తొక్కిస‌లాట‌కు ఆ అధికారిని బాధ్యురాలు చేయ‌లేదెందుకు?

విధుల నిర్వ‌హ‌ణ‌లో ఆ విజిలెన్స్ అధికారిని ఎలా విఫ‌లం చెందారు? అలాగే ప్ర‌భుత్వ వేటు నుంచి త‌ప్పించుకోడానికి కార‌ణాలేంటి?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోడానికి టోకెన్ల జారీలో తీవ్ర తొక్కిస‌లాట జ‌రిగి, ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా బైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు స్కూల్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల్ని చేస్తూ జేఈవో గౌత‌మి, అలాగే తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడిని బ‌దిలీ చేశారు. సీఐ, మ‌రో టీటీడీ అధికారిని స‌స్పెండ్ చేశారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది.

నిజానికి గౌత‌మికి అధికారిక బాధ్య‌త‌ల ఉత్త‌ర్వుల్ని ఏ ఒక్క అధికారి ఇవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆమెపై ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టి ఎలాంటి పోస్టు ఇవ్వ‌కుండా, జీఏడీలో రిపోర్ట్ చేసుకోవాల‌ని ఆదేశించింది. ఇదే ఘ‌ట‌న‌కు సంబంధించి బ‌దిలీ అయిన ఎస్పీ సుబ్బ‌రాయుడికి మాత్రం, అదే తిరుప‌తిలో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకునే విభాగానికి బ‌దిలీ చేసిందీ ప్ర‌భుత్వం.

మ‌రోవైపు తిరుప‌తి తొక్కిట‌లాట ఘ‌ట‌న‌పై హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జి నేతృత్వంలో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ విచార‌ణ క‌మిటీ చాలా మందికి నోటీసులు ఇచ్చిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. అయితే తొక్కిస‌లాట క్యూలైన్‌కు అధికారికంగా బాధ్యురాలైన ఓ విజిలెన్స్ అధికారిపై ప్ర‌భుత్వం ఎందుక‌ని ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదో ఎవ‌రికీ అంతుచిక్క‌ని వ్య‌వ‌హారంగా మారింది. స‌ద‌రు అధికారిని త‌ప్పించుకోవ‌డంలో ఎలాంటి “క‌ళా” నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

నిజానికి ఇన్‌స్పెక్ట‌ర్ స్థాయిలో ఉన్న ఆ అధికారికి ప్ర‌త్యేకంగా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంలో ఉద్దేశం… అనుభ‌వం ఉంద‌ని భావించ‌డ‌మే. కానీ విధుల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు చ‌ర్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌డం వెనుక అస‌లేం జ‌రిగింద‌నే చ‌ర్చ టీటీడీలో భారీగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికైనా విచార‌ణ క‌మిటీ నిజాయ‌తీగా విచారిస్తే, తొక్కిస‌లాట రోజు ఏం జ‌రిగింది? విధుల నిర్వ‌హ‌ణ‌లో ఆ విజిలెన్స్ అధికారిని ఎలా విఫ‌లం చెందారు? అలాగే ప్ర‌భుత్వ వేటు నుంచి త‌ప్పించుకోడానికి కార‌ణాలేంటి? అనే సంగ‌తులు బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం వుంది.

2 Replies to “తొక్కిస‌లాట‌కు ఆ అధికారిని బాధ్యురాలు చేయ‌లేదెందుకు?”

Comments are closed.