ఈ విషయంలో ఇస్మార్ట్ గా ఎందుకు ఆలోచించలేదు!

సినిమాకు డబుల్ ఇస్మార్ట్ అని పేరుపెట్టారు. హీరో డబుల్ దిమాక్ తో ఉంటాడు, డబుల్ స్పీడ్ తో ఆలోచిస్తాడు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం మేకర్స్ అంత స్మార్ట్ గా ఆలోచించలేదేమో అనిపిస్తోంది.…

సినిమాకు డబుల్ ఇస్మార్ట్ అని పేరుపెట్టారు. హీరో డబుల్ దిమాక్ తో ఉంటాడు, డబుల్ స్పీడ్ తో ఆలోచిస్తాడు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం మేకర్స్ అంత స్మార్ట్ గా ఆలోచించలేదేమో అనిపిస్తోంది. దీనికి కారణం తాజాగా విడుదల చేసిన సాంగ్.

“మార్ ముంత..ఛోడ్ చింత” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో కేసీఆర్ డైలాగ్ ను యథాతథంగా వాడారు. ఓ మంచి పాటలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఏం కాదు. కానీ పార్టీ సాంగ్ పేరిట కల్లు కుండల మధ్య చిందేస్తూ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి డైలాగ్ ను యాజ్ ఇటీజ్ గా వాడడం అభ్యంతరకరం అంటున్నారు చాలామంది.

దీనిపై ఇప్పుడిప్పుడే సెగ మొదలైంది. ఓ సెక్షన్ మీడియా ఆల్రెడీ దుమ్మెత్తిపోయడం ప్రారంభించింది. తాజాగా ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లింది. కేసీఆర్ డైలాగ్ ను ఓ ‘ఐటెంసాంగ్’ లో పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని, తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ప్రస్తుతానికి ఈ వివాదం ప్రారంభ దశలోనే ఉంది. మేకర్స్ వెంటనే మేల్కొని ఏదో ఒకటి చేస్తే బెటర్. ఎందుకంటే, రాజకీయంగా తమకు మైలేజీ ఇచ్చే గట్టి ఇష్యూ కోసం బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ పాట వాళ్లకు రాజకీయ అస్త్రంగా మారకూడదు.