రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు జిల్లా పరిషత్ ల వంతు వచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పరిషత్ నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ మునిసిపల్ నామినేషన్ల పర్వం ఏ రకంగా జరిగిందో ప్రజలందరూ చూశారు. మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పరిస్థితి ఏమిటి? ఆ నామినేషన్ల ప్రక్రియనైనా సజావుగా సాగనిస్తారా? లేదా, ఇదే తరహాలో పోలీసులను తొత్తులుగా వాడుకుంటూ అరాచకాలు సృష్టించి ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ వారు అసలు నామినేషన్లే వేయజాలని పరిస్థితుల్ని సృష్టిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
మునిసిపల్ నామినేషన్ల విషయంలో కనీసం నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకుండా.. ఎన్నికల సంఘం దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది.
చివరి రోజు నాటికి కెమెరాలు అంటూ కాస్త హడావుడి చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో ఈసీ ముందే మేలుకున్నట్టుగా కనిపిస్తోంది.
నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద, వెలుపల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వెండర్ ఎంపిక కూడా పూర్తయింది.
20వ తేదీలోగా కెమెరాల ఏర్పాటు పూర్తవుతుందని అంటున్నారు. 21నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. 27 వరకు ఉపసంహరించుకోవచ్చు. నవంబరు 3న పోలింగు జరుగుతుంది. అలాగే 5న లెక్కింపు ఫలితాల వెల్లడి ఉంటుంది.
నామినేషన్ల విషయంలో అరాచకాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా ఈసీ ముందుగానే మేలుకున్నది గానీ.. దానివలన ఫలితముంటుందా? కెమెరాల నిఘాను ఖాతరు చేయకుండా అరాచకాలు చోటుచేసుకుంటాయా? అనేది ప్రశ్నార్థకం.
రాష్ట్రంలో 659 మండలాల్లో జడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం నోటిఫికేషన్ వెలువడుతుంది. మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఎన్నికల సంఘం చేతగానితనం బయటపడింది. నామినేషన్ కేంద్రాల వద్ద అపరిమితమైన అరాచకాలను వారు ఏ రకంగానూ అడ్డుకోలేకపోయారు.
ఈసారి సీసీ కెమెరాల ఏర్పాటు అంటున్నారు. కానీ కెమెరాలు ఒక్కటే అరాచకాలను అడ్డుకునే జిందా తిలిస్మాత్ కాదు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే ఫీడ్ ఇంటర్నెట్ లో లైవ్ టెలికాస్ట్ అయ్యేలా ఈసీ పారదర్శకత పాటించాలి. ఎక్కడ ఎవరు ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారో ప్రజలు ఎఫ్పటికప్పుడు తెలుసుకోగలిగే వెసులుబాటు ఉండాలి.
ఒక అరాచకం జరిగిన తర్వాత… ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. ప్రత్యర్థి పార్టీ వారి మీద మాత్రమే కేసులు నమోదు చేయడం వంటి దురాగతాలు ఉండకూడదు. ఇలా జరగాలంటే.. సీసీ కెమెరాల ద్వారా లైవ్ టెలికాస్టింగ్ ను అందించాలి.
అలాగే.. నామినేషన్ కేంద్రాల వద్ద లోపల- బయట మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి. నామినేషన్ కేంద్రాల వరకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను రానివ్వకుండా దారికాచి దాడులు చేసి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పోలీసు బలగాలను సమర్థంగా వినియోగించి ఇలాంటి అరాచకాలను కూడా అడ్డుకునేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలి.
