ఈ మధ్య కాలంలో వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వరుసగా రెండు సార్లు వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో ఓడిపోయాక, ఏ మాత్రం భయపడకుండా ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
కడప యాస ఆయన మాటలకు అదనపు సొగసు. ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో బహిరంగంగానే బూతులు అలవోకగా ఆయన నోటి నుంచి దొర్లుతున్నాయి.
తాజాగా పులివెందులలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో రాచమల్లు స్పీచ్ అదుర్స్ అని చప్పట్లు కొట్టించుకున్నప్పటికీ, బూతులు శ్రుతిమించాయి.
నాలుగు గోడల మధ్య ఎవరేం మాట్లాడినా జనం పట్టించుకోరు. కానీ మహిళలు కూడా పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనో కనీస మర్యాద కూడా రాచమల్లు పాటించలేదనే విమర్శలొస్తున్నాయి.
రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు బూతులు ప్రయోగించాలనే సిద్ధాంతం లేదు. చక్కటి తెలుగులోనే, వినసొంపైన కడప యాసలోనే రాచమల్లు తన రాజకీయ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించొచ్చు. బలహీనులు మాత్రమే ఎదుటి వారిపై బూతులు మాట్లాడ్తారనే సంగతిని మరిచిపోవద్దు.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుటుంబంలో రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా) అనే సుప్రసిద్ధ రచయిత ఉండేవారు.
సాహిత్య విమర్శలో ఆయనకు సాటి వచ్చే సాహితీవేత్త ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే రాచమల్లు బైరవ కొండారెడ్డి అనే మరో గొప్ప సాహిత్యకారుడు కూడా ఆ కుటుంబానికి చెందిన వారే కావడం విశేషం.
మాజీ ఎమ్మెల్యేకి బైరవకొండారెడ్డి అబ్బ (నాయన తండ్రి), రాచమల్లు రామచంద్రారెడ్డి చిన్నబ్బ అవుతారు. అలాంటి గొప్ప సాహిత్య కుటుంబం నుంచి వచ్చిన శివప్రసాద్‌రెడ్డి భాష విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, మంచి వక్త అవుతారు.
వైసీపీకి కూడా రాజకీయంగా ఆయన గళం బలమవుతుంది. అలా కాకుండా బూతులు ఎక్కువైతే… ఛాఛా, ఛీఛీ తప్పవని తెలుసుకుంటే మంచిది.

మీరు బూ.తులు తిట్టండి.. నేను చూసుకుంటా
మీరు అరాచకాలు చేయండి.. నేను చూసుకుంటా
మీరు అభివృద్ధి కి అడ్డు పడండి.. నేను చూసుకుంటా..
మీరు ఫేక్ ప్రచారాలు చేయండి.. నేను చూసుకుంటా…
అసలు ఇలాంటి మాటలు నాయకుడు అంటుంటే.. వీళ్ళు ఇంత కన్నా గొప్పగా మాట్లాడుతారా?
గతంలో అన్నియ మాటలు నమ్మి మోసపోయి జై.లు పాలు అయిన సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్యకర్తలు.. మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు
పైగా వీళ్ళు పోరాడాలి.. నేను మాత్రం పాలస్ లో తొంగుంటా