Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆమె నోటి దురుసుకు వేదిక‌గా నారాభేరీ!

ఆమె నోటి దురుసుకు వేదిక‌గా నారాభేరీ!

వైసీపీ ప్ర‌భుత్వంపై మహిళ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచేందుకు చంద్ర‌బాబు మ‌న‌సులో నుంచే పుట్టిందే నారీభేరీ. ఇది కూడా టీడీపీ ద‌ళిత మ‌హిళ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఏదో ఒక వ్య‌తిరేక స‌భ నిర్వ‌హించాల‌నే టీడీపీ ఆలోచ‌న‌లో భాగంగానే ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే స‌మాజ శ్రేయ‌స్సు ఆకాంక్షించి ఏదైనా చేప‌డితే సానుకూలత ఏర్ప‌డుతుంది. కానీ మ‌న‌సులో దుర‌ద్దేశాల‌ను నింపుకుని, నారా వారు భేరీ మోగించాల‌నే య‌త్నాల‌కు ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు.

సీన్ రివ‌ర్స్ అయింది. స‌రిగ్గా ఈ కార్య‌క్ర‌మానికి రెండు రోజులు ముందు విజ‌య‌వాడ‌లో టీడీపీ నాయ‌కుడు వినోద్ జైన్ ఓ మైన‌ర్ బాలిక ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని నిర‌సిస్తూ...ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ వుతోంది. స‌ద‌రు కామాంధుడు వినోద్ జైన్‌ను టీడీపీ వెంట‌నే పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి... న‌ష్టాన్ని పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ వినోద్ జైన్ వ్య‌వ‌హారం టీడీపీ మెడ‌కు చుట్టుకుంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో నారీ భేరీ సంక‌ల్ప‌దీక్ష చేప‌ట్టారు. మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు, ప్రభుత్వ ఉదాసీనతకు వ్యతిరేకంగా కార్యక్ర‌మం చేప‌ట్టిన‌ట్టు ప్ర‌క‌టించారు. ముందుగా త‌మ నాయ‌కుడు వినోద్ జైన్ ఓ బాలిక ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోగా, సాకులు వెతుక్కోవ‌డం టీడీపీకే చెల్లింది. ముఖ్యంగా తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌పూడి అనిత త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై అవాకులు చెవాకులు పేలేందుకు ప్రాక్టీస్ కార్య‌క్ర‌మంగా ఈ వేదిక‌ను ఉప‌యోగించుకున్న‌ట్టుంది. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఆమె నోటి దురుసుకు హ‌ద్దుల్లేకుండా పోతోంది. ఇందుకు ఈ వేదిక సాక్షిగా నిలిచింది. జ‌గ‌న్‌ను దొంగోడ‌ని సంబోధించ‌డం వెనుక ఆమె ఆకాంక్ష ఏంటో అంద‌రికీ తెలుసు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు, లోకేశ్ త‌దిత‌ర టీడీపీ పెద్ద‌ల మ‌న్న‌న‌లు పొందాల‌నే ఉబ‌లాటం ఆమెలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటన దురదృష్టకరమ‌నే ఒక్క మాట‌తో స‌రిపెట్టారు. చంద్రబాబుతో వినోద్‌జైన్‌ ఉన్న ఫొటోను జగన్‌ పత్రికలో వేశారని, అతనితోపాటు మంత్రి వెలంపల్లి, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌లతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయ‌ని, వాటిని ప్రచురించే దమ్ము జగన్‌ పత్రికకు ఉందా? అని వంగ‌ల‌పూడి అనిత ప్ర‌శ్నించారు.  

వినోద్ జైన్ త‌న పార్టీ త‌ర‌పున విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన విష‌యాన్ని ఆమె మ‌రిచిపోయిన‌ట్టున్నారు. వినోద్ జైన్‌ను త‌న పార్టీనే ఎందుకు స‌స్పెండ్ చేసిందో అనిత స‌మాధానం చెప్పి, మిగిలిన పార్టీల వాళ్ల‌తో సంబంధాల గురించి మాట్లాడితే బాగుండేది. రాష్ట్ర‌మంతా షాక్‌కు గుర‌య్యేలా బాలిక ఆత్మ‌హ‌త్య‌కు టీడీపీ నాయ‌కుడే కార‌ణ‌మ‌య్యాడ‌నే స‌మాచారం, ఆ పార్టీపై అస‌హ్యం క‌లిగిస్తోంది. ఇది చాల‌ద‌న్న‌ట్టు మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు నిర‌స‌న‌గా తెలుగు మ‌హిళ‌ల‌తో చంద్ర‌బాబు దీక్ష చేయించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇది నారాభేరీనే త‌ప్ప‌, నారీభేరీ కాద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?