జగన్ ఆక్రోశం మొత్తం అరణ్యరోదనే!

మొత్తానికి మునిసిపాలిటీలలో ఒక ప్రహసనం ముగిసింది. కనీసం ఎన్నికలైనా నిజాయితీగా జరుగుతాయా? అనేది వేచిచూడాలి.

ఎనిమిది మునిసిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులు అసలు నామినేషన్లే వేయలేదు.. అవన్నీ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.. అంటూ కూటమి నాయకులు మురిసిపోతున్నారు.

నామినేషన్లు వేయడానికి ఎవ్వరూ రాలేని భయవిహ్వల వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, వచ్చిన వారిపై దాడిచేసి కొడుతూ తెలుగుదేశం గూండాలు నానా బీభత్సం సృష్టించిన తర్వాత.. అసలు నామినేషన్లు వేయడానికి ఎవరూ రానేలేదని సన్నాయి నొక్కులు నొక్కడం చిత్రమైన సంగతి.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్ ను, ఎన్నికల కమిషనర్ పునేఠ ను వ్యక్తిగతంగా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి వీడియో సాక్ష్యాల సహా వివరించారు.

ఈ దుర్మార్గాలకు చెక్ పెట్టేందుకు కనీసం నామినేషన్లు దాఖలు చేసే గడువు సమయం అయినా పొడిగించాలంటూ హైకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ జగన్ ఆవేదన మొత్తం అరణ్యరోదనగానే మిగిలిపోయిన పరిస్థితి.

అధికార పార్టీ వారి దురాగతాలకి, పోలీసుల అచేతనత్వానికి ఈ నామినేషన్ల ప్రక్రియ నిదర్శనంగా నిలిచింది. ఇలాంటి అరాచకాలు జరుగుతాయని ముందే అంచనా వేసిన జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి పార్టీ శ్రేణులకు ఒకటే చెబుతూ వచ్చారు.

రాష్ట్రంలో ఒక్క వార్డు ఒక్క సీటు కూడా పోటీచేయకుండా ప్రత్యర్థులకు అప్పగించే పరిస్థితి ఉండకూడదని ఆయన హెచ్చరిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి కూడా. కానీ.. తెలుగుదేశం గూండాలు బరితెగించడం, పోలీసులు వారికి సహకరించడం, వారి దాష్టీకాలను అడ్డుకునే ధైర్యం లేకపోవడం ఇవన్నీ కలిసి వైసీపీ నామినేషన్లే లేకుండా చేశాయి.

పోలీసులూ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. అంటూ జగన్ వేడుకునే పరిస్థితి ఏర్పడింది. పోలీసులను వేడుకున్నా, గవర్నరు, ఈసీలను కలిసినా, హైకోర్టులో కేసు వేసినా అన్నీ వృథానే అయ్యాయి.

పులివెందులలో అధికారులు నడిపించిన కామెడీ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వైసీపీ వారు నామినేషన్లు వేయడానికి వచ్చినప్పుడు అడ్డుకున్నారు. ఘర్షణలు జరిగాయి. వైసీపీకి చెందిన వారి మీద మాత్రం కేసులు పెట్టారు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం.. పట్టణంలో మైకులద్వారా ‘రండి బాబూ రండి.. వచ్చి నామినేషన్లు వేయండి..’ అంటూ ప్రచారం నిర్వహించారు.

ఆటోల్లో తిరుగుతూ మైకులలో అరుస్తూ టమేటాలు, ఉల్లిపాయలు అమ్ముతున్నట్టుగా నామినేషన్లు వేయడానికి రావాలని మైకుల్లో ప్రచారం చేయడం చిత్రం. తీరా వేయడానికి వస్తే మళ్లీ కేసులు పెడతారో.. ఉచ్చులో బిగించి తెలుగుదేశం గూండాలతో కొట్టిస్తారో కూడా తెలియని పరిస్థితి.

మా వంతు ప్రచారం మేం చేశాం.. నామినేషన్లు వేయడానికి రారమ్మని ఆహ్వానించాం.. ఎవరూ రాలేదు.. అని చెప్పుకోడానికి తప్ప.. ఇలాంటి ప్రచారం వల్ల ఉపయోగం లేదని ప్రజలు నవ్వుకుంటున్నారు.

మొత్తానికి మునిసిపాలిటీలలో ఒక ప్రహసనం ముగిసింది. కనీసం ఎన్నికలైనా నిజాయితీగా జరుగుతాయా? అనేది వేచిచూడాలి.

5 Replies to “జగన్ ఆక్రోశం మొత్తం అరణ్యరోదనే!”

  1. అసలు ఏకగ్రీవాలు కి ఒప్పుకోను అన్నప్పుడే దీనికి బీజం పడింది… ఈ ద్వంద వైఖరి వల్ల టీడీపీ వాళ్లకి  మండింది… అన్నియ కి మూడింది… మొహం మాడింది 

  2. అంటె పులివెందెలలొ, నామినెషన్ వెయండి అని మైకు పెట్టి అరిచినా ఒక్కరూ రాలెదు అంటావ్! ఇక నువ్వు చెప్పనవసరం లెదు. అర్ధం అయ్యింది!

Comments are closed.