బెయిల్‌పై చంద్రబాబు బయటికొచ్చి సరిపోయింది, లేకపోతే ఆయన్ను అభిమానించే మరికొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేక, ఆయన్ను అభిమానించే కొంత మంది ప్రాణాలు కోల్పోయినట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఎల్లో పత్రికల్లో ప్రచురించారు. బాబు కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు అండగా వుంటామని టీడీపీ ప్రకటించింది.
ఇందులో భాగంగా నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి జనంలోకి వెళ్లారు. బాబు కోసం అసువులుబాసిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున సాయాన్ని అందజేశారు. అయితే చంద్రబాబుకు మధ్యంత బెయిల్ మంజూరు కావడంతో భువనేశ్వరి బస్సుయాత్ర ఆగిపోయింది. మరోవైపు చంద్రబాబు ఇక జైలుకు వెళ్లరని, మధ్యంతర బెయిల్‌ను పొడిగించుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఇలాగైతే చంద్రబాబు కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సాయం ఇక అందదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. భువనేశ్వరి మహా అయితే పది కుటుంబాలకు సాయం అందించి వుంటారు. టీడీపీ లెక్కల ప్రకారం రోజుకు ఐదారుగురు చొప్పున చంద్రబాబు కోసం 200 నుంచి 300 మంది వరకు ప్రాణాలు వదిలారు. మరి వీళ్లందరికి సాయం అందించే పరిస్థితి లేదా? అనారోగ్యంతో చనిపోయినా బాబు అరెస్ట్ ఖాతాలోకి వేశారనే ఆరోపణ లేకపోలేదు.
కానీ ఆ ఆరోపణల్ని టీడీపీ కొట్టి పడేసింది. వాళ్లంతా చంద్రబాబు కోసం చనిపోయారని చెబుతూ వచ్చింది. ఇలా ప్రచారం చేసి సానుభూతి పొందాలని అనుకున్నారు. మరణాలను బాబు ఖాతాలో వేసుకున్నారు సరే, తమకు సాయం ఏది? అని ప్రశ్నించే బాధిత కుటుంబాలకు సమాధానం ఏంటి? ఇదేనా బాధిత కుటుంబాలకు అండగా నిలబడడం అంటే? అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. టీడీపీ హామీలు కూడా ఇట్లే వుంటాయని దెప్పి పొడుస్తున్నారు.