సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన మాతృభూమి సినిమా చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వచ్చేనెల 4న థియేటర్లలోకి రానుంది. దీనికి సంబంధించిన ఓ ప్రధానమైన పుకారుపై సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు.
ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఈ సినిమా స్క్రిప్ట్ మార్చారని, అందుకే రిలీజ్ అలస్యమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని సల్మాన్ ఖండించాడు. ప్రభుత్వాలు లేదా సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు.
చైనాకు వ్యతిరేకంగా ఈ సినిమా తీస్తున్నామని, ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఒత్తిడితోనే స్క్రిప్ట్ మార్చారంటూ జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమంటున్నాడు సల్మాన్. ఒక్క కట్ కూడా లేకుండా సినిమా విడుదలకు సిద్ధమైందని తెలిపాడు.
ఈ సినిమా స్టోరీతో పాటు, విడుదల వాయిదా పడటానికి కారణాలను సల్మాన్ వివరించాడు. గతంలో బాటిల్ ఆఫ్ గాల్వన్ పేరిట ఈ సినిమా తెరకెక్కింది. ఆరేళ్ల కిందట గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇది సాగుతుంది.
15,000 అడుగుల ఎత్తులో జరిగిన ఈ పోరాటంలో అమరులైన సైనికుల త్యాగాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ లేట్ అవ్వడం వల్లనే సినిమా లేట్ అయిందంటున్నాడు సల్మాన్.
ప్రారంభంలో 45-50 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నప్పటికీ, చిత్రంగదా సింగ్ గాయపడటంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఆపై నవంబర్ 20న విడుదల చేద్దామనుకున్నప్పటికీ గ్రాఫిక్స్ పనులు తుది దశకు చేరుకోకపోవడంతో డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా స్టోరీపై వస్తున్న విమర్శలను సల్మాన్ తిప్పికొట్టాడు. ఈ సినిమాలో విలన్లు ఎవ్వరూ ఉండరని, కేవలం పరిస్థితులు మాత్రమే విలన్లుగా ఉంటాయని అంటున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కింది మాతృభూమి.
