మూవీ రివ్యూ: డీఎన్‌కే

రైటింగులోనే ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఒక్క సినిమా హిట్టయ్యి మంచి పేరు రాగానే మౌళి తప్పటడుగు వేసాడు

సినిమా: డీఎన్‌కే
రేటింగ్: 2/5
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: మౌళి తనూజ్ ప్రశాంత్, సుస్మిత శెట్టి, రఘుబాబు, అలీ, రజిత, ప్రియా, బబ్లూ, సుదర్శన్, భద్రం, రమణ భార్గవ్, నంద గోపాల్ తదితరులు.
సంగీత దర్శకుడు: సింజిత్ యెర్రమిల్లి
ఛాయాగ్రహణం: సూర్య బాలాజీ
ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
రచన, దర్శకత్వం: శ్రీను కంబాల
విడుదల తేదీ: నవంబర్ 13, 2026

మౌళి ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇవ్వడమే కాకుండా, మంచి పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు. ఇక తన రెండో సినిమా టైటిల్ గా “దొంగ నా…” అంటూ ఒక బూతుమాటని పెట్టుకున్నా సెన్సార్ వారు దానిని ‘డీఎన్‌కే’ గా మార్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడంతో సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం.

కథలోకి వెళితే .. ఈశ్వర్ (మౌళి తనూజ్ ప్రశాంత్) ఏ పనీ పాటా లేకుండా తిరిగే ఓ యువకుడు. ఎక్కువ సమయం ఆన్లైన్లో పేకాట ఆడుతూ, డబ్బులు వృథా చేస్తుంటాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి, అతడిని గుండు బాస్ జ్యువెలరీ షాపులో సేల్స్‌మన్‌గా పనిలో పెడతాడు. ఈ క్రమంలో ఈశ్వర్‌కు దీపు (సుస్మిత శెట్టి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. దీపు కూడా ఈశ్వర్‌ను ఇష్టపడుతుంది.

అయితే, జూదంలో డబ్బులు పోగొట్టుకున్న ఈశ్వర్, దీపు నగలను తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటాడు. విషయం తెలిసిన దీపు తల్లిదండ్రులు, ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి నెల రోజుల గడువు ఇస్తారు.

ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈశ్వర్ తన స్నేహితుడి సాయంతో తాను పనిచేస్తున్న జ్యువెలరీ షాపునే దోచుకోవాలని ప్లాన్ వేస్తాడు. కానీ, తన ప్లాన్ అమలు చేయకముందే ఆ షాపులో మరో దొంగతనం జరుగుతుంది. అక్కడి నుంచి ఈశ్వర్, అతడి స్నేహితుడు పారిపోతుండగా, ఓ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో వారికి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. మొదట్లో ఆ బ్యాగ్‌లో ఏదో పెద్ద నిధి దొరికిందని సంబరపడతారు. కానీ, అదే వారిని మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముంది? ఈశ్వర్ ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే మిగతా కథ.

కథగా తీసుకుంటే ఇబ్బంది ఏమీ కనిపించదు. ఇక నడిపించిన విధానంలోనే ఉండకూడని దరిద్రాలు ఉండడం, ఉండాల్సిన క్లీన్ కామెడీ లేకపోవడం జరిగాయి. “లవ్ ఎట్ ఫర్స్ట్ సైట్” ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలుగా చూపించి ఉంటారు. కానీ ఇందులో చూపించినంత అసహ్యంగా ఎక్కడా చూపించలేదు.

హీరో రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేస్తూ జిప్ పెట్టుకోకుండా వెనక్కి తిరుగుతాడు. “అది” చూసి ప్రేమించిందన్నట్టుగా సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. దీనికి తోడు పారలెల్ గా మరొక గే కూడా హీరోది చూసి లవ్వులో పడతాడట! “సంథింగ్ ఇస్ ఫిషీ” అనాల్సిన చోట “సంథింగ్ ఇస్ పుస్సీ” అంటూ డైలాగ్! యూత్ పేరుతో ఇలా బూతుని వండి వడ్డించేసారు.

సరే, ఆ రకమైన కామెడీని ఇష్టపడేవాళ్ళు ఉండొచ్చు. సెన్సార్ వాళ్లే క్లియర్ చేసాక ఇలాంటి అధిక్షేపణలు దేనికి అనుకోవచ్చు. కానీ, చిత్రంలో తొలి సగం నవ్వించినంతగా (క్లీన్ జోక్స్ కొన్ని, వల్గర్ వి కాసిని) మలి సగం నవ్వించలేదు. హాల్లో సైలెన్సే దానికి నిదర్శనం.

మౌళికి ఒక ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. కానీ దానిని తనకు తానే కుదించేసుకుని మరీ సి-గ్రేడ్ డైలాగ్స్ చెప్తే అతని కెరీర్ పైకి వెళ్లకిపోగా కిందకి పడటం ఖాయం. క్లీన్ కామెడీని అందిస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు దగ్గరవుతారు. ఒకప్పటి “ఆనందోబ్రహ్మ”, ఆ తర్వాత “అమృతం” తరహా సీరియల్స్ ని గుర్తు చేసే కామెడీ పంచులు.. జంధ్యాల, ఈవీవీ శైలి హాస్యపు విందులు అందించే స్థాయి రచయిత మౌళిలో ఉన్నాడు. అతని స్కిట్స్ చూస్తేనే తెలుస్తుందది. వాటి మీద దృష్టి పెట్టి దర్శకుడిని కన్విన్స్ చేసుకోవాలి తప్ప, ఇలా పక్కదోవ పట్టడం అతని కెరీర్ కి శ్రేయస్కరం కాదు.

మౌళి రెండో సినిమాతోటే మాస్ హీరో షేడ్స్ చూపించే ప్రయత్నం మొదలెట్టేసాడా అనిపిస్తుంది. అక్కడక్కడా సూట్లు వేసుకుని రెగ్యులర్ హీరో తరహాలో కనిపించడానికి ప్రయత్నించడం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బలవంతపు బిల్డప్ సీన్స్, రకరకాల వేషాలు వేయడం.. ఇవన్నీ కామెడీ అనుకుని తీసినా..అస్సలు నవ్వు తెప్పించకుండా బెడిసికొట్టాయి.

సుస్మిత శెట్టి తెరపై అందంగా కనిపించింది. ఒక్కో యాంగిల్లో హంసానందినిని గుర్తు చేసేలా ఉంది. అయితే లిటిల్ హార్ట్స్ లో హీరోయిన్ కి ఉన్నంత నటించే స్కోప్ ఇందులో ఈమెకి లేదు.

హీరో తల్లిదండ్రులుగా అలీ, రజిత ప్రారంభంలో పర్వాలేదనిపించారు. అయితే, సెకండాఫ్‌లో మాత్రం కొన్ని సన్నివేశాల్లో వారి నటన కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. ఒక్కోచోట వికటించి, నవ్వించడం మానేసి.. చిరాకు కూడా తెప్పిస్తుంది వీళ్ల ట్రాక్.

రఘుబాబు, భద్రం తమకు అలవాటైన పాత్రలకు భిన్నమైన రోల్స్‌లో కనిపించారు. గుండు బాస్ పాత్రలో గుండు సుదర్శన్ సరిపోయాడు. పోలీస్ ఆఫీసర్‌గా నంద గోపాల్ ఓకే. సుస్మిత శెట్టి తల్లిగా ప్రియ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక మౌళి స్నేహితుడిగా నటించిన బబ్లూ అక్కడక్కడా నవ్వించినప్పటికీ, ఒక దశ దాటాక అతడి కామెడీ కాస్త చిరాకు తెప్పిస్తుంది.

“ఒక్క చాన్స్ ఇవ్వు..” పాట “ఖడ్గం”లో “గోవిందా గోవిందా” పాటని గుర్తుచేస్తుంది. “రింగ రింగ రోజెస్..” పాట అక్షరక్రమంగా సాగుతూ కొత్తగా అనిపించింది.

ఏది ఎలా ఉన్నా మొదట్లో పూసిన నవ్వులు ఇంటర్వెల్ ముందే ఆగిపోయాయి. తర్వాత అంతా సీరియస్ గా సాగుతూ, ఏదో కామెడీ అంటూ కొన్ని సీన్స్ నడుస్తున్నా కృతకంగా అనిపిస్తాయి.

మిడిల్ పోర్షన్స్‌లో రిపీటెడ్ కామెడీ, అనవసరమైన ఎపిసోడ్స్ కారణంగా సినిమా బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేలో కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ, వాటిని మరింత ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.

అయితే, క్లైమాక్స్‌కు ముందు వచ్చే కొన్ని ట్విస్టులతో సినిమా మళ్లీ కొంత ఆసక్తిని పెంచుతుంది. చివర్లో సత్య క్యామియో కూడా బాగుంది.

కానీ, సినిమా మొత్తం మీద లౌడ్ నెరేషన్, అతిగా అనిపించే నటన కారణంగా ఇది అందరికీ నచ్చే ఎంటర్‌టైనర్‌లా కాకుండా, ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాలా అనిపిస్తుంది.

‘లిటిల్ హార్ట్స్’, ‘డీఎన్‌కే’ సినిమాల మధ్య ప్రధానమైన తేడా వాటిలోని లవ్ ట్రాక్, క్లీన్ కామెడీ. మౌళి మొదటి సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వారి ప్రేమ చుట్టూ నడిచే అమాయకమైన కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ కూడా అందరూ మెచ్చేలా ఉంది. కానీ ‘డీఎన్‌కే’లో హీరోయిన్‌కు చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటంతో లవ్ ట్రాక్ సరిగా డెవలప్ కాలేదు. దీనికి తోడు సినిమాలో చాలా చోట్ల లాజిక్‌కు అందని సన్నివేశాలు కనిపిస్తాయి. రఘుబాబు పాత్ర ఒక ఉదాహరణ. ఇలాంటి సన్నివేశాలు నవ్వించడానికి బదులుగా చీప్ కామెడీ అనిపిస్తాయి.

అయితే, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడు కొన్ని ఆసక్తికరమైన ట్విస్టులు, టర్న్‌లతో కథను నడిపించే ప్రయత్నం చేసినా.. అధికభాగం అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. క్రైమ్ కామెడీ అంశాలను కథలో మిళితం చేసిన విధానం కొంతవరకు ఆసక్తిని కలిగించినా, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోదు.

ఓవరాల్ గా చెప్పాలంటే రైటింగులోనే ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఒక్క సినిమా హిట్టయ్యి మంచి పేరు రాగానే మౌళి తప్పటడుగు వేసాడు. ఓపెనింగ్ సరదాగా అనిపించినా క్రమక్రమంగా కథ క్రైం యాంగిల్లోకి వెళ్లే కొద్దీ నవ్వులు తగ్గిపోయాయి. దాంతో చిన్న తప్పులు కూడా పెద్దగా అనిపించడం మొదలుపెట్టాయి. కామెడీ అనుకుని వచ్చిన ఆడియన్స్ కి సరిపడా నవ్వులు అందించకపోతే డైవర్ట్ అయిపోవడం సహజం. పైగా ఈ చిత్రాన్ని “లిటిల్ హార్ట్స్” తో పోల్చి అంచనా వేయడం కూడా అంతే సహజం. ఆ స్థాయి లేనప్పుడు పెదవి విరవడం కూడా సహజమే. తర్వాతి చిత్రానికి అయినా తన “తల”ని వాడాల్సిన రీతిలో వాడి చిత్రం తీస్తే స్వాగతించడానికి అన్ని వర్గాల ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు.

బాటం లైన్: ఒక వర్గానికే

6 Replies to “మూవీ రివ్యూ: డీఎన్‌కే”

Comments are closed.