కొత్తవి సరే, యిప్పుడున్న ఎయిమ్స్‌ ఎలా వున్నాయి?

మొన్న బజెట్‌లో పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లతో బాటు ఆంధ్ర రాష్ట్రానికీ ఒక ఎయిమ్స్‌ ఆసుపత్రి శాంక్షనైంది. మరి మా సంగతేమిటంటూ తెలంగాణ ఎంపీలు వెళ్లి హెల్త్‌ మినిస్టర్‌ను అడిగారు. 'మీ హైదరాబాదు…

మొన్న బజెట్‌లో పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లతో బాటు ఆంధ్ర రాష్ట్రానికీ ఒక ఎయిమ్స్‌ ఆసుపత్రి శాంక్షనైంది. మరి మా సంగతేమిటంటూ తెలంగాణ ఎంపీలు వెళ్లి హెల్త్‌ మినిస్టర్‌ను అడిగారు. 'మీ హైదరాబాదు మెడికల్‌ టూరిజంకు సెంటర్‌గా మారింది కదా, మీకు ఎయిమ్స్‌ అవసరమా?' అని అడిగాడట ఆయన. అధికారికంగా ప్రకటన ఏదీ వెలువడలేదు కానీ, 'మేం తెలంగాణకు ఎయిమ్స్‌ కావాలని పట్టుబడితే హర్షవర్ధన్‌ సరేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థలం చూపించలేకపోతోంది.' అంటూ కిషన్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. నిజానిజాలు వాళ్లకే తెలియాలి కానీ యీ సందర్భంలో గతంలో శాంక్షనైన ఎయిమ్స్‌ ఎలా వున్నాయో ఓ సారి పరికిస్తే కాస్త కళ్లు తెరుచుకుంటాయి. ఎయిమ్స్‌కి మాతృసంస్థ అయిన ఢిల్లీ ఎయిమ్స్‌లో అక్కడి డాక్టర్లు రోజూ 7 వేల నుండి 9 వేల మంది పేషంట్లను చూస్తారు. ఏడాదికి లక్షన్నర ఆపరేషన్లు చేస్తారు. ఇది డాక్టర్లకు తలకు మించిన భారం. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అక్కడకు పేషంట్లు వస్తున్నారు. వేర్వేరు చోట్ల అటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తే వాళ్లపై భారం తగ్గుతుందని పాలకులు భావిస్తూ ప్రణాళికలు రచిస్తూంటారు. కానీ అమలులోకి వచ్చేసరికి అవి దెబ్బ తింటున్నాయి. 

వాజపేయి ప్రధానమంత్రిగా వుండగా 2003లో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజనా పథకం కింద ఆరు ఎయిమ్స్‌ ప్రకటించారు. వాటిల్లో రాయపూర్‌ ఎయిమ్స్‌ ఒకటి. ఇంచుమించు అన్నిటి పరిస్థితీ ఒకేలా వుంది కాబట్టి రాయపూర్‌ సంగతి తెలుసుకుంటే చాలు. దానిపై రూ. 1500 కోట్లు ఖర్చు పెట్టవలసి వుండగా యిప్పటిదాకా రూ. 800 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా సౌకర్యాల లేమితో బాధపడుతోంది. రోజుకి 1500 మంది పేషంట్లకు సేవలందించే వెయ్యి పడకల ఆసుపత్రి కడతాం అన్నారు కానీ భవన నిర్మాణం యింకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి 150 బెడ్స్‌ అమిరాయి. ట్రామా కేర్‌ వార్డ్‌కై కట్టిన హాల్లో పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, ఆఫ్తలమాలజీ, గైనికాలజీ, ఇఎన్‌టి విభాగాలు పని చేస్తున్నాయి. విభిన్న విభాగాలకు సంబంధించిన డాక్టర్లు బ్యాంకులో కౌంటర్లలా పక్కపక్కన టేబుళ్లు వేసుకుని పేషంట్లను చూసేస్తూంటారు. రోజుకి 500 నుండి 700 మంది పేషంట్లు వస్తున్నారు. వారిని చూడడానికి డాక్టర్లు సరిపోవటం లేదు. డాక్టర్లకు ట్రెయినింగ్‌ యిచ్చే ప్రొఫెసర్లు చాలినంతమంది లేరు. ఫ్యాకల్టీకై 305 మందిని శాంక్షన్‌ చేస్తే పనిచేస్తున్నవారు 70 మంది మాత్రమే. ఇక వైద్యవిద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఎవరి వద్ద నేర్చుకుంటారు? నేర్చుకున్న అరకొర వైద్యంతో రోగులకు చికిత్స చేయాలని చూస్తున్నారు. 

దీనితో పాటు శాంక్షనైన భోపాల్‌, భువనేశ్వర్‌, పట్నా, జోధ్‌పూర్‌, రిషీకేష్‌ ఎయిమ్స్‌లో కూడా యించుమించు యిదే పరిస్థితి. ఎందుకిలా అంటే 'అనుభవం వున్న డాక్టర్లను హెచ్చు జీతాలిచ్చి కార్పోరేట్‌ ఆసుపత్రులు లాగేసుకుంటున్నాయి. అంతేకాదు, ఎవరి డిపార్టుమెంటును వాళ్లు యిష్టప్రకారం నడుపుకునే, తనకు నచ్చిన దిశగా పరిశోధన చేసుకునే స్వేచ్ఛ అక్కడుంది. ఎయిమ్స్‌లో అది లేదు, పైగా స్టాఫ్‌ క్వార్టర్స్‌ లేవు. ఆధునిక సౌకర్యాలు లేవు. ఆధునీకరణ గురించి పట్టించుకోవటం లేదు. పాత బిల్డింగులలో ఇంకా కాపర్‌ వైరే వుంది. టెలిమెడిసిన్‌ గురించి మాట్లాడే ఈ రోజుల్లో ఆప్టిక్‌ ఫైబర్‌ వైర్‌ వేయించకపోతే ఎలా? అమెరికా వంటి దేశాల్లో డాక్టర్లకు రిటైర్‌మెంట్‌ వయసంటూ వుండదు. ఓపిక వున్నంతకాలం రోగులను చూస్తూనే వుంటారు. ప్రభుత్వాసుపత్రి కాబట్టి ఎయిమ్స్‌లో అనుభవజ్ఞులైన డాక్టర్లను కూడా వయోపరిమితి పేరుతో పంపించి వేస్తారు. 

యువడాక్టర్లను పరిశోధనవైపు పురికొల్పాలంటే అనుభవజ్ఞులైన సీనియర్‌ డాక్టర్లు ఫ్యాకల్టీలో వుండి తీరాలి.' అని చెప్పారు కొంతమంది. డా|| హర్షవర్ధన్‌ జులై 20 న భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కు వెళ్లి చూసి పెదవి విరిచారు. '305 ఫ్యాకల్టీ వుండవలసిన చోట కేవలం 65 మంది వున్నారు. సరైనవాళ్లు దొరక్కపోతే కాంట్రాక్టు బేసిస్‌మీదనైనా కనీసం రెండేళ్లపాటు తీసుకోమని చెప్పాను' అని ప్రెస్‌తో అన్నారు.

చూడబోతే ఎయిమ్స్‌ శాంక్షనైనందుకు పొంగిపోనక్కరలేదని, కానందుకు కృంగిపోనక్కరలేదని తోస్తోంది. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]