Advertisement

Advertisement


Home > Politics - National

బీజేపీ అక్క‌డ సీట్ల‌ను నిల‌బెట్టుకోగ‌లదా?

బీజేపీ అక్క‌డ సీట్ల‌ను నిల‌బెట్టుకోగ‌లదా?

ఇటీవ‌లి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నిస్సందేహంగా పై చేయి సాధించింది. దేశంలో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ ముఖాముఖి పోరు జ‌రిగింది మూడు రాష్ట్రాల్లో. అందులో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంది. ఆ వ్య‌తిరేక‌త‌ను జ‌యించి కూడా కాంగ్రెస్ గెలిచి ఉంటే.. ఆ పార్టీ దేశంలో కోలుకుంటోంద‌నే త‌ర్కానికి విలువ ఉండేది. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కూడా కాంగ్రెస్ గెల‌వ‌లేక‌పోయింది. ప్ర‌త్యేకించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌స్తావ‌న ఎందుకుంటే.. ఐదేళ్ల కింద‌ట ఆ రాష్ట్రంలో ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు మినిమం మెజారిటీతో అధికారం ఇచ్చారు. ఆ ప్ర‌భుత్వాన్ని బీజేపీ కూల‌గొట్టి త‌న ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది! 

మ‌రి కాంగ్రెస్ పై సానుభూతితో అయినా అక్క‌డ ప్ర‌జ‌లు ఓట్లేస్తారేమో అనే విశ్లేష‌ణ‌లు వినిపించాయి. అయితే అలా కూడా కాంగ్రెస్ కోలుకోలేక‌పోయింది. ఇక రాజస్తాన్, చ‌త్తీస్ ఘ‌డ్ ల‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. మ‌రి ఇలా చూస్తే కాంగ్రెస్ పార్టీ లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు గ‌ట్టి ఎదురుదెబ్బ‌నే తిన్న‌ట్టు! లోక్ స‌భ ఎన్నిక‌ల గురించి మాట్లాడితే.. అసెంబ్లీల క‌న్నా బీజేపీకి లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలోనే మంచి ప‌ట్టుంటుంద‌నే అభిప్రాయాలూ పాత‌వే! అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచిన చోట కూడా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ పై చేయి సాధిస్తుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే గ‌తంలో జ‌రిగిన‌ట్టుగా ప్ర‌తి సారీ జ‌ర‌గాల‌నే లేదు!

ప్ర‌త్యేకించి వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి కొన్ని స‌వాళ్లు లేక‌పోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్య‌మైన విజ‌యాల‌ను సాధించిన చోట్ల బీజేపీ ఏ మేర‌కు ప‌ట్టు నిలుపుకుంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఉదాహ‌ర‌ణ‌కు ప‌శ్చిమ బెంగాల్. ఆ రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 18 ఎంపీ సీట్ల‌ను నెగ్గింది. అప్ప‌టి వ‌ర‌కూ చ‌రిత్ర‌లో వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి ఒక‌టీ రెండు ఎంపీ సీట్లు ద‌క్క‌డ‌మే ఎక్కువ‌! 2014 ఎన్నిక‌ల్లో మోడీ హ‌వాలో కూడా బీజేపీ ద‌క్కింది రెండే అక్క‌డ! అలాంటిది 16 సీట్ల‌ను పెంచుకుని 18కి చేరింది క‌మ‌లం పార్టీ!

మ‌రి అలాంటి గాలి వీచిన చోట వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టు నిలుపుకోవ‌డ‌మే బీజేపీకి అతి పెద్ద స‌వాల్. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో అమిత్ షా బెంగాల్ తోనే మొద‌లుపెట్టిన‌ట్టుగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ లో 35 లోక్ స‌భ సీట్ల‌ను నెగ్గాలంటూ శ్రేణుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు! అప్పుడే సోనార్ బెంగాల్ సాధ్య‌మ‌న్నారు! అంటే 18 సీట్లు ఇచ్చినా బంగారు బెంగాల్ సాధ్యం కాలేదు కానీ, 35 సీట్లు గెలిస్తే అవుతుంద‌న‌మ‌ట‌! 

కేవ‌లం బెంగాలే కాకుండా, మహారాష్ట్ర‌లో అప్పుడు క‌మ‌లం పార్టీకి బాగా క‌లిసొచ్చింది. మ‌రి అలాంటివి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ మేర‌కు సాధ్యం అవుతాయ‌నేది ప్ర‌శ్నార్థ‌కం! అసెంబ్లీలే గెలిచాం.. లోక్ స‌భ ఎన్నిక‌లు త‌మ‌కు లెక్క‌లోవి కావ‌ని భ‌క్తులు వాదించొచ్చు కానీ.. ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?