Advertisement

Advertisement


Home > Politics - National

రాహుల్ హైబ్రిడ్ యాత్ర: ఫలితమిస్తుందా?

రాహుల్ హైబ్రిడ్ యాత్ర: ఫలితమిస్తుందా?

రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఆయన చేయబోతున్నది హైబ్రిడ్ యాత్ర! అంటే పాదయాత్ర మరియు బస్సుయాత్ర కలిసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో పాదయాత్రగా వెళుతూనే.. ఎక్కువ దూరాలను బస్సుయాత్ర ద్వారా కవర్ చేస్తారు. వీలైనన్ని చోట్ల ప్రజలతో కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం, బహిరంగ సభలు నిర్వహించడం చేస్తారు.

రాహుల్ గాంధీ రెండో విడతగా చేయబోతున్న ఈ యాత్ర తూర్పు నుంచి పశ్చిమం వరకు భారతదేశ హద్దులను కలుపుతూ సాగుతుంది. మణిపూర్ లోని ఇంఫాల్ లో జనవరి 14న ప్రారంభం అయ్యే యాత్ర మార్చి 20న ముంబాయిలో ముగుస్తుంది. దీనికి భారత న్యాయ్ యాత్ర అని పేరు పెట్టారు.

ఈ యాత్ర మొత్తం 14 రాష్ట్రాల గుండా వెళుతుంది. మొత్తం 6200 కిలోమీటర్లు సాగుతుంది. అంటే సగటున రోజుకు 92 కిలోమీటర్లుగా (పాదయాత్ర ప్లస్ బస్సుయాత్ర కలిపి) కవర్ చేస్తారు. రాహుల్ గాంధీ తొలివిడతగా నిర్వహించిన భారత్ జోడోయాత్రలో కన్యాకుమారినుంచి కాశ్మీరు వరకు 4500 కిలోమీటర్ల దూరాన్ని 12 రాష్ట్రాల మీదుగా 136 రోజుల వ్యవధిలో కేవలం పాదయాత్రగా పూర్తిచేశారు. అప్పట్లో రోజుకు సగటున 33 కిలోమీటర్లు నడిచారు. 

యాత్ర చేయడం వరకు ప్రణాళిక బాగానే ఉంది. మరి దీని ద్వారా రాహుల్ ఏం సాధించబోతున్నారు అనేది చర్చనీయాంశంగా ఉంది. పాదయాత్ర కూడా చాలా గొప్పగా సాగిందని అనుకున్నారు. పాదయాత్ర సాగిన మార్గంలో కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెసు అసెంబ్లీలను గెలుచుకుంది. అంతమాత్రాన ఆ విజయాలను పూర్తిగా రాహుల్ ఖాతాలో వేయడానికి వీల్లేదు. 

కర్ణాటకలో భాజపా అవినీతితోను, తెలంగాణలో భారాస అహంకారంతోనూ భ్రష్టుపట్టిపోయిన తర్వాత మాత్రమే ఆ పార్టీ ప్రభుత్వాలు పరాజయం పాలయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అయిదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్ గుండా కూడా అప్పటి జోడోయాత్ర సాగింది. అక్కడ విజయమేమీ దక్కలేదు. ఈ తడవ న్యాయ్ యాత్ర కూడా మళ్లీ ఛత్తీస్ గఢ్ సహా ఆ రెండు రాష్ట్రాల గుండా కూడా వెళ్లనుంది.

భారత న్యాయ్ యాత్ర సాగే రూట్ మ్యాప్ లోని ఎంపీ సీట్ల పరంగా పెద్ద రాష్ట్రాలలో ఒక్కటి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం లేదు. కొన్ని మిత్రపక్షాల చేతిలోనూ మిగిలినవి భాజపా చేతిలోనూ ఉన్నాయి. ఈ ప్రాంతాల గుండా యాత్ర సాగిస్తూ.. కాంగ్రెసు అనుకూలతను ప్రజల్లో నిర్మించాలంటే.. రాహుల్ గాంధీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తుండగా.. మార్చి 20 వరకు కూడా యాత్రలోనే ఉండబోయే రాహుల్ గాంధీ ఎలాంటి ఫలితం సాధిస్తారో వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?