క‌న‌ప‌డ‌ని రోడ్డు మీద జ‌ర్నీ చేయ‌డ‌మే లైఫ్

నిన్ను నువ్వు కొత్త‌గా తెలుసుకోవ‌డ‌మే జీవితం. ప‌క్షులు ఆకాశంలో వెళ్తాయి. కొండ‌రాళ్లు క‌ద‌ల‌కుండా భూమ్మీదే వుంటాయి.

ఒక కాటి కాప‌ర్ని ‘దెయ్యాలున్నాయా’ అని అడిగాను. ‘వుంటే నాకే క‌దా ముందు క‌నిపిస్తాయి’ అన్నాడు. ఒక‌వేళ వుంటే, వెళ్లిపోయిన వాళ్లు దెయ్యాలుగా అయినా క‌నిపిస్తార‌ని ఆశ‌. కొడుకు దెయ్య‌మై వ‌చ్చి ప‌ల‌క‌రించినా స‌రే, ముస‌లిత‌ల్లి చిగురిస్తుంది.

జ‌న‌వ‌రి 13, భోగి. మ‌ణికొండ మ‌ర్రిచెట్టు చౌర‌స్తాలో అంచ‌నా త‌ప్పింది. నా స్కూట‌ర్ నేరుగా వెళ్లి కారుని గుద్దింది. చిన్న‌చిన్న గాయాలు. జ‌నం వ‌చ్చి స‌ప‌ర్య‌లు చేసారు. ప్ర‌మాదం జ‌రిగిన‌పుడు మ‌నుషులెంత మంచోళ్లో అర్థ‌మ‌వుతుంది. భోగి మంట‌ల్లో చెత్త‌ను విసిరేస్తారు. కొంచెం తేడా కొడితే న‌న్ను విసిరేసేవాళ్లు.

మ‌ర్రిచెట్టు కింద‌, గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అందించిన వాట‌ర్ బాటిల్ తాగుతున్న‌పుడు ఆకాశంలోంచి ఒక వాయిస్ ఓవ‌ర్ వినిపించింది.

‘నీకు నేను అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయ‌లేదు. తొంద‌ర‌ప‌డి ఢీకొన‌కు’ ఫోన్ చేస్తే వ‌చ్చే సైబ‌ర్ నేర‌గాళ్ల హెచ్చ‌రిక‌లా వుంది.

ప్ర‌తిదీ లిఖిత‌మై వుంటుందంటారు. నేను న‌మ్మ‌ను. ఎందుకంటే దేవుడికి రాయ‌డం రాదు. అ ఆలు నేర్చుకోకుండానే ఆదిగురువై పోయాడు.

జ‌న‌నం బాధ‌గానే వుంటుంది. త‌ల్లికి తెలుస్తుంది. బిడ్డ‌కి తెలియ‌దు. మ‌ర‌ణం అంటేనే బాధ‌. శిశువుకి జ్ఞానం లేక‌పోవ‌డం వ‌ల్ల నొప్పి అర్థం కాదు. ముద‌స‌లి జ్ఞాన‌భారంతో వంగిపోయి వుంటాడు. జ్ఞాన‌మంటేనే బాధ‌, యాత‌న‌.

రాత్రి ప‌ది గంట‌లు. ఒకాయ‌న పిల్ల‌ల బొమ్మ‌లు రోడ్డు మీద అమ్ముతున్నాడు. కొనేవాళ్లు లేరు.

“అత‌నికి పిల్ల‌లంటే చాలా ప్రేమై వుంటుంది” అన్నాను మిత్రుడు జ‌గ్గూ దాదాతో.
“మ‌న మాట‌లు అత‌ని క‌డుపు నింప‌వు” అన్నాడు.
ఒక ఒంటె, గుర్రం మా ఇల్లు చేరాయి. రెండు గుర్రాలు ఆప్యాయంగా జ‌గ్గూ వెంట వెళ్లాయి.
నిక్క‌బొడుచుకున్న చెవుల‌తో గుర్రం నా మాటలు వింటూ వుంటుంది. కూజా మూతితో ఒంటె ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అది అర‌బ్బీ. అర్థం కాదు.

బాల్యం జారిపోయింద‌ని బాధ‌ప‌డుతూ వుంటాం కానీ, ఎక్క‌డికీ వెళ్ల‌దు. లోప‌లే వుంటుంది. జాగ్ర‌త్త‌గా చేదుకోవాలి.

త‌ల‌కోన ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో వెంక‌టేశ్ అనే వాచ్‌మ‌న్ ఉన్నాడు. ఒక రాత్రి అత‌ని ఇంటికి చిరుత పులి అతిథిగా వ‌చ్చింది. రాత్రంతా భార్యాబిడ్డ‌ల‌తో వ‌ణుకుతూ ఇంట్లో అత‌ను. బ‌య‌ట గాండ్రు శ‌బ్దంతో పులి.

“ఈ ఉద్యోగం ప్ర‌మాదం క‌దా, మానేయ‌కూడ‌దా” అన్నాను.

“పులి ఒక‌సారే తింటుంది. ఆక‌లి రోజూ తింటుంది. బ‌త‌కాలి క‌దా సార్” అన్నాడు. జీవితం యూట‌ర్న్ తీసుకున్న ప్ర‌తిసారీ వెంక‌టేశ్ గుర్తుకు వ‌స్తాడు. ఈ మాట పాతికేళ్ల క్రితం చెప్పాడు.

పండితుల నుంచి ఏం నేర్చుకోలేదు. సామాన్యులు అన్నీ నేర్పిస్తారు. తాము నేర్పరుల‌మ‌ని కూడా వాళ్ల‌కి తెలియ‌దు.

మ‌నుషులంద‌రినీ టికెట్లుగా భావించే ఆటో డ్రైవ‌ర్ త‌గిలాడు ఒక‌సారి. చిన్న ఆటోలో ఎంద‌రినైనా కూచోపెట్ట‌గ‌లిగే శ‌క్తిమంతుడు. ముందు సీట్లో ఒంటి పిర్ర మీద కూచూని, హ్యాండిల్ తిప్పుతూ.

“క‌న‌ప‌డ‌ని రోడ్డు మీద జ‌ర్నీ చేయ‌డ‌మే సార్ లైఫ్ అంటే” అన్నాడు.
“ఇంత పెద్ద మాట నీకెలా తెలుసు” అన్నాను.
“ఒక రోజు ఆటో న‌డిపి చూడండి. మీకూ తెలుస్తాయి”
నువ్వు గుర్తు ప‌ట్ట‌ని వాళ్ల‌తో, నిన్ను గుర్తు ప‌ట్ట‌ని వాళ్ల‌తో ప్ర‌యాణిస్తూ వుంటే ప్ర‌తిరోజూ కొత్త పుస్త‌కాన్ని చ‌దివిన‌ట్లే.

భూమిలో విత్త‌నాలు నాటిన‌ట్టు అనుభ‌వాలు నాటుతూ వెళితే నీ కోసం ఒక చెట్టు వుంటుంది. ఆకు రాల్చ‌డానికి మించిన వేదాంతం వుంటుందా?

నిన్ను నువ్వు కొత్త‌గా తెలుసుకోవ‌డ‌మే జీవితం.
ప‌క్షులు ఆకాశంలో వెళ్తాయి. కొండ‌రాళ్లు క‌ద‌ల‌కుండా భూమ్మీదే వుంటాయి.
ప‌క్షి నేర్చుకుంటుంది. రాయి నేర్చుకోదు. నువ్వెవ‌రు?

జీఆర్ మ‌హ‌ర్షి

8 Replies to “క‌న‌ప‌డ‌ని రోడ్డు మీద జ‌ర్నీ చేయ‌డ‌మే లైఫ్”

  1. వేసవి వర్షం చలి వాటి seasons అవే వస్తాయి.

    ఉరుములు అవే ఉరుముతాయి

    పక్షులు ఎగురుతాయి

    road కు అంతం ఉంది లేదు

    మనిషి ఎగరలేడు

    ఎందుకురా ఈ వేదాంతం … నీకు నువ్వేదో పెద్ద వేదంతి లా ఫీల్ అయ్యి ఒక పేజీ రాసేస్తున్నావు …. ఖర్మ ర బాబూ…

    1. ఆర్టికల్ చదివి వేస్ట్ ఐన టైం కి కాంపెన్సేషన్ మీ కామెంటే బ్రదర్ !!

  2. నువ్వూ నీ ఎదవ సోది..కొండరాయి ఎందుకు కదులుతుంది ఎదవ సన్నాసి ఇది నీ ఆర్టికల్ అని తెలిసేలా ఏమైనా చెయ్ హెడ్డింగ్ లోనే..అసలు క్లిక్ చేయను..

Comments are closed.