ఇండస్ట్రీలో అన్నీ అగ్రిమెంట్ల మీదే నడుస్తాయి. మాటలు బాగున్నప్పుడు అవి చిత్తుకాగితాలతో సమానం. ఏమాత్రం వ్యవహారం బెడిసికొట్టినా, అవే అగ్రిమెంట్లు నాగుపాముల్లా మారి మెడకు చుట్టుకున్న సందర్భాలు కోకొల్లలు.
అందుకే హీరోహీరోయిన్ల అగ్రిమెంట్లు పక్కాగా ఉంటాయి. కాల్షీట్ల వ్యవహారాలతో పాటు, ప్రచారానికి సంబంధించిన క్లాజులు కూడా అందులో ఉంటాయి. ఇక హీరోయిన్లకైతే స్కిన్ షో, లిప్ కిస్సులకు సంబంధించిన విషయాలు కూడా అందులోనే నిశితంగా పొందుపరుస్తాయి.
అయితే కొత్తగా అవకాశం రావడమే గొప్ప అనుకునే హీరోయిన్లను కూడా ఇలా అగ్రిమెంట్ల చట్రంలో ఇరికించడం ఎంతవరకు సమంజసం? ఛాన్స్ ఇవ్వడమే పెద్ద విషయం, పైగా పెద్ద హీరో సినిమా. అలాంటప్పుడు వాళ్లెందుకు యూనిట్‌ను ఇబ్బంది పెడతారు?
పిలిచినప్పుడల్లా షూటింగ్‌కు వస్తారు, ప్రచారం సంగతైతే సరేసరి. అది తమ కెరీర్ కాబట్టి వాళ్లు చాలా అంకిత భావంతో ఉంటారు. అయితే అదే టైమ్‌లో అగ్రిమెంట్‌లో కండిషన్ మాత్రం కొంతమంది హీరోయిన్లను ఇబ్బంది పెడుతోంది.
తమ సినిమా పూర్తయ్యేవరకు మరో సినిమాకు కాల్షీట్ ఇవ్వకూడదనే క్లాజుతో చాలామంది హీరోయిన్లు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటికిమొన్న నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇలానే ఇబ్బందులు పడ్డారు. చాన్నాళ్ల పాటు ఒకే సినిమాపై వాళ్లు ఉండిపోవాల్సి వచ్చింది.
అసలే హీరోయిన్ల కెరీర్ నిడివి చాలా తక్కువ. అలాంటి వాళ్లను ఇలాంటి క్లాజులతో ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్. వాళ్లే అనుకుంటే, ఇప్పుడు కొత్త హీరోయిన్లు కూడా అదే రూల్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఓ స్టార్ హీరో సినిమాతో డెబ్యూ ఇస్తున్న ఓ హీరోయిన్ ఏళ్లుగా ఆ సినిమాలోనే ఉండిపోయింది.
దీనికి కారణం అగ్రిమెంట్‌లో ఉన్న ఆ నిబంధన. నిజంగా ఆ రూల్ లేకపోతే, ఈ పాటికి ఆమె చేతిలో మరో 2 సినిమాలుండేవి. ఆమె నటించిన ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యేది కూడా. కానీ ఈ కండిషన్లతో కొంతమంది హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
సినిమా హిట్టయితే ఓకే, ఫ్లాప్ అయితేనే మొదటికే మోసం వస్తుంది. ఇకనైనా నిర్మాతలు ఈ కండిషన్లు, అగ్రిమెంట్లలో కఠినమైన నిబంధనల విషయంలో కాస్త ఆలోచిస్తే మంచిదేమో. మరీ ముఖ్యంగా కొత్త హీరోయిన్ల విషయంలో.

Banisthavam, now they don’t talk about women empowerment