వైసీపీలో ధీమా అందుకే!

మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఉన్న వరుదు కళ్యాణిని ఎంపిక చేయడం కూడా వైసీపీలో ధీమా పెంచుతోంది.

విశాఖ ఏపీలోనే అతి పెద్ద కార్పొరేషన్‌గా అవతరించింది. 120 డివిజన్లు ఏర్పడ్డాయి. పెరిగిన వార్డులతో కలిపి మొత్తంగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మేయర్ పదవి కూడా ప్రత్యక్ష ఎన్నికల విధానంలోకి రావడంతో వైసీపీలో కొత్త ఆశలు పెంచుతోంది.

వైసీపీ నుంచి పోటీకి ఎవరూ సిద్ధంగా లేరని కూటమి నేతలు చేసిన ప్రచారానికి విరుద్ధంగా 120 స్థానాలకు వైసీపీ అభ్యర్థులు జీవీఎంసీలో నామినేషన్లు వేయగలిగారు. ఒక విధంగా వైసీపీకి ఇది నైతిక విజయంగానే చెబుతున్నారు.

ఇందులో 60 శాతం మహిళలకే సీట్లు కేటాయించారు. 120 సీట్లలో బీసీలకు 95 స్థానాలు కేటాయించి తమదే అసలైన బీసీ పార్టీ అని వైసీపీ చాటుకుంటోంది. కేవలం పాతిక సీట్లు మాత్రమే ఇతర వర్గాలకు వెళ్లాయి.

మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఉన్న వరుదు కళ్యాణిని ఎంపిక చేయడం కూడా వైసీపీలో ధీమా పెంచుతోంది. ఆమె ప్రజలందరికీ పరిచయం ఉన్నవారు. కూటమి అభ్యర్థితో పోలిస్తే అనుభవం కూడా కలిగిన వారుగా చూస్తున్నారు. వాగ్దాటి విషయంలోనూ ఆమెకు తిరుగులేదని అంటున్నారు.

నామినేషన్లు మొత్తం వైసీపీ అభ్యర్థులు గడువులోగా దాఖలు చేశారు. కూటమిలో అయితే ఇంకా సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి రాలేదని అంటున్నారు. నామినేషన్ల విత్‌డ్రా లోగా బీ ఫారాలు ఇచ్చి అధికారిక అభ్యర్థులను కొన్ని స్థానాల్లో ఖరారు చేస్తారని అంటున్నారు. జనసేన, బీజేపీలు ఎక్కువ సీట్లు కోరుతున్నాయి.

మిత్రపక్షాలతో పాటు టీడీపీ నుంచి కూడా చాలా చోట్ల నామినేషన్లు పడ్డాయి. దీంతో కూటమి నుంచి ఎవరికి బీ ఫారం దక్కుతుంది అన్నది అంతా తర్కించుకుంటున్నారు. సీట్లు దక్కని వారు అసంతృప్తికి గురవుతారు. కాబట్టి వారి నుంచి ఏ మేరకు సహకారం ఉంటుందన్నది కూడా కూటమిలో చర్చగా ఉంది.

అయితే ఇవన్నీ సహజమని, సర్దుబాట్లు చేసుకుని ఐక్యంగా ముందుకు పోతామని కూటమి నాయకులు చెబుతున్నారు.

కూటమిలో అసంతృప్తి, అనైక్యత మీదనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. దాంతో పాటు ప్రజా వ్యతిరేకత పెరిగిందని, తమకు అనుకూలిస్తుందని భావిస్తోంది. తమ మేయర్ అభ్యర్థి ఇమేజ్ కూడా కలసి వస్తుందని అంచనా వేస్తోంది.

12 Replies to “వైసీపీలో ధీమా అందుకే!”

Comments are closed.