Advertisement

Advertisement


Home > Politics - National

మాల్దీవులకు మోత మొదలైంది

మాల్దీవులకు మోత మొదలైంది

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే విషయం మాల్దీవులకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. ప్రధాని మోదీపై, భారత పర్యాటకంపై, ఇండియాపై మాల్దీవులు మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇప్పుడా దేశం ఫలితాన్ని అనుభవిస్తోంది.

ఇంతకీ ఏం జరిగింది... ఈమధ్య లక్షద్వీప్ పర్యటించారు ప్రధాని మోదీ. సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్ ను పర్యటించాలంటూ టూరిజంను ప్రోత్సహిస్తూ ఆయన ట్వీట్ వేశారు. దీనిపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు సెటైర్లు వేశారు. దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఇండియా అంతా ఒక్కటైంది. బాయ్ కాట్ మాల్దీవులు అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతోమంది ప్రముఖులు మాల్దీవులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దేశీయ టూరిజంను ప్రోత్సహించాలన్నారు.

ఈ క్రమంలో ఆల్రెడీ మాల్దీవుల పర్యాటకంపై ఈ ప్రభావం పడింది. వేలాది మంది భారతీయులు, తమ మాల్దీవులు టూర్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇకపై తాము మాల్దీవుల్లో పర్యటించమంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది ఆ దేశానికి పెద్ద దెబ్బ.

మాల్దీవులు పర్యాటకంలో భారత్ వాటా.. పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం మాల్దీవులు. మరీ ముఖ్యంగా మాల్దీవులు పర్యాటకంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షల్లో భారతీయులు మాల్దీవులు పర్యటిస్తుంటారు. ఆ దేశానికి కోట్ల రూపాయల్లో ఆదాయం అందిస్తున్నారు. 2023లో 2 లక్షల మంది మాల్దీవుల్లో పర్యటించారు. 2022లో 2 లక్షల 41వేల మంది ఆ దేశాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఆ ప్రభావం మాల్దీవులపై ఆల్రెడీ పడింది.

చేతులు కాలిన తర్వాత ఆకులు... జరిగిన ఘటనపై మాల్దీవులు కాస్త ఆలస్యంగా స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని కేబినెట్ నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ల వ్యాఖ్యలు వ్యక్తిగతమని, మాల్దీవులకు ఆ కామెంట్స్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్దీవులపై భారతీయుల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు చాలా రాష్ట్రాల్లో మాల్దీవులపై వ్యతిరేకత మొదలైపోయింది.

రాజకీయ కోణం.. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కోణం కూడా కనిపిస్తుంది. మాల్దీవుల్లో గత ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా ఉండేది. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లింది. కానీ గత ఏడాది నవంబర్ లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.

మహమ్మద్ సోలి ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని అనుసరించగా.. మహమ్మద్ ముయిజ్జు మాత్రం 'ఇండియా అవుట్' అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులు చైనాకు దగ్గరైంది. ఇజ్రాయెల్-పాలస్తీనా వ్యవహారంపై ఇండియా వైఖరిని మాల్దీవులు మంత్రులు బహిరంగంగా విమర్శించారు. తమకు భారత్ సైన్యం అక్కర్లేదని పోస్టులు పెట్టారు.

ఈ క్రమంలో మాల్దీవులు మహిళా మంత్రి ప్రధానిపై, భారత టూరిజంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, రెండు దేశాల మధ్య సంబంధాల్ని మరింత దెబ్బతీశాయి. మాల్దీవులు పర్యాటకంపై ఈ ప్రభావం గట్టిగా పడనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?