పెళ్లయిన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు చాలామంది హీరోయిన్లు. తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అదే నమ్మకంతో ఉంది. తన అసలైన కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెబుతోంది.
“కెరీర్ ఏమీ ఆగలేదు. ఇంకా చెప్పాలంటే నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నా భర్త సపోర్ట్ తో మరిన్ని సినిమాలు చేయబోతున్నాను. త్వరలోనే చాలా సినిమాలు ప్రకటించబోతున్నాను.”
ఇలా తన కెరీర్ పై విస్పష్టంగా ప్రకటన చేసింది వరలక్ష్మి. తన భర్త నికొలాయ్ సచ్ దేవ్ తో కలిసి హైదరాబాద్ వచ్చిన ఈ నటి, మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైంది. తనకు మద్దతుగా నిలిచిన మీడియాకు థ్యాంక్స్ చెబుతూ, చిన్న పార్టీ ఇచ్చింది.
ఇదే వేదికపై వరలక్ష్మి భర్త నికొలాయ్ కూడా మాట్లాడాడు. కెరీర్ పరంగా తన భార్యకు పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన, ఇప్పటివరకు వరలక్ష్మి నటనలో కొంతభాగం మాత్రమే చూశారని, ఇకపై ఆమె నటనలో బెస్ట్ పార్ట్ చూస్తారని చెబుతున్నాడు.
థాయ్ లాండ్ లోని ఓ బీచ్ రిసార్ట్ లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంతకంటే ముందే చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్ ఇచ్చారు. త్వరలోనే ఆమె తన సినిమా సెట్స్ లో జాయిన్ అవుతుంది. ఆమె నటించిన మ్యాక్స్, రాయన్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.