Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రాజధాని కావాలా? వద్దా?

రాజధాని కావాలా? వద్దా?

‘రాజధాని’ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవ సమస్య. ‘చెట్టుకింద కూర్చుని అయినాసరే ఆంధ్రప్రదేశ్ నుంచే పరిపాలిస్తా..’ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్నెళ్ళయినా ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలన్న ఆలోచన చేయడంలేదు. ఇదిగో, అదిగో.. అంటూనే ఆర్నెళ్ళపాటు కాలయపాన చేసేశారు. ‘పరాయి పాలనలో వున్నాం..’ అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు కూడా లేని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించేస్తోంటే అలాగే వుంటుంది మరి. ప్రపంచంలోనే మేటి రాజధానిని నిర్మిస్తాం.. అనే మాటలేకం కరువు లేదు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించేసి ఊరుకోవడం మినహా, అక్కడినుంచి వారంలో ఒక్కరోజైనా పరిపాలన చేయాలన్న ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయడంలేదో ఎవరికీ అర్థం కాకుండా వుంది. విజయవాడకి దగ్గరలో, గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు సర్కార్ ఫిక్స్ చేసింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ రాజధాని ప్రాంత ‘గుర్తింపు’ జరిగింది.

ఎలాగైతేనేం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫలానా చోట అనేది ఫిక్స్ అయిపోయింది. కానీ, రాజధాని నిర్మాణం ఎలా.? ఇదిపడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. సింగపూర్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. మాస్టర్ ప్లాన్‌ని సింగపూర్ ఉచితంగా రూపొందించి ఇస్తుందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అయితే భూ సమీకరణ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. భూముల్ని ఇచ్చేందుకు రాజధాని ప్రాంత రైతులు సుముఖంగా లేరు. కొందరు రైతులు ఓకే చెబుతున్నా, మరికొందరు ససేమిరా అంటుండడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో రైతుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం, ‘వాళ్ళే దారికొస్తార్లే..’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పచ్చని పంట పొలాల్లో రాజధానిని నిర్మిస్తారా.? అంటే, జనం లేని చోట, అడవుల్లో ఎలా రాజధానిని నిర్మిస్తాం.? అని ఏపీ సర్కార్ ఎదురు ప్రశ్నిస్తోంది.

కమిటీలు చెప్తే చెయ్యాలనేం రూలు లేదు..

విజయవాడ పరిసరాల్లో రాజధాని అంత మంచిది కాదు.. అని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తేల్చింది. సామాజిక సమస్యలు, దాంతోపాటుగా వాతావరణ పరంగా ఇబ్బందులు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం.. ఇవన్నీ పేర్కొంటూ అక్కడ రాజధాని నిర్మించడం శ్రేయష్కరం కాదన్నది శివరామకృష్ణన్ కమిటీ వాదన. అయితే దాన్ని ఏపీ సర్కార్ తోసిపుచ్చింది. కమిటీలు చెప్పినట్లే అంతా జరగాలనేం రూలు లేదు. ఉమ్మడి తెలుగు రాష్ర్టం విభజనకు సంబంధించి కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమిస్తే, విభజన మంచిది కాదు.. అనే ఆ కమిటీ తేల్చింది. కానీ, జరిగిందేమిటో అందరికీ తెల్సిందే. ప్రభుత్వాల నిర్ణయాలు అలానే వుంటాయి. ఆ మాత్రందానికి కమిటీలు ఎందుకు వెయ్యాలి.? అనడక్కండి.. అది బ్రహ్మపదార్థం లాంటి ప్రశ్న. ఎవరికీ అర్థం కాదంతే.

అన్నిటికీ ఎదురుదాడే..

శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారు.? అని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘రాజధాని కావాలా? వద్దా.?’ అంటూ ఎదురుదాడికి దిగుతోంది చంద్రబాబు సర్కార్. కమిటీ చూపించిన ప్రత్యామ్నాయాల్లో ఇదే బెటర్.. అని రాష్ర్ట ప్రజలకు చెప్పాల్సిన చంద్రబాబు సర్కార్, ఎన్నికలకు ముందే గుంటూరు  విజయవాడ మధ్యనున్న ప్రాంతమే రాజధానికి అనుకూలం అని తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి, ఎవరు తమను ప్రశ్నించినా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. సామాన్య ప్రజానీకానికి ప్రశ్నించే అవకాశమే లేదు. పోనీ ప్రతిపక్షం ప్రశ్నిస్తే అయినా ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుందా.? అంటే అదీ లేదు. ‘రాజధాని నిర్మాణం మీకు ఇష్టం లేదు..’ అంటూ విపక్షంపై ఎదురుదాడి చేస్తోంది చంద్రబాబు టీమ్. బల ప్రదర్శనే ప్రజాస్వామ్యంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికారపక్షానికి తగిన బలం వుంటే, ఎవరూ ప్రశ్నించేందుకు అవకాశమే లేదు. భూ సమీకరణ విషయాన్నే తీసుకుందాం. ‘మేం భూములు ఇవ్వలేం..’ అని రైతులు ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షం తీసుకొచ్చినా, ‘మీరు రెచ్చగొడ్తున్నారు..’ అని ఎదురుదాడికి దిగడం తప్ప, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలేవీ.!

ఇదేం బ్లాక్‌మెయిల్.!

రాజధాని పేరుతో మొదటినుంచీ చంద్రబాబు సర్కార్ బ్లాక్‌మెయిలింగ్‌కే పాల్పడుతోంది. ‘రైతులు భూములిస్తే గుంటూరు  విజయవాడ మధ్యలో.. లేదంటే ఇంకో చోటకి తరలిపోతుంది..’ అంటూ మొదటినుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే వున్నారు. అది జస్ట్ బెదిరింపుకి.. అంటే బ్లాక్‌మెయిలింగ్‌కి మాత్రమే. ఎందుకంటే, మొదటినుంచీ చంద్రబాబు ఆలోచనలో విజయవాడ  గుంటూరు మధ్యనే ఆగిపోయాయి. మరలాంటపడు ఆయన ‘భూములు ఇవ్వకుంటే..’ అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇక, విపక్షం ప్రశ్నిస్తే చాలు, వెంటనే ‘రాజధానికి వారు వ్యతిరేకం..’ అంటూ దుష్ర్పచారం చాలా తేలిగ్గానే మొదలు పెట్టేస్తోంది అధికార పక్షం. రాజధానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు. రాజధాని ఎక్కడ? అన్నదానిపైనే చర్చ తప్ప, రాజధాని కావాలా? వద్దా? అన్నది చర్చనీయాంశమే కాదన్న విషయం చంద్రబాబు సర్కార్‌కి తెలియక కాదుగానీ, బ్లాక్‌మెయిలింగ్‌కి దిగితే తమ పని తాము చాలా తేలిగ్గా చేసుకుపోవచ్చన్న అధికార పక్షం కుటిల నీతితో రాజధాని వ్యవహారం ప్రతిసారీ వివాదాస్పదమవుతోంది.

రైతుల తరఫున మాట్లాడకూడదా.?

భూ సమీకరణ అని అంటూనే, అవసరమైతే సమీకరణకూ వెనుకాడబోం.. అని చెబుతోంది చంద్రబాబు ప్రభుత్వం. అసెంబ్లీలో సీఆర్‌డీఏ బిల్లు పెడుతున్నట్లు ఇంతకుముందే వెల్లడించిన చంద్రబాబు, బిల్లులో అన్ని విషయాలపైనా స్పష్టత ఇస్తామన్నారు. ‘స్పస్టత ఏదీ..’ అని అసెంబ్లీలో సీఆర్‌డీఏ బిల్లు సందర్భంగా విపక్షం నిలదీస్తే, ‘రూల్స్‌కీ బిల్లుకీ తేడా తెలియదా.?’ అని ఎదురు ప్రశ్నించింది చంద్రబాబు టీమ్. రూల్స్ ఎపడొస్తాయి.? వస్తే, అవెలా వుంటాయి.? అన్నది కొత్త గందరగోళం ఇపడు. సీఆర్‌డీఏకి అన్ని అధికారాల్నీ కట్టబెడుతూ, చట్టం చేసేసిన చంద్రబాబు సర్కార్, రేప్పొద్దున్న ఆ చట్టం ముసుగులో ఏం చసినా చెల్లిపోతుంది. తద్వారా రైతుల ఆవేదనకు, విపక్షాల ఆందోళనకూ అర్థమే లేకుండా పోతుంది.

సేకరణ కన్నా సమీకరణ గొప్పదేగానీ...

మామూలుగా అయితే భూముల్ని సేకరించడం ప్రభుత్వాలకు చాలా తేలికైన వ్యవహారం. ప్రజల గొంతు నొక్కి వివిధ కారణాలతో ప్రభుత్వాలు భూములు సేకరిస్తుంటాయి. సెజ్‌ల కోసం, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం భూముల్ని సేకరించడం, ఈ క్రమంలో ప్రజల రక్తాన్ని పాలకులు కళ్ళజూడటం చాలాకాలంగా జరుగుతోన్న తంతే. దాంతో పోల్చితే, సమీకరణ కాస్త బెటర్. అలాగని పూర్తిగా సమీకరణను సమర్థించే పరిస్థితి లేదిక్కడ. ఎక్కడన్నా భూ సమీకరణ చేస్తే పరిస్థితి వేరు. నిత్యం పంటలతో పచ్చపచ్చగా కనిపించే పంట పొలాల్లో భూ సమీకరణ జరుపుతుండడమే వివాదాస్పదమవుతోంది. పంటల మీద ఆధారపడి రైతు జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో, సమాజానికి తిండి పెడ్తున్నాడు. తాను జీవిస్తూ, పదిమందికి ఆహారం అందిస్తోన్న రైతుల భూములు లాక్కుంటే, జీవన విధ్వంసమే జరుగుతుంది. అసలే దేశంలో ఆహార కొరత పెరిగిపోతోంది. 30 వేల ఎకరాలో యాభై వేల ఎకరాలో పంట భూముల్ని ప్రభుత్వం కాంక్రీట్ జంగిల్‌గా మార్చేస్తే, ఆ ప్రాంతం ద్వారా రావాల్సిన తిండిగింజల్ని ఇంకెక్కడినుంచి సర్దుబాటు చేస్తారు.? 

ఎకరాలు లాక్కొని గజాలు ఇవ్వడమేనా న్యాయం.!

రైతుకి వెయ్యి గజాల నివాస భూమి, కమర్షియల్ భూమి వందో రెండొందల గజాలో ఇస్తామని చెప్పి అదేదో అద్భుతం అన్నట్లుగా చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఎకరా భూమి ధర కోటి రూపాయలనుకుంటే, రేప్పొద్దున్న అభివృద్ధి చెందిన భూమి వెయ్యి గజాలు కోటి రూపాయల ధర పలుకుతుందన్నది చంద్రబాబు వాదన. ఏమో, నిజమేనేమో.! డబ్బుకీ, భూమికీ చాలా తేడా వుంది. నివాస, వ్యాపార స్థలానికీ, పంట భూములకీ వున్న తేడా నక్కకీ నాకలోకానికీ వున్నంత వుంటుంది. ఒక ఎకరం పొలంలో పండించే పంట కేవలం ఆ రైతుకే కాదు, వందలాది మందికి భోజనం పెడ్తుంది. రియల్ మాఫియా రాజ్యమేలుతోన్న ప్రస్తుత తరుణంలో అమాయకపు రైతులు అభివృద్ధి చెందిన నివాస / వ్యాపార స్థలాల్ని ఎంతవరకు నిలబెట్టుకోగలరు.? తిండి కోసమో, భయంతోనో వాటిని అమ్మేసుకుంటే, వారి భవిష్యత్తేంకాను.! దీని గురించి ఎవరు ప్రశ్నించినా చంద్రబాబు వద్ద సమాధానం రూపంలో వున్న ప్రశ్న ఒకటే, ‘రాజధాని కావాలా? వద్దా?’.

కంపెనీలొస్తాయ్.. స్థానికులు పారిపోవాల్సిందే

విదేశీ కంపెనీలొస్తాయి.. ఇంకేవేవో పెద్ద సంస్థలొస్తాయి.. ప్రపంచ స్థాయి నగరం కదా. ఆ మాత్రం బిల్డప్ వుండాల్సిందే. కానీ, సామాన్యుల మాటేమిటి.? రాజధాని ప్రాంత జనం భవిష్యత్తేమిటి.. తలచుకుంటేనే భయమేస్తోంది చాలామందికి. ఎక్కడున్నోళ్ళు అక్కడే స్వేచ్ఛగా బతికే పరిస్థితులు వుండవు. చదువు సంధ్యలు కూడా లేని గ్రామీణ ప్రజానీకం, అభివృద్ధి చెందిన ప్రాంతంలో, రాజధాని నగరంలో మనుగడ సాధించడం చిన్న విషయమేమీ కాదు. చెప్పడానికేం, స్కిల్ డెవలప్‌మెంట్ అనీ, ఇంకోటనీ ఏవేవో కబుర్లు ప్రభుత్వాలు చెబుతాయి. ఆ చెప్పిన మాటలన్నీ చేతల్లో కన్పించాలన్న రూలేం లేదు కదా.! ముఖ్యమంత్రి చంద్రబాబు అపడన్నా హైద్రాబాద్ నుంచి కదలి, ఏపీ కొత్త రాజధానిలో అడుగు పెట్టొచ్చు. కానీ, రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ఇపడున్న ప్రజానీకంలో సగం మంది, ఆ ప్రాంతానికి దూరంగా నెట్టివేయబడే ప్రమాదం లేకపోలేదు.

మొత్తంగా చూస్తే.. రాజధాని విషయంలో సవాలక్ష అనుమానాలు భయాలున్నాయి. అలాగని ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘మీకు రాజధాని కావాలా? వద్దా?’ అని మాత్రమే ఎదురుదాడి చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, ఆయన మంత్రివర్గ సహచరులైనా.. టీడీపీ నేతలైనా. ప్రశ్నకు ప్రశ్న ఎపడూ సమాధానం కాదు. సమాధానం తమ వద్ద లేనపడే ఎదురుదాడి చేస్తారెవరైనా.. చంద్రబాబు ఇందుకు అతీతమేమీ కాదు. ఎందుకంటే ఆయన వద్ద సమాధానం లేదు.! ప్రశ్నించే హక్కు ప్రజలకుంది.. ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత విపక్షాలపై వుంటుంది. అలా ప్రశ్నించే హక్కుని ఎదురుదాడితో పాలకులు కాలరాసేస్తోంటే, ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది.?

 సింధు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?