విక్రాంత్ ఆచూకి అడిగిన వ్యక్తి అరెస్ట్

ఇతడు కొన్నాళ్లుగా మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఓవైపు యుద్ధం జోరుగా నడుస్తోంది. భారత యుద్ధ విమానాలు, పాక్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ విమానాల ప్రధాన కేంద్రం ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక. కీలకమైన ఆ యుద్ధ నౌక ఎక్కడుందంటూ కొచ్చి నావికా స్థావరానికి కాల్ వచ్చింది.

తననుతాను రాఘవన్ గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని. విక్రాంత్ ఎక్కడుందో కో-ఆర్డినేట్స్ కావాలని ఫోన్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఫోన్ కట్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు, ముజీబ్ రెహ్మాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తి, కాల్ చేసిన వెంటనే తన ఫోన్ ను స్విచాఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పోలీసులు ఇతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇతడు కొన్నాళ్లుగా మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని నిర్థారించడానికి అతడికి వైద్య పరీక్షలు జరుపుతున్నారు. తనంతట తానే కాల్ చేశాడా, ఎవరైనా ఇతడితో కాల్ చేయించారా అనే విషయాల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ సందర్భంగా భారత నౌకాదళం కీలక ప్రకటన జారీ చేసింది. తప్పుడు కాల్స్ చేసినా, నావికా దళ కీలక సమాచారం కోసం ప్రయత్నించినా అది నేరం కిందకు వస్తుందని తెలిపింది. వీటి కోసం గూగుల్ లో వెదికినా అది నేరమనే విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు.

4 Replies to “విక్రాంత్ ఆచూకి అడిగిన వ్యక్తి అరెస్ట్”

  1. ఎక్కడ ఉందొ తెలిసి మాత్రం ఏమి చేస్తాడు ? దాని దగ్గర లోకి రాలేదు పాకిస్థాన్ .

Comments are closed.