కేవలం కారు బుకింగ్ కోసమే రూ.2.50 కోట్లు

మొదటిగా చెల్లించే రూ. 5.01 లక్షలను పూర్తి రిఫండబుల్ గా పేర్కొన్నప్పటికీ, 10 రోజుల్లో మిగిలిన చెల్లింపు పూర్తి చేయకపోతే బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త కారు బుక్ చేయాలంటే 5వేలు బుకింగ్ ఎమౌంట్ ఇస్తాం. ప్రీమియం ఎస్ యూ వీలకు 50వేల వరకు, లగ్జరీ కార్లకైతే 2 లక్షల వరకు బుకింగ్ ఎమౌంట్ ఉంది. కానీ ఈ కారు బుక్ చేయాలంటే అక్షరాలా 2 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించాలి. అదే టెస్లా థ్రస్ట్.

ఎగిరే కార్లను ఊహించుకునేవాళ్లకు, టెస్లా రోడ్‌ స్టర్ కారు, ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది. ఇప్పుడీ వాహనాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని భారతదేశ వినియోగదారులకు టెస్లా కల్పించింది. అయితే దీని కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

టెస్లా తన భారతీయ వెబ్‌ సైట్‌లో రోడ్ ‌స్టర్ బుకింగ్‌లను ప్రారంభించింది. రోడ్‌ స్టర్ పర్ఫార్మెన్స్ వేరియంట్ కోసం కస్టమర్లు మొదట రూ. 5.01 లక్షలు చెల్లించి, ఆ తర్వాత 10 రోజుల్లో రూ. 45.05 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది, అంటే దీని మొత్తం రిజర్వేషన్ డిపాజిట్ ఎమౌంట్ రూ. 50.06 లక్షలు.

ఇక థ్రస్ట్ వేరియంట్ కావాలంటే, ముందుగా రూ.5.01 లక్షలు చెల్లించాలి. ఆ తర్వాత 10 రోజుల్లో రూ. 2,45,24,000 చెల్లించాల్సి ఉంటుంది, అంటే దీని మొత్తం అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ రూ. 2.50 కోట్లు అన్నమాట.

ఈ బుకింగ్ డబ్బు ఎక్స్-షోరూమ్ ధరలు కావు, కేవలం రిజర్వేషన్ కోసం మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. మొదటిగా చెల్లించే రూ. 5.01 లక్షలను పూర్తి రిఫండబుల్ గా పేర్కొన్నప్పటికీ, 10 రోజుల్లో మిగిలిన చెల్లింపు పూర్తి చేయకపోతే బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉంటుంది.

అలాగే థ్రస్ట్ వేరియంట్ ను ఒక వినియోగదారుడు ఒక ఆర్డర్ మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది. స్థానిక చట్టాలు, నిబంధనలకు లోబడి మాత్రమే థ్రస్ట్ ఫంక్షనాలిటీ అందుబాటులో ఉంటుందని, అనుమతి లేని దేశాల్లో ఈ సదుపాయం లభించకపోవచ్చని టెస్లా స్పష్టం చేసింది.

2028లో ఈ ఎగిరే కార్ల తయారీ ప్రారంభమౌతుంది. మొదట కేవలం లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ మోడళ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలో కుడిచేతి వైపు స్టీరింగ్ ఉండే మోడళ్ల తయారీకి ఇంకాస్త సమయం పట్టొచ్చు.

రోడ్‌ స్టర్ కార్లను పర్ఫార్మెన్స్, థ్రస్ట్ విభాగాల్లో తీసుకొచ్చారు. కేవలం 2 సీట్లు ఉండే పర్ఫార్మెన్స్ వెర్షన్ లో యాక్టివ్ ఏరోడైనామిక్స్, రోడ్డుపై టైర్ల గ్రిప్ కోసం అదనపు డౌన్‌ ఫోర్స్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటుచేశారు.

అదే ప్యాకేజీకి యాక్సిలరేషన్ థ్రస్టర్లను జతచేసి థ్రస్ట్ వేరియంట్‌ను పరిమిత సంఖ్యలో అందిస్తారు. ఇక సింగిల్ సీట్ ఉండే రాకెట్ వేరియంట్ లో పూర్తి ఫ్లయిట్ సిస్టమ్ ను చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇది బుక్ చేసుకునే అవకాశం లేదు. దీని రిజర్వేషన్ ధరను వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు.

రోడ్‌ స్టర్ మోడల్ కారు డిజైన్ ను ఎఫ్-35 యుద్ధ విమానాల నుండి ప్రేరణ పొంది తయారుచేశారు. 2028 నుంచి లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్‌ తో ఉత్పత్తి కానుండటంతో, రోడ్ ‌స్టర్ మోడల్ మార్కెట్లోకి వచ్చే కొద్దీ భారతదేశంలో దీని తుది ధర, అందుబాటులో ఉండే మోడళ్లు, సాంకేతికతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.