ఆపరేషన్ జరిగి నెల్లాళ్లయింది. బైపాస్ సర్జరీ అంటేనే పెద్ద ఆపరేషన్. దానికి తోడు వాల్వ్ రిప్లేస్‌మెంట్ కూడా జరగడంతో మరింత పెద్దదైంది. మీ అందరి శుభాకాంక్షలతో క్రమేపీ కోలుకుంటున్నాను. విషెస్ చెప్పినవారికి, మనసులోనే నా మేలు కోరుకున్నవారికి, అందరికీ ధన్యవాదాలు. నేను సాధారణ పరిస్థితికి రావడానికి 3, 4 నెలలు పడుతుందట. కొద్దికొద్దిగా పనిలో పడితే మొనాటనీ బ్రేక్ అవుతుంది కదాని రాయడం మొదలుపెట్టాను. ఇదే మొదటిది.
వచ్చేవారం యీ పాటికి ఫలితాలు వచ్చి పడుతూంటాయి. అనేకమంది జాతకాలు బయటపడతాయి. ఇక అప్పణ్నుంచి వివరణలు, సవరణలు, పొత్తులు, ఫిరాయింపులు.. ఆ ప్రహసనం నడుస్తుంది. అదేమిటో కానీ ౖప్రస్తుత పాలకులలో ధైర్యం గోచరించటం లేదు.
2014 ఎన్నికల ప్రచారం నాటి మోదీకి, 2019 ప్రచారం నాటి మోదీకి తేడా స్పష్టంగా కొట్టవచ్చినట్లు కనబడుతోంది. బాబులో ముందున్న ధీమా క్రమేపీ కరిగిపోతోంది. వీళ్లిద్దరికీ అధికారం చేజారే ప్రమాదం ఉంది కాబట్టి ఆ భయం అనుకోవచ్చు. అలాటి భయమే ఒడిశాలోని నవీన్ పట్నాయక్‌కు ఉండాలి. కానీ అతనలాటి ఆందోళన ఏమీ కనబర్చటం లేదు. హాయిగా తన పని తను చేసుకుని పోతున్నాడు. అతన్ని ఎలాగైనా యీసారి గద్దె దింపుతామని గర్జించిన బిజెపి నవీన్ సన్నిహితుడైన జయ్ పండాను తనవైపు లాక్కున్నా, ఆశించిన ఫలితం దక్కినట్లు లేదు. ఎన్నికల తర్వాత నవీన్ మద్దతు కోసం ఎదురుచూస్తోంది. దానికే కాబోలు, తుపాను పునరావాస కార్యక్రమాలకు బాగా సాయపడుతోంది.
అసలు ఏ మాత్రం టెన్షన్ పడనక్కరలేని స్థితి కెసియార్‌ది. బిజెపితో ఏ ఏర్పాటు చేసుకున్నారో ఏమో, ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపించేసుకుని తన ముఖ్యమంత్రి పదవి సుస్థిరం చేసుకున్నాడు. కానీ ఆయనకూ ఆందోళనే! కౖేందంలో చౖక్రం తిప్పుతానో లేదో అని. ఫెడరల్ ఫ్రంట్ బూరా వినడానికి ఎవరూ రెడీగా లేరు. ముందు ఫలితాలు రానీ, తర్వాత చూద్దాం అంటున్నారు. మొన్న స్టాలిన్ దగ్గరైతే మరీ ఫార్సయిపోయింది. తెలంగాణ పత్రికలన్నీ ఆ భేటీకి విపరీతంగా ప్రాధాన్యత యిచ్చాయి. తీరా చూస్తే స్టాలిన్ 'గుళ్లు చూడడానికి వచ్చి పనిలో పనిగా యిటు వచ్చారు' అనేశాడు. 'ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు' అని సామెతుంది. అది నిజం చేసి వచ్చేశారు కెసియార్. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడే ధైర్యం కూడా లేకుండా యింటికి వచ్చిపడ్డారు కెసియార్. ఫలితాల తర్వాత కదా, రాజెవరో, రంగడెవరో తేలేది, యిప్పణ్నుంచే గుణకారాలు, భాగహారాలు వేయడం దేనికి?
ఆ ముక్క కెసియార్‌కు ఎందుకు తోచటం లేదో తెలియదు. వస్తేగిస్తే 15 ఎంపీ సీట్లతో కేంద్రంలో ఏ చక్రం తిప్పేస్తారు? 'గతంలో 2 సీట్లు ఉన్నపుడే రాష్ట్రం తెచ్చుకున్నాం, ఇప్పుడు దానికి 7 రెట్లు సాధించవచ్చు' అని చెప్పుకున్నారు కెటియార్. తెలంగాణ వచ్చిందంటే తెరాసకున్న 2 సీట్ల వలన కాదు. కాంగ్రెసు, బిజెపి వేసుకున్న దిక్కుమాలిన లెక్కల వలన! ఇంతకంటె పెద్ద రాష్ట్రాలు యింకా ఉన్నా, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని చీల్చారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీల పరం చేసి, వాళ్ల మద్దతు కోసం దేబిరించే పరిస్థితిలో పడ్డారు.
కెసియార్ కేంద్రమంత్రిగా సజావుగా పని చేసి ఉంటే, యుపిఏ భాగస్వామ్య పక్షాలతో స్నేహం నెరపి వుంటే ఆ పరిచయాలు పనికి వచ్చేవి. ఈయన దిల్లీలో ఉన్నన్నాళ్లూ లాబీయింగు, లాబీయింగు అంటూ తెలంగాణ కాంగ్రెసు నాయకుల యిళ్ల చుట్టూనే తిరిగాడు. ఇప్పుడు బిజెపి, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అంటే ఆ బుడగను ఎవరు నమ్ముకుంటారు?
అసలు ఎన్‌డిఏ, యుపిఏ కాక వేరే ఫ్రంట్ ఏర్పడడం సాధ్యమా? ఫిరాయింపుల్లో ఆరితేరి, కాంగ్రెసుకే పంగనామాలు పెట్టగలిగిన స్థితికి చేరిన బిజెపి ఆ ఫ్రంట్‌ను ఏర్పడనిస్తుందా? అన్ని కేంద్ర సంస్థలను గుప్పిట్లో పెట్టుకుంది. ఎడాపెడా వాడడం నిత్యకృత్యమైంది. సామభేదదానదండోపాయాల్లో దేన్ని వాడడానికైనా వెఱపు లేదు.
కాంగ్రెసు వాళ్లు ఆశిస్తున్నట్లు దానికి ఏ 150 సీట్లో వచ్చేసి, అది కేంద్రబిందువుగా ఏర్పడితే ఏమో కానీ బిజెపికి 200 దరిదాపుల్లో వస్తే మాత్రం అది చిన్న పార్టీలను వశపరచుకోవడం ఖాయం. అలా వశపరుచుకునే ప్రయత్నంలో భాగంగానే కెసియార్‌ను ప్రయోగిస్తోందా అని కొందరి సందేహం. ఎందుకంటే విలేకరులు 'గత అనుభవాల దృష్ట్యా బిజెపి, కాంగ్రెసేతర కూటమి ఏర్పడడం, ఏర్పడినా మనగలగడం సాధ్యమా?' అని అడిగితే కెసియార్ చైనా గురించి మాట్లాడుతున్నారు. అక్కడి గణాంకాలు వల్లె వేసి, చైనా చేయగాలేనిది, మనం చేయలేమా? మనం కొత్తగా ఆలోచించాలి అంటూ లెక్చర్లిస్తున్నారు.
ఈ మేధావికి చైనా రాజకీయ వ్యవస్థకు, మన వ్యవస్థకు తేడా తెలియదా? ఆయన ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులను చైనాలో అనుమతిస్తారా? ఓ పక్క నీతిమాలిన పనులు, మరో పక్క జాతి పునర్నిర్మాణం గురించి సిద్ధాంతపరమైన చర్చ. ఎలా పొసుగుతాయి? చైనా గురించి చర్చ వదిలిపెట్టి యిప్పుడు ఆయన సమాధానం చెప్పవలసిన ప్రశ్న ఏమిటి? కాంగ్రెసు, బిజెపి కూటములకు ప్రత్యామ్నాయంగా ఆయన దగ్గరున్న ఉపాయం ఏమిటి?
ప్రాంతీయపార్టీలు 150 దాకా గెలుస్తాయి కాబట్టి అవి కూటమిగా ఏర్పడి, తమ తమ రాష్ట్రాలకు మేలు చేకూర్చే ప్రభుత్వానికి మద్దతివ్వాలి, లేదా కాంగ్రెసు, బిజెపిల మద్దతుతో ప్రభుత్వం ఏర్పరచాలి. అంతే కదా! గతంలో అయితే బిజెపికి రమారమి 200, కాంగ్రెసుకు రమారమి 100 వస్తాయనుకున్నారు. ఇప్పుడు అంచనాలు అటూయిటూ అయినా మొత్తం మీద వారిద్దరికి కలిపి 300, వారి భాగస్వామ్య పక్షాలకు మరో 70,80 వస్తాయి కదా. ఇక విడిగా ఉన్న పార్టీలెన్ని ? వాటికి వచ్చే సీట్లెన్ని?
పాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడినా వాటన్నిటి ప్రయోజనం ఒకటే ఉంటుందా? ఆంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీలున్నాయి. అవి కలిసి కూర్చోగలవా? తమిళనాట రెండున్నాయి. అవి కలుస్తాయా? కెసియార్ బాబుతో కలిసి కూర్చుంటారా? పోలవరం విషయం వచ్చేసరికి ఒడిశా ప్రాంతీయ పార్టీ ఆంధ్ర ప్రాంతీయ పార్టీతో ఘర్షించదా? ప్రత్యేక హోదా విషయం వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతీయ పార్టీతో తమిళ, కన్నడ ప్రాంతీయ పార్టీలు కలహించవా? ఇలా ఆలోచిస్తే పోతే వీళ్లు కలవడమనేది కలగానే మిగులుతుంది. గతంలో కంటె కేంద్రం అనేక అధికారాలు చేజిక్కించుకుంది. అందువలన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీతో సఖ్యంగా ఉండడానికే ప్రాంతీయ పార్టీలు వెంపర్లాడతాయి. కూటమి కట్టినా త్వరలోనే విడిపోతాయి.
ఈ వివేకం కెసియార్‌కు కలిగిన నాడు ఆయన పార్లమెంటు ఎన్నికల ఫలితాల గురించి చింతించడం మానేస్తాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2019)
[email protected]