వాకింగ్ చాలామంచిదంటారు. డాక్టర్లు కూడా ఇదే చెబుతారు. దీంతో చాలామంది వాకింగ్ చేస్తుంటారు. కానీ అలా వాకింగ్ చేసే వాళ్లలో చాలామందికి దానిపై అవగాహన ఉండదు. రోజుకు ఎంత వాకింగ్ చేయాలి? ఎలా వాకింగ్ చేయాలి అనే అంశాల్ని చాలామంది పట్టించుకోరు. మరీ ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు రోజూ నడిస్తే చాలు వెయిట్ తగ్గిపోతాం అనుకుంటారు.
వాకింగ్ చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు కొన్ని తప్పనిసరి. వీటిలో ముఖ్యమైంది వార్మప్. వాకింగ్ కు ముందు కనీసం 3 నిమిషాల పాటు వార్మప్ చేయాలి. అలా చేసిన తర్వాత మాత్రమే వాకింగ్ ప్రారంభించాలి. చాలామంది ఒకేసారి వేగంగా నడవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.
ఇక వాకింగ్ లో మరో ముఖ్యమైన అంశం విరామం. వాకింగ్ చేసే టైమ్ లో ఎప్పుడు ఎలా విరామం తీసుకోవాలనే అంశం చాలామందికి తెలియదు. దీనికి వైద్యులు చెబుతున్న సమాధానం ఒకటే. వాకింగ్ లో విరామం అంటే మొత్తం నడకను ఆపేయకూడదు. 10 నిమిషాల పాటు చురుగ్గా నడిచిన తర్వాత ఓ 2 నిమిషాలు మెల్లగా నడవాలి.
ఆ తర్వాత మళ్లీ వేగం పెంచాలి. విరామం ఇలా తీసుకోవాలి తప్ప, మొత్తంగా నడక ఆపేయకూడదు. అయితే ఇది బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లకు మాత్రమే. 50 ఏళ్లు దాటిన వ్యక్తులు వాకింగ్ చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో ఆగొచ్చు.
ఇక బరువు తగ్గాలనుకునేవాళ్లు రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలి. కాళ్లు-చేతులు వదులుగా ఉంచుతూ, చురుగ్గా నడవాలి. ఇంకా చెప్పాలంటే శ్వాసను వేగంగా తీసుకునేలా నడవాలన్నమాట. ఇలా నడిచినప్పుడు మాత్రమే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది.
ఇక వాకింగ్ లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. అలసట వచ్చిన తర్వాత చాలామంది నడక ఆపేస్తారు. బాగా అలసిన తర్వాత కూడా మనం ఎంతసేపు నడుస్తామో అప్పుడే అధికంగా కొవ్వు కరుగుతుంది. అందుకే ప్రతి వారం వాకింగ్ వేగాన్ని, సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలని సూచిస్తారు.
శరీర బరువుకు తగ్గట్టు రోజుకు 30 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు నడక సాగించవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు కాస్త చురుగ్గా నడిస్తే, అరగంటలో సరాసరి 4వేల అడుగులు వేయొచ్చు. అంటే రెండున్నర కిలోమీటర్ల పైమాటే. ఇలా రోజుకు అర్ధగంట నడవడం వల్ల 100 నుంచి 300 కెలొరీలు ఖర్చు అవుతాయి. అంటే ఆ మేరకు కొవ్వు కరిగినట్టే.
వాకింగ్ చేసిన తర్వాత ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం, భారీగా టిఫిన్ చేయడం లాంటివి చేయకూడదు. కొద్దికొద్దిగా నీళ్లు తాగాలి. కనీసం గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత టిఫిన్ చేస్తే మంచిది. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు.. శరీరంలో జీవక్రియలన్నీ సాఫీగా సాగుతాయి. గుండె సంబంధిత జబ్బులు, షుగర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.