హాలీవుడ్ సినిమాల్ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు జాంబీ సినిమాలు, ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీల గురించి ఐడియా ఉంటుంది.
ఇప్పుడా రెండు రకాల్ని కలిపి టాలీవుడ్ లో ఓ సినిమాగా తెరకెక్కించినట్టున్నారు. ‘కల్ట్’ సినిమా ట్రయిలర్ చూస్తే ఇదే అనిపించింది.
ఈ సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోందని, మాదక ద్రవ్యాల వాడకం, నిషేధంపై ఈ సినిమాలో చర్చించామని చాన్నాళ్ల కిందట విశ్వక్ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ లోనే కల్ట్ డిఫరెంట్ మూవీ అవుతుందంటూ అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడు.
ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే, అతడు చెప్పింది చాలా వరకు నిజమనిపిస్తుంది. ఈ టైపు కథ, ఇలాంటి టేకింగ్ తో తెలుగులో సినిమా రాలేదు. రక్తపాతం, నరుక్కోవడం లాంటివి ఈమధ్య చాలానే చూస్తున్నాం. దీన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేలా ఉంది ఈ ‘కల్ట్’.
గోవాలోని ఒక ఏకాంత ద్వీపంలో ఉన్న బంగ్లాలో ఈ కథ జరుగుతుంది. అక్కడ డీఎస్పీ సంకల్ప్ నాయక్ తో సహా 300 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోతారు. ప్రాణాంతకమైన గేమ్స్ ఆడుతూ, ఆ ట్రాప్ నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు, అందర్నీ హీరో ఎలా రక్షించాడనేది స్టోరీ.
ఈ సినిమాకు రచయిత, దర్శకుడూ రెండూ విశ్వక్ సేనే. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఈనెల 30న థియేటర్లలోకి వస్తోంది ‘కల్ట్’.
