Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బ్రాహ్మలు శ్రమజీవులు కారా?- 1/2

ఉన్నట్టుండి దీనిపై చర్చ రావడానికి కారణం - కంచ ఐలయ్య గారు. ఆయన హిందూద్వేషి. బ్రాహ్మణద్వేషి. ఆ సంగతి దాచుకోకుండా ఎన్నో వేదికలపై సందర్భం వున్నా లేకపోయినా వెల్లడిస్తూనే వుంటారు. అగ్రకులస్తుల చేతిలో అవస్థలు పడిన అనుభవాలు ఆయనకున్నాయి. దేశంలో భావప్రకటనా స్వాతంత్య్రం వుంది. అందుచేత ఆయనకు తోచినది ఆయన చెప్తూనే వుంటారు, రాస్తూనే వుంటారు. ఒక్కోప్పుడు హద్దు మీరిన సందర్భాల్లో యితరులు ఆయనతో తలపడతారు. వెంటనే ఐలయ్యగారి భక్తగణం వారిపై విరుచుకు పడుతూంటారు. అభిప్రాయాలు చెప్పే హక్కు యీయన కెంత వుందో అవతలివాళ్లకీ అంతే వుందన్న స్పృహ వాళ్లకు లోపిస్తూంటుంది అప్పుడప్పుడు. బ్రాహ్మణులు సోమరులని, తిని పడుక్కోవడం తప్ప వేరేమీ చేయరని ఐలయ్య అన్నట్లు పేపర్లో వార్తలు వచ్చాయి. వాటిని ఆయనేమీ ఖండించలేదు. ఆ వార్తలపై మండిపడిన కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆయన వద్దకు వెళ్లి క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ చెప్పారని వీళ్లు, అబ్బే చెప్పలేదని ఆయనా అంటారు. భయపడి క్షమాపణ చెప్పినా దాన్ని లెక్కలోకి తీసుకోనక్కరలేదు. ఆయన భావజాలం ఎలా వుంది అనేదే చర్చకు వస్తుంది. ఈ సంఘటన తర్వాత ఆయన 'బ్రాహ్మణులు శ్రమజీవులు కారని మాత్రమే అన్నా'నన్నారు. ఆయన ఒక యింటర్వ్యూలో చెప్పినదిది - 'విజయవాడలో సీటూ (సిపిఎం వారి కార్మికసంఘాల కూటమి) సభలో మాట్లాడుతూ ఇండియాలో శ్రామికవర్గం రూపుదిద్దుకున్న సందర్భాన్ని వివరిస్తూ బ్రాహ్మణులు ఎప్పుడూ ఉత్పత్తిలో పాలు పంచుకోలేదని, శ్రమ చేయలేదని అన్నాను.' ఆయన మాటనే విశ్వసిస్తూ ఆయన మాటల్లో ఔచిత్యమెంత అనేది ఆలోచిద్దాం.

అసలు శ్రమ జీవి, ఉత్పత్తిలో పాలు పంచుకోవడం అనే మాటకు అర్థం ఏమిటి? ఫ్యాక్టరీలో సుత్తి పట్టుకుని దెబ్బలు వేసేవాడే శ్రామికుడా? సుత్తి పట్టుకోకుండా సీట్లో కూర్చుని మిషను ఆపరేట్‌ చేసేవాడు శ్రామికుడు కాడా? ఉత్పాదన యొక్క నాణ్యత ఎలా వుందో టెస్ట్‌ చేసే కంప్యూటరున్న ఎసి గదిలో కూర్చుని పర్యవేక్షించేవాడు శ్రామికుడు కాడా? ఫ్యాక్టరీని ప్లాను చేసినవాళ్లు, ఉత్పాదనలను మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి పబ్లిసిటీ డిజైన్లు, యాడ్స్‌ తయారుచేసేవాళ్లు, యింటింటికి తిరిగి సరుకులు అమ్మేవాళ్లు, ఫ్యాక్టరీ ఆర్థికపరమైన లావాదేవీలు చూసేవారు, దానికి రక్షణ కల్పించేవాళ్లు, కార్మికుడు గాయపడితే చికిత్స చేసే వైద్యులు, వీళ్లందరికీ యీయీ విద్యల్లో తర్ఫీదు యిచ్చిన అయ్యవార్లు - వీళ్లెవరూ శ్రామికులు కారా? చెమట కార్చినవాడే శ్రామికుడా? కళ్లతో, బుర్రతో పనిచేసేవాడు శ్రామికుడు కాడా? ఉత్పత్తిలో భాగస్వామి కాడా? అసలు వీళ్లందరి సామర్థ్యాలను పరీక్షించి చూసుకుని, వారిపై నమ్మకంతో పెట్టుబడి పెట్టి, లాభనష్టాలతో ప్రమేయం లేకుండా వీరందరికీ జీతాలు యిచ్చి పెట్టుకున్న సాహసి ఐన పెట్టుబడిదారుణ్ని ఉత్పత్తిలో పాలుపంచుకున్నట్లు లెక్క వేస్తారా లేదా? వీరందరినీ విస్మరించి ఎండలో స్వేదం చిందించినవాడు మాత్రమే మొత్తం ఉత్పత్తికి కారకుడు అని తీర్మానిస్తే అంతకంటె పొరపాటు మరొకటి వుండదు. శారీరక శ్రమ గొప్పది, బౌద్ధిక (బుద్ధితో చేసే) శ్రమ తక్కువది అనుకుంటే మూర్ఖత్వమే. యంత్రంలో భాగాలు పేద్ధగా, భీకరంగా, బలంగా వుండవచ్చు. కానీ కరంటు స్విచ్‌ వేయకపోతే అది పని చేయదు. కరంటు వచ్చేది సన్నటి వైర్లద్వారానే. సన్నగా, పీలగా వుంది కదాని వైర్లు పీకేస్తే యంత్రం మూలపడుతుంది. శరీరాన్ని నడిపించే పాదాల నుంచి, అంగాలన్నిటికీ సంకేతాలు పంపే మెదడు దాకా అన్నీ ముఖ్యమైనట్లే, సమాజాభివృద్ధికి దానిలో వున్న అన్ని వర్గాల సహకారమూ అవసరమే అనే మౌలిక అవగాహన కొరవడకూడదు.

బ్రాహ్మడు అనగానే కొంతమందికి కళ్లముందు గుండు, పిలకతో పూజారి లేదా పురోహితుడి రూపం ఒక్కటే కళ్లక్కడుతుంది కాబోలు. బ్రాహ్మల్లో ఎంతమంది ఆ వృత్తిలో వున్నారో కాస్త దృష్టి సారిద్దాం. నా దగ్గర గణాంకాలు ఏమీ లేవు. ఉజ్జాయింపు లెక్కలతో ముందుకు సాగుదాం. జనాభాలో బ్రాహ్మలు 3-4% వుంటారంటారు. పోనీ 3% అనుకుందాం. తెలుగు రాష్ట్రాల జనాభా 8 కోట్లు అనుకుంటే వీళ్ల సంఖ్య 24 లక్షలు. వారిలో స్త్రీలు సగభాగం అనుకుంటే 12 లక్షల మంది పురుషులు. వారిలో పిల్లలు, వృద్ధులను పక్కన పెడితే వృత్తి చేయగల స్థితిలో వున్నవాళ్లు 6 లక్షలనుకుందాం. ఒక గుడిలో పూజారులు ఎంతమంది వుంటారు? చాలా గుళ్లల్లో ఒకరే వుంటారు. ఒకే కాంపౌండులో రెండు, మూడు వుంటే ఒకాయనే అటూయిటూ తిరుగుతూ తీర్థం యిస్తూ వుంటాడు. పెద్ద గుళ్లల్లో నలుగురు వుంటారనుకున్నా, సరాసరిన గుడికి యిద్దరు పూజారులు అనుకుంటే యీ 6 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి 3 లక్షల గుళ్లు వుండాలి. ఉన్నాయా? ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలోనూ లేవు. పైగా కొన్ని గుళ్లల్లో బ్రాహ్మణేతరులే పూజారులు. ఇక పురోహితుడు. గ్రామానికి ఒకళ్లిద్దరు వుంటే సరిపోతుంది. ఎందుకంటే మూఢాలని, శూన్యమాసాలని, ముహూర్తాలు లేవనీ ఏదో కారణం చెప్పి నెలకు మూడు, నాలుగు శుభకార్యాల కంటె వుండడం గగనం. వాటికి వచ్చే దక్షిణతో బతకాలంటే ఎంత కష్టం? దానిలో పోటీదారులు కూడా వుంటే ఎవరికీ వ్యాపకం వుండదు. చెప్పదలచినదేమిటంటే వైదిక (వేదసంబంధమైన) వృత్తిని నమ్ముకుని జీవించే బ్రాహ్మలు అతి తక్కువ. ( వీరు శ్రమజీవులా కాదా అనే చర్చ తర్వాత చేద్దాం) ఉన్నవాళ్లని చూసి బ్రాహ్మలందరూ యిదే వృత్తిలో వున్నారనుకోవడం అవివేకం.

మరి తక్కిన బ్రాహ్మణులు జీవనోపాధికి ఏం చేస్తూ వుంటారు? ఉద్యోగుల్లో చాలామంది బ్రాహ్మణులు కనబడతారు. తెలుగు నాట అయితే కాకతీయుల కాలంలో జైనద్వేషి అయిన గణపతిదేవుడు అప్పటిదాకా ఉద్యోగాలలో వున్న జైనులను తొలగించి, వారి స్థానంలో ఆరువేల మంది బ్రాహ్మణులను ఒక్కసారిగా నియోగించాడని, అప్పణ్నుంచే వారిని ఆరువేల నియోగులు అంటారని చెప్తారు. అంతకుముందు నుంచి బ్రాహ్మణులు మంత్రులుగా వున్నారు. చాళుక్యయుగంలో బ్రాహ్మణులు మంత్రి, సామంత, దండనాయకాది ఉన్నతపదవులు ఆక్రమించి వుండేవారని, కాకతీయ యుగం వచ్చేసరికి యితర కులస్తులు కూడా ఆ యా పదవులకు ఎదిగారని చరిత్ర పుస్తకాలు చెపుతున్నాయి. రాత్రికి రాత్రి మంత్రులు, దండనాయకులు అయిపోరు. సైనికులుగా చేరి యుద్ధప్రావీణ్యం చూపితేనే సైన్యంలో పైకి వస్తారు. మంత్రికి కూడా సకల ఆయుధాలలో నైపుణ్యం వుండాలి. బ్రాహ్మణ సైన్యాధికారుల్లో కొంతమంది రాజులయ్యారు. సైన్యంలో చేరేవారు కొందరైతే విద్యార్జనలో, విద్యగరపడంలో మునిగినవారు కొందరు. ఆనాటి విద్య అంటే వేదాలు వల్లించడం, శాస్త్రాలు నేర్పడం మాత్రమే కాదు, ఆయుధవిద్య నేర్పడం కూడా. ద్రోణుడు, కృపుడు - వీళ్లంతా బ్రాహ్మణులే కదా, కురువంశీకులకు క్షాత్రవిద్య నేర్పినది వీరే కదా. వైద్యులుగా, పరిశోధకులుగా, విద్వాంసులుగా, కవులుగా, రచయితలుగా, సంగీతకారులుగా, నృత్యకారులుగా, కళాకారులుగా జీవనం సాగించిన బ్రాహ్మణులెందరో! - (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?