Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ :హుదూద్‌ పాఠాలు - 5

ఇలా జరక్కుండా వుండాలంటే ఎంతో పట్టుదల వుండాలి, అంతకంటె ముఖ్యంగా నిధులు కావాలి. ఇప్పటిదాకా మోదీ ప్రకటించినది వెయ్యి కోట్లు మాత్రమే. మనవాళ్లు అడుగుతున్నా జాతీయ విపత్తుగా యిప్పటిదాకా ప్రకటించలేదు. మన రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యకక్షుడు 60 వేల కోట్ల మేరకు నష్టం అన్నారు. కేంద్ర బృందం వాళ్లు వచ్చి ఎంత లెక్క వేస్తారో తెలియదు. మనం అడిగినంత కేంద్రం ఎప్పుడూ యివ్వదు. గత 20 ఏళ్లలో మన రాష్ట్రానికి విపత్తుల గురించి అడిగినది 54 వేల కోట్లు, కేంద్రం యిచ్చినది 9600 కోట్లు. కర్నూలు వరదల నష్టం 11707 కోట్లు, కేంద్రం నుంచి వచ్చినది 685. 2010 లో లైలా నష్టం 1357 కోట్లు, వచ్చినది 75 కోట్లు. మౌలిక సదుపాయ కల్పనకు ఎలాటి నిధులూ యివ్వటం లేదు. ఇప్పుడున్నది టిడిపికి మిత్రపక్షమైన బిజెపి ప్రభుత్వం కదాని ఆశలు పెట్టుకోకూడదు. గతంలో యిక్కడా అక్కడా కాంగ్రెసు ప్రభుత్వం వున్నపుడూ రాలేదు. కేంద్ర ప్రభుత్వాలలో ఎన్‌డిఏ ప్రభుత్వాలు కూడా వున్నాయి. ఏ పార్టీ వచ్చినా అధికారులు, వాళ్ల దృక్కోణమైతే మారదు కదా. ఈ 60 వేల కోట్లు కూడా ప్రాథమిక అంచనా మాత్రమే. చివరకు ఎంతకు తేలుతుందో తెలియదు. కత్రినా ప్రాథమిక అంచనా 25 బిలియన్‌ డాలర్ల నష్టం, ఇన్సూరెన్సు వాళ్లు చెల్లించే సరికి 108 బిలియన్‌ డాలర్లు అయిందిట. 

ఇక్కడ యిన్సూరెన్సు క్లెయిమ్స్‌ అంత వుండవు లెండి.  మేం రుణమాఫీ చేసేదాకా బ్యాంకులకు పైసా కట్టకండి అంటూ రైతులకు దుర్బోధలు చేసి క్రాప్‌ ఇన్సూరెన్సు లేకుండా చేశారు టిడిపి (యిక్కడ తెరాస) నాయకులు. ఇప్పుడు రైతుల ఘోష చూడలేక యిన్సూరెన్సు కంపెనీ వాళ్లను మీకోసం రూలు అధిగమించమని చెప్తాం లెండి అంటున్నారు, మోదీ చేత కూడా ఆ ముక్క చెప్పించారు. ఇవి జరిగేదాకా నమ్మడానికి లేదు. పాత ఋణాల రీషెడ్యూల్‌ గురించి, కొత్త ఋణాల వితరణ గురించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఒప్పుకుంది, స్థానిక బ్యాంకర్లు ఒప్పుకున్నారు, మీకోసం రూల్సు వంచేస్తాం అంటూ చెప్పారు - అంటూ నెలల తరబడి నాటకాడారు టిడిపి వారు, తెరాస వారు.  అంతా వట్టిదే, చివరకి ఏమీ లేదని తేల్చేసరికి పంట నష్టమైంది. రైతులు శవాల్లా, జీవచ్ఛవాల్లా తేలారు. ఆంధ్రరాష్ట్రం కోసం రూల్సు మారిస్తే యింకో రాష్ట్రమూ అడుగుతుంది, మరో ఏడాదీ అడుగుతారు. ఇన్సూరెన్సు వ్యవస్థకు పెద్ద కుదుపు తగులుతుంది. మనకు రావలసిన ప్రత్యేక ప్రతిపత్తే రావడం లేదు కదా, యిలాటి మినహాయింపులు వస్తాయని ఎలా అనుకుంటాం? ఇక తక్కినవాళ్ల యిన్సూరెన్సు లంటారా? ఇండస్ట్రీలో మెషినరీకి చేయిస్తారు. పెద్ద కంపెనీలైతే ఫర్నిచర్‌కు చేయిస్తారు. మామూలు గృహస్తుల్లో ఇంట్లో వస్తువులకు యిన్సూరెన్సు చేయించుకునేవారు ఒక శాతం కూడా వుంటారో వుండరో! వీళ్లంతా భారీగా నష్టపోయినట్లే, దాన్నించి ఎప్పటికి తేరుకుంటారో తెలియదు. 

తుపాను నేర్పిన పాఠాల గురించి గుర్తు చేసుకోవాలంటే - ఇన్సూరెన్సులు చాలా ముఖ్యం. తీర ప్రాంతాల్లో యిళ్ల ఎక్స్‌టీరియరే కాదు, యింటీరియర్‌ డిజైనింగ్‌ కూడా ప్రత్యేకంగా వుండాలి. భూకంపం వచ్చినపుడు బీరువాల మీద పెట్టిన పెట్టెలు నెత్తి మీద పడి చాలామంది చనిపోతారని విన్నాను. ఇప్పుడు హుదూద్‌ గాలికి కిటికీలు, వాటి అద్దాలు పగలడమే కాక, గాలి యింట్లో చొరబడి గిన్నెల దగ్గర్నుంచి, భోషాణాల దాకా కదిల్చేస్తూ వుంటే ఏది నెత్తిన పడుతుందో, ఏ గ్లాసు కంట్లో గుచ్చుకుంటుందో తెలియదు. ఈ అమరికంతా జాగ్రత్తగా చూసుకోవాలి. తుపాను జాగ్రత్తలు చెప్పగానే పెట్రోలు వగైరాలే కాదు, క్యాష్‌ కూడా  దగ్గర పెట్టుకోవాలి. మొన్న కరంటు పోవడంతో ఎటిఎమ్‌లు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఇలాటి ఉత్పాతాలు వచ్చినపుడు మధ్యతరగతి ప్రజలు చాలా యిబ్బంది పడతారు. పులిహార పొట్లాల కోసం అందరితో కలిసి క్యూలో నిలబడి కొట్లాడడడానికి నామోషీ ఫీలయి, ఎంత ఖరీదైనా పెట్టి వస్తువులు బ్లాక్‌మార్కెట్‌లో కొందామని చూస్తారు. దాంతో వాటి ధరలు మరీ పెరుగుతాయి. అందుకని తుపాను హెచ్చరిక రాగానే సరుకులు ముందే కొనుక్కుని యింట్లో పడేసుకుంటే మంచిది. ఇలా చాలా జాగ్రత్తలు వుంటాయి. బాధితులు మన కంటె బాగా చెప్పగలుగుతారు. 

ఇక నాయకుల గురించి చెప్పాలంటే వాళ్లు యిలాటి పరిస్థితుల్లో అక్కడకు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. అధికారంలో వున్నవాళ్లు వచ్చి ఏం చేసేదేముంది? మేం వున్నాం, మీకేం ఫర్వాలేదు అంటారు. మాకేం అందలేదు అని బాధితులు చెప్తారు, వీళ్లు అధికారులను తిడతారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో వున్నవాళ్లు వస్తారు. బాధితుల అదే గోడు వినిపిస్తారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అని వాళ్లు నిందించి పోతారు. అధికారులను బెదిరిస్తారు - మేం అధికారంలోకి వచ్చాక మీ పని పడతాం అంటూ. ఎవరు వచ్చినా అధికారులను తిట్టడమే తప్ప చేసేదేమీ లేదు. ఆ పాటి దానికి అక్కడకు రావడం దేనికి? ప్రెస్‌ మీట్‌ పెట్టి తిట్టేయవచ్చు కదా. వీళ్లు వచ్చినపుడు ప్రోటోకాల్‌ పేరుతో ఎంతమంది సిబ్బంది వృథా అవుతారో చూడండి. రాజకీయ నాయకులే కాదు, గవర్నరు కూడా వెళ్లారు. రాజు వెడలె రవితేజము లలరగ.. అన్నట్టు ఆయనతో బోల్డు మంది అధికారులు వెళతారు. వాళ్ల బాగోగులు చూడడానికి మందీ మార్బలం, పోలీసు బందోబస్తు... యిలా ఎంతోమంది వారిని పరివేష్టించి వుండడంతో కావలసిన చోట మనుషులు తక్కువ పడతారు. నన్నడిగితే అసలు ప్రధాని కూడా రానక్కరలేదంటాను. ఎక్కడో వున్న నాసా వాడు ఉపగ్రహంలో యిక్కడ ఏం జరుగుతోందో చూసేస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న ప్రధాని వీడియోలో చూడలేరా? ప్రకటించే సాయం అక్కణ్నుంచే ప్రకటించవచ్చు. కేంద్రబృందాన్ని త్వరగా పంపించి, నష్టాన్ని లెక్కవేయించి మంజూరు చేయిస్తే అదే పదివేలు. వీళ్లు ఆదరాబాదరా వస్తారు కానీ ఆ బృందం మూణ్నెళ్ల తర్వాత వచ్చి 'ఏదీ బీభత్సం? ఏదీ కరువు? మొక్కలున్నాయిగా? గుడిసెలకు కప్పులున్నాయిగా?' అంటారు. వాళ్లు వచ్చేదాకా గుడిసెకు కప్పు వేసుకోకుండా కూర్చుంటారా చోద్యం కాకపోతే! ఎప్పుడూ యిదే కథ. 

ఇక ముఖ్యమంత్రి కూడా ఒకసారి వచ్చి చూసి ప్రజలకు ధీమా చెప్పి వెళ్లిపోతే చాలు. ఈయన యిక్కడే డేరా వేశారు. 'చివరి వ్యక్తికీ మేలు జరిగేవరకు యిక్కడే వుంటా. ఆ తరువాతే విశాఖను వదిలేది.' అంటూ గ్రాండ్‌ స్టేట్‌మెంట్‌ యిచ్చారు. ఇప్పుడు వదిలారు కాబట్టి, చివరి వ్యక్తికి కూడా మేలు జరిగిందని అనుకోవాలా? అంటే యికపై యింకేం చేయనక్కరలేదా? ఇదంతా డ్రమెటిక్స్‌. ముఖ్యమంత్రికి యింత కవిత్వం అక్కరలేదు. ప్రజా ప్రతినిథులు కాబట్టి ఓసారి వచ్చి మొహం చూపిస్తే చాలు, పనులు జరిపించడం ముఖ్యం. వీళ్లే ఎక్కువనుకుంటే సినిమా యాక్టరు కూడా వస్తే ఎలా? పవన్‌ కళ్యాణ్‌ వెళ్లి తిరిగి వచ్చి 'నన్ను చూసేందుకు అధిక సంఖ్యలో వస్తున్నందున సహాయ చర్యలకు అంతరాయం కలుగుతుండడంతో వెనక్కి వచ్చా.' అన్నారు. వెళ్లేముందు తెలియదా - తన కెంత పాప్యులారిటీ వుందో? పనులు మానేసి అందరూ తనను చూడడానికి ఎగబడితే వాళ్లకు ఉపకారం చేసినట్లా? అపకారం చేసినట్లా? ఆయనకు పోటీగా తామూ వెళ్లి తమ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూపాలనే కోరిక కలగనందుకు యితర స్టార్లకు సవాలక్ష కృతజ్ఞతలు. 

సిఎం క్యాంప్‌ వేసి వున్నాడంటే లోకల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌పై ఎంతో ఒత్తిడి. మగపెళ్లివారు విడిది ఖాళీ చేసేదాకా ఆడపెళ్లివారికి టెన్షన్‌ వున్నట్టే వుంటుంది. ఎప్పుడు పిలుస్తారో, ఏం తిడతారో అని చేయాల్సిన పనులు మానేసి వెయిట్‌ చేస్తూ వుంటారు. సిఎం కాదు, సిఎస్‌ కూడా అక్కడే వుండాలని కొందరు మీడియా వ్యక్తులు అనుకున్నారు. చీఫ్‌ సెక్రటరీ వద్దకు వెళ్లి 'పాపం చంద్రబాబుగారు అహోరాత్రాలు అక్కడ కష్టపడుతూంటే మీరిక్కడ హాయిగా కూర్చున్నారేమిటి? అక్కడకు వెళ్లనందుకు దిగులు లేదా?' అంటూ రెచ్చగొట్టబోయారు. ఆయన కూల్‌గా 'ఎవరెక్కడ వుండాలో అక్కడే వుండాలి. నేను యిక్కణ్నుంచే సమన్వయం చేస్తున్నాను' అన్నారు. అది కరక్టు. చర్చిల్‌, హిట్లర్‌ యుద్ధాలు చేశారంటే వాళ్లు యుద్ధరంగంలోకి వెళ్లి స్వయంగా తుపాకీలు పట్టుకుని నిలబడ్డారా? ఎక్కడెక్కడకి సైనికులను పంపించాలి? ఎంత ఆహారం? ఎన్ని దుస్తులు? ఎన్ని మందులు? ఎన్ని ఆయుధాలు? వారికి సహాయంగా మరొకర్ని పంపాలా? అలిసిపోతే వెనక్కి రమ్మనాలా?  ఇలాటి నిర్ణయాలన్నీ యుద్ధభూమికి దూరంగా వున్నవాళ్లే తీసుకోగలుగుతారు. వారికే టెలిస్కోపిక్‌ వ్యూ వుంటుంది. రంగంలో వున్నవాడికి కళ్ల ఎదుట వున్నదే తెలుస్తుంది. హుదూద్‌ విషయంలో కూడా ఫోకస్‌ వైజాగ్‌ మీదే పడి తక్కిన జిల్లాలు, ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్న విమర్శ వచ్చింది. ముఖ్యమంత్రి అన్నాళ్లు అక్కడే వుండడం పబ్లిసిటీకి పనికి వస్తుంది కానీ కార్యాచరణకు కాదు. ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు, ఎంపీలు.. వీళ్లంతా వెళ్లడం అనవసరం. వెళ్లకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారని భయపడితే, వీళ్లు అసలైన నాయకులు కాదన్నమాట. ఎందుకంటే అన్ని చోట్లకూ ఎలాగూ వెళ్లలేరు. రోడ్డు మీద మొదట తగిలే సహాయశిబిరానికే మీడియాను వెంటపెట్టుకుని వెళ్లగలరు. ఆహారపదార్థాలు, నాయకుల ఓదార్పులు అన్నీ వాళ్లకే. లోతట్టు ప్రాంతాల వాళ్ల గోడు వినేవాడే వుండడు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?