రాజకీయ పార్టీలకు అధ్యక్షులు మారితే వాటి జాతకాలు మారిపోతాయా? దుస్థితిలో ఉన్న రాజకీయ పార్టీకి మహర్జాతకం పడుతుందా ? దశ తిరిగి పోతుందా ? పార్టీలకు ఎంత సమర్ధ నాయకత్వం ఉన్నా ప్రజల మూడ్ ఎలా ఉంటుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. వారు ఏ పార్టీని కుర్చీ ఎక్కిస్తారో, ఏ పార్టీని కుర్చీ నుంచి దింపుతారో ఎవరికీ తెలియదు. కొన్ని పార్టీలకు ఏళ్ళ తరబడి అందలం అందుకునే అవకాశం రాదు. వారు తల్లకిందులు తపస్సు చేసినా అంతే.
భారతీయ జనతా పార్టీ విషయం తీసుకుంటే తెలంగాణలో కొద్దిగా బెటర్ గా ఉంది. ఆంధ్రాలో పైకి లేవలేకపోతోంది. కంభంపాటి హరిబాబు హయాంలో ఆ పార్టీలో డెవెలప్ మెంట్ లేదు. ఆ తరువాత బీజేపీతో ఏ మాత్రం సంబంధం లేని కన్నా లక్ష్మీ నారాయణకు అధ్యక్ష పీఠం అప్పగించారు. ఆయన హయాంలోనూ జరిగింది ఏమీలేదు. సరే … ఆయన ప్లేసులో వచ్చిన సోము వీర్రాజు మాటలు కోతలు దాటించాడుగానీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ తిరుపతి ఉప ఎన్నికలో పూర్తిగా పడుకునేసింది.
బీజేపీ కంటే దాని మిత్రపక్షమే బెటరనే అభిప్రాయం కలిగింది. పాపం … పార్టీలోకి వేరే పార్టీల వారు చేరుతారనే ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీలో చంద్రబాబుకు తోడు నీడగా ఉన్న కొందరు నాయకులు వైసీపీలో కాకుండా బీజేపీలో చేరిపోయారు. వారి ఫిరాయింపులను చూసిన ఏపీ బీజేపీ నాయకత్వం పార్టీ దశ తిరుగుతుందని అంచనా వేసింది.
కొంతకాలం కిందట అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం, కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడం, కరోనా కట్టడి విషయంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రధాని మోడీ అపకీర్తి పాలవడంతో ఏపీ బీజేపీలో ఆశలు పూర్తిగా అడుగంటాయి. ఇందుకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కారణమవుతాడా ? ఇందుకు ఆయన కారణమని చెప్పలేం.
ఏపీ ప్రజలు రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ తో పాటు బీజేపీ మీద కూడా పగ పెంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ఈ రెండు పార్టీలే కారణమని బలమైన ముద్ర ప్రజల్లో పడిపోయింది. అయితే ఆనాడు రాష్ట్ర విభజనను టీడీపీ, వైసీపీ కూడా సమర్ధించాయి. ఆ రెండు పార్టీలు వ్యతిరేక గళం వినిపించలేదు.
పోనీ … విభజన తరువాత రాష్ట్రానికి న్యాయం చేసి ఉంటే బీజేపీ మీద కోపం, పగ కొంత మేరకు తగ్గేవేమో. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గానీ, రాష్ట్రంలో బీజేపీ నాయకులు గానీ ప్రజల పగను మరింత రెట్టింపు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతల ద్వారా పగను పెంచితే, రాష్ట్ర నాయకులు మాటల ద్వారా పెంచారు.
పుండు మీద కారం చల్లడం అంటారే అలా విభజన కారణంగా బాధపడుతున్న ప్రజలకు ప్రత్యేక హోదా ఎగ్గొట్టారు. అది ముగిసిన అధ్యాయమని రాష్ట్ర నాయకులు పదేపదే చెప్పారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా తలూపిన చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు. అన్ని విధాలా అన్యాయం చేసిన కాంగ్రెస్ ను, బీజేపీని, టీడీపీని ప్రజలు ఇప్పటివరకు క్షమించలేదు. అందుకే ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీకి పట్టం కట్టారు.
ఈ మూడు పార్టీల మీద కోపమే సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కారణమైంది. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. నన్ను ఎందుకు ఓడించారు ? నేనేమి అన్యాయం చేశాను అంటూ అప్పట్లో బాబు గారు చాలాకాలం కుమిలిపోయాడు. ఆయనకు అర్ధం కాకపోవచ్చు. కానీ ప్రజలకు అర్ధమైంది.
అందుకే అనుభవం లేకపోయినా జగన్ ను నమ్మారు. ప్రత్యేక హోదా రాదని జగన్ కు తెలుసు కాబట్టి, దాన్ని పెద్దగా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలతో ఆకట్టుకుంటున్నాడు. ఏదో రూపంలో డబ్బులు అందుతున్నాయని జనం కూడా హ్యాపీగానే ఉన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని అధికారంలోకి తీసుకురాకూడదని జనం అనుకుంటే బీజేపీపీకి మాత్రం అవకాశం ఇవ్వరు.
కాంగ్రెస్ వైపు చూస్తారు. బీజేపీతో అంటకాగుతున్న జనసేనను కూడా పక్కన పెడతారు. కాబట్టి జనం మూడ్ ను బట్టి ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందిగానీ అధినేతల సమర్ధత, ఆకర్షణ పెద్దగా పనిచేయవు.