనసాగించింది. పంజాబ్‌లో అకాలీ దళ్‌ను ఎదుర్కోవాలి కాబట్టి ఒక సిఖ్కునే ఎంచుకోవాలి. దానికై జైల్‌ సింగ్‌ అనే అనామకుణ్ని ముఖ్యమంత్రి చేసింది. తర్వాతి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కులం పోషించిన పాత్ర చర్చకు వస్తుంది కాబట్టి యిక్కడ కులప్రస్తావన చేస్తున్నాను.

(ఫోటో – ఇందిరా గాంధీ రాష్ట్రానికి వచ్చినపుడు రిసీవ్‌ చేసుకుంటున్న ముఖ్యమంత్రి పివి, గవర్నరు ఖండూభాయ్‌ దేశాయ్‌)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2019)
[email protected]

 

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 05  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 06

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 07 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 08   ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 09

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 10  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 11  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 12

ఎమ్బీయస్‌:  ఎన్టీయార్‌ – 13  ఎమ్బీయస్‌:  ఎన్టీయార్‌- 14